Friday, March 29, 2024

పడగ నీడలో మయన్మార్!

- Advertisement -
- Advertisement -

Myanmar under Military rule

 

ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం. అంతర్జాతీయ మద్దతుతో స్వదేశంలోని సైనిక నియంతలపై సాగించిన పోరాటంలో సుదీర్ఘ నిర్బంధాన్ని అనుభవించిన మహిళా నేత , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సోమవారం వేకువ జామున తిరిగి గృహ ఖైదీ అయిపోయారు. ఆమెతో పాటు ఎన్నికైన పార్లమెంటు సభ్యులందరినీ సైన్యం నిర్బంధంలో ఉంచింది. సూకీ మంత్రి వర్గాన్ని రద్దు చేసి కీలుబొమ్మ కేబినెట్‌ను ప్రకటించింది. దేశం లోపలికి, బయటికి రాకపోకలు నిషేధించారు. రాజధాని నేపియాడ్, పాత రాజధాని (ఒకప్పటి రంగూన్) యాంగూన్‌లో సైనిక కవాతులు ప్రతిధ్వనించాయి. సూకీ పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టిన గత నవంబర్ పార్లమెంటు ఎన్నికలు మోసపూరితమైనవని ఆరోపిస్తూ సైన్యం ఈ తిరుగుబాటుకు తలపడింది.

కొత్త పార్లమెంటు కొలువుదీరవలసిన రోజు తెల్లవారు జామున ప్రజాస్వామ్యంపై విరుచుకుపడింది. ఎన్నికల మోసాన్ని సరిదిద్దాలని తాము సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోడం వల్లనే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు సైన్యం వెల్లడించింది. ఇది ఎంత బూటకమో చెప్పనక్కర లేదు. మయన్మార్ సైనికుల తీరు, పక్షి తన బిడ్డలను కాపాడడం లేదని ఆరోపిస్తూ పాము వాటిని కబళించిన చందంగా ఉంది. ఏడాది పాటు దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటామని సైనిక పాలకులు ప్రకటించారు. అయితే మయన్మార్ ప్రజలు ఎప్పటి మాదిరిగానే నూతన పరిణామాలను ద్వేషిస్తున్నారని వార్తలు చెబుతున్నాయి. తాము దీనిని అంగీకరించబోమని మీడియాతో మాట్లాడిన చాలా మంది మయన్మార్ వాసులు అభిప్రాయపడినట్లు తెలిసింది. గతంలో దశాబ్దాల తరబడిగా సాగిన సైనిక ఏలుబడిలో మయన్మార్ ప్రజలు సర్వ స్వాతంత్య్రాలనూ కోల్పోయారు. అంతర్జాతీయ సమాజం మద్దతు మయన్మార్‌కు కొరవడింది. ఆ చీకటిని తలచుకునే వారెవరికైనా మళ్లీ ఆ రోజులు దాపురించకూడదని అనిపిస్తుంది.

తాజాగా సైన్యం దేశాన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే అంతటా సమాచార సంబంధాలు తెగిపోయాయి. టెలివిజన్లు మూగవోయినట్టు వార్తలు చెబుతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వ నిర్వహణలోని భజన పత్రిక తప్ప సొంత గొంతుతో నడిచే ఏ ఇతర మీడియా సంస్థ కూడా మనడానికి వీల్లేకుండా సైన్యం ఉక్కు పాదం మోపింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ తాండవిస్తుంది. మయన్మార్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. సైన్యం వెనక్కి తగ్గి మొన్నటి ఎన్నికల విజయాలను గౌరవించకపోతే తీవ్ర ఆంక్షలు విధించవలసి వస్తుందని హెచ్చరించినట్టు వార్తలు చెబుతున్నాయి. బైడెన్ హితవును సైనిక పాలకులు చెవిన పెడతారని అనుకోలేము. మయన్మార్ నియంతల పట్ల అమెరికా ఎప్పుడూ తగినంత తీవ్రతను చూపించలేదు. తన ప్రయోజనాలు ఇమిడి ఉన్న అరబ్ దేశాలపై వ్యవహరించినంత కఠినంగా మయన్మార్ విషయంలో నిర్ణయాలు తీసుకోలేదు.

మయన్మార్ సరిహద్దు దేశమైన చైనా అక్కడి సైనిక నియంతలకు అండగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ జరిగింది మంత్రి వర్గ మార్పు మాత్రమేనని చైనా చేసిన వ్యాఖ్య గమనించదగినది. ప్రపంచ దేశాలన్నీ అక్కడి పరిణామాలను ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవిగా వర్ణిస్తే చైనా మాత్రం దానిని అతిపెద్ద మంత్రి వర్గ మార్పుగానే చూస్తుండడం గమనించవలసిన విషయం. ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో గత కొంత కాలం మయన్మార్‌లో సాగింది పూర్తి ప్రజాస్వామిక పాలన కాదు. ఆమె కనుసన్నల్లోనే అక్కడ రోహింగ్యాలపై దారుణ మారణకాండ జరిగిపోయింది. 7 లక్షల 50 వేల మంది రోహింగ్యాలు దేశాన్ని విడిచి బంగ్లాదేశ్‌లో తలదాచుకోవలసి వచ్చింది.

ఈ పరిణామం ఆమె సారథ్యానికి మాయని మచ్చను తెచ్చింది. ప్రజాస్వామిక దేశాలనిపించుకుంటున్న చోట కూడా నియంతృత్వ అధికారాల ను చెలాయించే పోకడలు తీవ్ర రూపం ధరిస్తున్న వర్తమాన ప్రపంచంలో మయన్మార్ మళ్లీ తన ప్రజాస్వామ్య స్వప్నాన్ని ఫలింపజేసుకోడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేము. పాలకుల స్వార్థాలకు పదే పదే బలైపోతున్న ఆ చిన్న దేశానికి, మనకు మధ్య 1600 కిలోమీటర్ల అతిపొడవైన సరిహద్దు ఉంది. మయన్మార్‌లో తిరుగుబాటు చేసే శక్తులు ఈ సరిహద్దుల్లో తలదాచుకోడమూ తరచుగా జరుగుతుంటుంది. అందుచేత అక్కడి పరిణామాల పట్ల మన పాలకులు వ్యవహరించే తీరుకు విశేష ప్రాధాన్యముంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News