Home స్కోర్ క్వార్టర్స్ లో నాదల్, హలెప్

క్వార్టర్స్ లో నాదల్, హలెప్

నాదల్ జోరు…

పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నాదల్ జోరు కొనసాగిస్తున్నాడు. మరో టైటిల్‌పై కన్నేసిన నాదల్ అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో నాదల్ 63, 62, 76 తేడాతో జర్మనీ ఆటగాడు మాక్సిమిలన్ మార్టరర్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే నాదల్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. అతని ధాటికి మార్టరర్ ఎదురు నిలువలేక పోయాడు. మొదటి సెట్‌లో పోరు ఏకపక్షంగా సాగింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో విరుచుకు పడిన నాదల్ లక్షం వైపు సాగాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మరింత చెలరేగి పోయాడు. అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం నాదల్‌కు ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘట ఎదురైంది. మార్టరర్ చూడచక్కని షాట్లతో అలరించాడు. ఇదే క్రమంలో నాదల్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. కానీ, కీలక సమయంలో మార్టరర్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నాదల్ సెట్‌ను, మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Nadal and Halep Enter to Quarters in French Open

పారిస్: టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో క్వా ర్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే ఆరోసీడ్ కెవిన్ అండర్స న్ (సౌతాఫ్రికా), ఏడో సీడ్ కరొలైన్ గార్సియా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. అర్జెంటీనా స్టార్ డిగో షావర్ట్‌జ్‌మా న్, అంజెలిక్ కెర్బర్ (జర్మనీ)లు నాలుగో రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. కాగా, గాయం వల్ల అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో రష్యా క్రీడాకారిణి మారియా షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

అండర్సన్ ఇంటికి…

మరో పోటీలో ఆరో సీడ్ కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) ఓటమి పాలయ్యాడు. అర్జెంటీనా ఆటగాడు, పదకొండో సీడ్ డిగో షావర్ట్‌జ్‌మాన్‌తో జరిగిన పోరులో అండర్సన్‌కు ఓటమి ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఐదు సెట్ల మారథాన్ సమరంలో డిగో 16, 26, 75, 76, 62 తేడాతో అండర్సన్‌ను ఓడించాడు. ప్రారంభంలో అండర్సన్ పైచేయి సాధించాడు. దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌పై పట్టు సాధించాడు. డిగోకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో తొలి రెండు సెట్లను సునాయాసంగా సొంతం చేసుకున్నాడు. కానీ, మూడో సెట్ నుంచి సీన్ రివర్స్ అయ్యింది. డిగో తన జోరును పెంచాడు. చక్కని షాట్లతో అండర్సన్‌ను హడలెత్తించాడు. కళ్లు చెదిరే ఆటతో వరుసగా మూడు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మూడో, నాలుగో సెట్‌లో అండర్సన్ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. వరుస తప్పిదాలకు పాల్పడి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నాడు.

హలెప్ అలవోకగా…

మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో హలెప్ 62, 61 తేడాతో తన దేశానికే చెందిన ఎలిసె మార్టెన్స్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే హలెప్ దూకుడును ప్రదర్శించింది. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిపై ఎదురు దాడి చేసింది. ఆమె ధాటికి మార్టెన్స్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని

కాపాడుకోవడంలో సఫలమైన అగ్రశ్రేణి క్రీడాకారిణి వరుసగా రెండు సెట్లను గెలిచి ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో హలెప్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. దీన్ని బట్టి హలెప్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. మరో పోటీలో 12వ సీడ్ అంజెలిక్ కెర్బర్ విజయం సాధించింది. ఏడో సీడ్ కరొలైన్ గార్సియా(ఫ్రాన్స్)తో జరిగిన పోరులో కెర్బర్ 62, 62తో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన కెర్బర్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండు సెట్లను కూడా సునాయాసంగా గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ గాయం వల్ల నాలుగో రౌండ్ నుంచి తప్పుకుంది. దీంతో రష్యా స్టార్ మారియా షరపోవా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

వోజ్నియాకి ఔట్…

మరోవైపు రెండో సీడ్ కరొలైన్ వోజ్నియాకి (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే పరాజయం చవిచూసింది. రష్యా క్రీడాకారిణి, 14వ సీడ్ డారియా కసట్కినా 76, 63 తేడాతో వోజ్నియాకిని చిత్తు చేసింది. తొలి సెట్‌లో వోజ్నియాకి బాగానే ఆడింది. అయితే కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక పోయింది. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న డారియా టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా డారియా దూకుడును ప్రదర్శించింది. చెలరేగి ఆడినడారియా సునాయాసంగా సెట్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.