Tuesday, April 23, 2024

మూసీపై కబ్జాల కంపు

- Advertisement -
- Advertisement -

Musi river beautification by 2024

 

22కి.మీ పొడవునా 10వేల ఆక్రమణలు

కబ్జాలను తొలగించి పేదలకు పునరావాసం దిశగా ప్రణాళికలు
2024లోగా మూసీ సుందరీకరణ
సైకిల్‌ట్రాక్‌లు, వాక్‌వేలు, పార్క్‌లు, నదికి ఇరువైపులా రోడ్లు
రూ.10వేల కోట్లు కేటాయింపు
మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా సిఎం కెసిఆర్ ప్రణాళిక
మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : అనేక సంవత్సరాలుగా మూసీనది ఆక్రమణలకు గురవుతోంది. గత ప్రభుత్వాలు మూసీనది కబ్జాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం మూసీ పక్క నుంచి నడవాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మూసీ ఆక్రమణలతో పాటు మూసీనది సుందీరకరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దానిని ప్రస్తుతం మూసీ ఆక్రమణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం 2024 సంవత్సరం కల్లా ఈ సుందరీకరణ పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం ఉన్న 10 వేలకు పైగా కబ్జాలను తొలగించి అక్కడ ఉన్న పేదవారికి పునరావాసం కల్పించే దిశగా ప్రణాళికలు చేపడుతున్నాం.. ప్రస్తుతం రివర్‌బోర్డు, బఫర్‌జోన్, ఆక్రమణలను గుర్తించాం. వచ్చే సంవత్సరం మార్చి నుంచి సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొంటున్నారు. శనివారం మూసీ నది సుందరీకరణపై ‘మన తెలంగాణ’ కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ నదిని ఎలా అభివృద్ధి చేస్తున్నారు ? ఆక్రమణదారులకు ఎలాంటి పునరావాస చర్యలను చేపట్టనున్నారో ఆయన మాటల్లోనే…..

గత ప్రభుత్వాల హయాంలో ఈ మూసీ కబ్జాలకు గురయ్యింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ నదిని సుందరీకరించాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం భావించినా కాళేశ్వరం, రైతుబంధు, డబుల్ బెడ్‌రూం, గురుకులాల కోసం బడ్జెట్‌ను కేటాయించింది. ప్రస్తుతం ఈసారి మూసీ సుందరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2 నుంచి 4 సంవత్సరాల్లో మూసీని సుందరీకరించడంతో పాటు పర్యాటకులు బోట్లలో షికారు చేసేలా దీనిని తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే రూ.10వేల కోట్లను జిహెచ్‌ఎంసితో పాటు మూసీరివర్ ఫ్రంట్ బోర్డుకు కలిపి నిధులు కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బఫర్‌జోన్, రివర్‌బోర్డుల గుర్తింపునకు 5 నుంచి రూ.6 కోట్లు మాత్రమే అవసరం కాగా దీనికి 4 నెలల నుంచి 6 నెలల సమయం పట్టింది. 2020 ఫిబ్రవరిలో తనను సిఎం మూసీరివర్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. మార్చి 22వ తేదీ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో నాలుగు నెలల పాటు పనులు ముందుకు సాగలేదు. జూలై నుంచి మూసీ సర్వే పనులు చేపట్టడంతో పాటు బఫర్ జోన్‌లను గుర్తించే పనులను ప్రారంభించాం. ఈ ఆరు నెలల కాలంలో పలు ఆక్రమణలను గుర్తించాం. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన జాబితాను వెల్లడిస్తాం. 2017 వరకు బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు (22 కి.మీలు) మేర 6,700 ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించగా, ప్రస్తుతం మరో 4,000ల పైచిలుకు ఆక్రమ కట్టడాలను గుర్తించాం.

ఈ ఆక్రమణలను తొలగిస్తేనే మూసీనది అభివృద్ధి

ఈ ఆక్రమణలను తొలగిస్తేనే మూసీనదిని అభివృద్ధి చేయగలుగుతాం. అయితే ఆక్రమణలో ఉన్న వారు పేదవాళ్లు. వాళ్లకు కూడా ప్రభుత్వం కచ్చితంగా పునరావాసం కల్పించాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఈ ఆక్రమణల కూల్చివేత తరువాత మూసీ మాస్టర్ ప్లాన్‌తో పాటు రోడ్డు డెవలప్‌మెంట్‌ల ఆధ్వర్యంలో మూసీని ఇరువైపులా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మార్చి 2021 నెలఖారుకు మూసీ మాస్టర్‌ప్లాన్ వస్తుంది. అంతలోపు మూసీపై ఉన్న ఆక్రమణదారులను తొలగించి వారికి పునరావాసం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ తయారయిన తరువాత వచ్చే సంవత్సరం నుంచి రూ.600ల నుంచి రూ.900 కోట్లు ఖర్చు అవుతుంది.

రోడ్ల అభివృద్ధికి, మూసీ రివర్ మాస్టర్ ప్లాన్‌ల కోసం టెండర్ల ఆహ్వానం

రానున్న రోజుల్లో మూసీనది అభివృద్ధి చూసి మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారు. మూసీ సుందరీకరణ పనులు 2024 లేదా 2026 సంవత్సరంలో పూర్తిస్థాయిలో పూర్తవుతాయి. మూసీనది సుందరీకరణ పూర్తయితే నగరవాసి గుండెలనిండా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే సాయంకాలం చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసీ ఒడ్డున కూర్చునేలా దీనిని తీర్చిదిద్దుతున్నాం. రోడ్ల అభివృద్ధికి, మూసీ మాస్టర్ ప్లాన్‌లకు, వాక్‌వేలు (చెట్ల పెంపకానికి)లకు సంబంధించి ఇప్పటికే టెండర్‌లను పిలిచాం. మురుగునీరు, వర్షంనీటిని శుద్ధి చేయడానికి కొత్తగా 64 ఎస్టీపిలను (సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను) ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయడానికి చర్యలు చేపట్టాం. నదికి ఇరువైపులా రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.

మూసీ నీరు ఒకే ప్రవాహంగా వెళ్లేలా….

రానున్న రోజుల్లో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గండిపేటలోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నింపుతాం. తదనంతరం మూసీనదిలోకి ఆ నీటిని ప్రవహించేలా చేసి ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలను నిర్మించి భూగర్భజలాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మూసీ సుందరీకరణలో భాగంగా మూసీనదికి ఇరువైపులా 15 మీటర్లు వదిలిపెట్టి రోడ్లతో పాటు సైకిల్‌ట్రాక్‌లు, వాకర్స్ కోసం (వాక్ వేలను) పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. 10 రోజుల క్రితం వర్షం కురిసినప్పుడు డ్రోన్‌ల ద్వారా మూసీనదిని చిత్రీకరించి నీరు పారే విధానాన్ని పరిశీలించాం. అందులో భాగంగా రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షపాతం కురిసినా మూసీనదికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వర్షంనీరు సాఫీగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం వర్షాలు కురిసినప్పుడు మూసీనది పలు రకాలుగా పాయలుగా విడిపోయి బయటకు వెళుతోంది. రానున్న రోజుల్లో ఒకే పాయగా (ఒకే ప్రవాహంగా) వెళ్లేలా దీనిని తీర్చిదిద్దుతున్నాం. మూసీనది వల్ల ప్రస్తుతం దోమలు ఎక్కువయ్యాయి, వాటి నివారణకు చర్యలు చేపట్టాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News