Home వరంగల్ రూరల్ రక్త చరిత్ర పునారావృతం..!

రక్త చరిత్ర పునారావృతం..!

 Murders in the village

మన తెలంగాణ/ వరంగల్ బ్యూరో : రక్తచరిత్ర పునారావృతమవుతోంది. గత కాలపు రక్తపు మరకల తడి ఆరడం లేదు. గత ఇరవై ఏండ్లుగా అరాచకులు పురివిప్పుతూనే ఉన్నారు. ఒకరు పోతే మరొకరు పుట్టుకొస్తూనే ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూత్‌పల్లి–, వడితల కొత్తపల్లి ( ఎస్‌ఎం) గ్రామంలో గత కొన్నేండ్లుగా దాదాగిరి సంస్కృతి కొనసాగుతూనే ఉంది. పగలు ప్రతికారాలు సినిమాలలోనే చూసే జనానికి నిజమైన హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు ఆ గ్రామం నిలయంగా మారుతోంది. తాజాగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ పులి వెంకటేశ్వర్లుపై అదే గ్రామానికి చెందిన యువకులు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని గొడ్లండ్లు, కర్రలతో దాడి చేసిన సంఘటన జనాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఆ గ్రామ ప్రజలతో పాటు మండల వ్యాప్తంగా గత చరిత్రను గుర్తు చేసింది. ఒకప్పుడు ఇదే తరహాలో కొంత మంది యువకులు ఒకరి తరువాత ఒకరు గ్రామంలో విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజలు అమాయకులపై దౌర్జనాలకు పాల్పడ్డ ఉదాంతాలున్నాయని వారంతా జనం చేతిలోనే బహిరంగంగా చంపబడ్డ సంఘటనలను జనం గుర్తు చేసుకోవడం గమనార్హం. గత కొన్నేండ్ల కింద జానీ అలియాస్ జానార్థన్ రౌడిగా వ్యవహరించడం, జనాన్ని నానావిధాలుగా ఇబ్బందులకు గురి చేయడం, దాడులు చేయడం, ప్రశ్నిస్తే… కత్తులు, కర్రలతో దాడులు చేయడం లాంటి చర్యలకు పాల్పడే వాడని అలాంటి వ్యక్తిని ఓ సంఘటన నేపథ్యంలోనే ప్రజలంతా కలిసి బహిరంగంగా కొట్టి చంపిన సంఘటన ఆ గ్రామంలోనే జరుగడం గమనార్హం. అంతకన్న ముందు కాలాన్ని పరిశీలించినట్లైతే.. లింగాల గ్రామానికి చెందిన గడ్డం రమేష్ గ్రామంలో అరాచకాలు సృష్టిస్తుంటే గ్రామస్తులే పెట్రోల్‌పోసి గ్రామ కూడలిలో దహనం చేసిన ఉదాంతాలున్నాయి.ఈ ఘటన మరువక ముందే లక్ష్మినారాయణ అనే వ్యక్తికి స్వయాన అన్నకొడుకులే కుటుంబ తగాదాలతో కత్తులతో పొడిచి చంపిన ఘటన అప్పట్లో గ్రామంలో విషాధాన్ని నింపింది. ఇవన్నీ గ్రామంలో అరాచకలు సృషించడం వల్ల గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వల్ల జరిగినవేనేది గమనార్హం.

పాత కక్షలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, కారణం ఏదైనప్పటికీ హత్యలు జరుగడం గ్రామంలో రక్తపుటేరులు పారడం ఆగడంలేదనేది గమనార్హం. దాడులు,ప్రతిదాడుల నేపథ్యంలో గ్రామంలో రక్తచరిత్ర దూత్‌పల్లి, ఒడితల కొత్తపల్లి గ్రామంలో కొనసాగుతూనే ఉందని తాజా ఘటన రుజువుచేస్తోంది. కొంత కాలంగా స్తబ్థతగా ఉన్న గ్రామంలో తాజాగా గ్రామ మాజీ సర్పంచి పై కొందరు యువకులు గొడ్డలి, కర్రలతో దాడి చేయడం గత చరిత్రను గుర్తు చేసినట్లైంది.గ్రామంలో జరుగుతున్న ఘటనలు రక్త చరిత్ర సినిమాను తలపిస్తోందనడం గమనార్హం. తాజా సంఘటనతో గ్రామంలో రక్త చరిత్ర మళ్లీ మొదలైందని జనం జంకుతున్నారు. గత కాలపు రక్తపు మరకలు గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే గ్రామానికి చెందిన జానీ అనుచరున్ని గ్రామస్తులు పెట్రోల్‌పోసి చంపారు. దీంతో జానీ జనాన్ని మరింత భయపెట్టే విధంగా వ్యవహరించడంతో విసిగెత్తిన జనం బహిరంగంగా జానీని కొట్టి చంపిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఇక ఇదే తరహాలో గ్రామానికి చెందిన కొంత మంది యువకులు జానీ తరహాలో వ్యవహరించడం గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పలువురు భావిస్తున్నారు. ఒకరు పోతే మరొకరుగా పుట్టుకురావడం, గ్రామంలో గత కాలపు రక్తచరిత్రను పునారావృత్తం చేయడం గమనార్హం. అయితే దూత్‌పల్లి, ఒడితల కొత్తపల్లి గ్రామాలు రెండూ వేరువేరు గ్రామాలైనప్పటికీ ఈ రెండు గ్రామాలు మిలీతమై ఉంటాయనేది గమనార్హం.

కలిసే ఉన్నా…మండలాలు వేరు…!
దూత్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలు మిలీతమై ఉన్న గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. దూత్‌పల్లి చిట్యాల మండలంగా, కొత్తపల్లి భూపాలపల్లి మండలంలో ఉన్నాయి. దీంతో తగాదాలు ఏర్పడే క్రమంలోనూ పోలీసుల పరిధులు వేరవుతున్నాయని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రక్తచరిత్రను తలపించే గ్రామంలోనూ పోలీసుల నిఘా లేకపోవడం దురదృష్టకరంగా జనం భావిస్తున్నారు. పోలీసు యంత్రాంగం సైతం పకడ్బందిగా గ్రామంపై దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని, భవిష్యత్‌లోనూ ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు భావిస్తున్నారు