Thursday, April 18, 2024

క్వార్టర్స్‌లో నాదల్, హలెప్

- Advertisement -
- Advertisement -

australian open

 

మెద్వదేవ్‌కు షాక్, జ్వరేవ్, ముగురుజా ముందుకు, ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), మాజీ నంబర్‌వన్ గార్బయిన్ ముగురుజా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించారు. అయితే జర్మనీ స్టార్ అంజెలిక్ కెర్బర్, తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (డచ్) ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) నాలుగో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. కాగా, ఏదో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 15వ సీడ్ స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు.

చెమటోడ్చిన రఫెల్
పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు నాదల్ చెమడోడ్చి నెగ్గాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియాస్‌ను ఓడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో నాదల్ 63, 36, 76, 76తో నిక్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో నాదల్ దూడుకును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో చెలరేగిన నాదల్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో మాత్రం నాదల్‌కు షాక్ తగిలింది. ఈసారి నిక్ దూకుడుగా ఆడాడు. అద్భుత షాట్లతో నాదల్‌ను హడలెత్తించాడు. చివరి వరకు నిలకడగా ఆడుతూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి రెండు సెట్లలో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు నాదల్, అటు నిక్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో రెండు సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లకు తప్పలేదు. కానీ, ఆఖరు వరకు నిలకడగా ఆడిన నాదల్ రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

మరో పోటీలో థిమ్ జయభేరి మోగించాడు. ఫ్రాన్స్‌కు చెందిన పదో సీడ్ గేల్ మోన్‌ఫీల్స్‌తో జరిగిన నాలుగో రౌండ్‌లో థిమ్ సునాయాసంగా విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన థిమ్ 62, 64, 64తో మోన్‌ఫీల్స్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే థిమ్ దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ అలవోకగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరోవైపు ఏడో సీడ్ జ్వరేవ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో సునాయాసంగా విజయం సాధించాడు. రష్యాకు చెందిన 17వ సీడ్ ఆండ్రీ రుబ్లేవ్‌తో జరిగిన పోరులో జ్వరేవ్ 64, 64, 64తో జయభేరి మోగించాడు. కాగా, నాలుగో సీడ్ మెద్వదేవ్ మాత్రం క్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించాడు. సోమవారం జరిగిన పోరులో స్విస్ స్టార్ వావ్రింకా చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో వావ్రింకా 62, 26, 46, 76, 62తో మెద్వదేవ్‌ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో వావ్రింకా పైచేయి సాధించాడు. అద్భుత షాట్లతో అలరించిన వావ్రింకా సునాయాసంగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ, తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థి మెద్వదేవ్ ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా రెండింటిలో విజయం సాధించాడు. నాలుగో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. కానీ, కీలక సమయంలో వావ్రింకా పుంజుకున్నాడు. టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి సెట్‌లో కూడా జోరును ప్రదర్శించాడు. అలవోకగా సెట్‌ను నెగ్గి క్వార్టర్ ఫైనలలో ప్రవేశించాడు.

అలవోకగా
మరోవైపు మహిళల సింగిల్స్‌లో హలెప్ (రుమేనియా) అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 64, 64తో తన దేశానికే చెందిన 16వ సీడ్ ఎలిసె మార్టెన్స్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హలెప్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో కికి బెర్టెన్స్‌కు చుక్కెదురైంది. స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజాతో జరిగిన పోరులో బెర్టెన్స్ ఓటమి పాలైంది. చెలరేగి ఆడిన ముగురుజా 63, 63తో బెర్టెన్స్‌ను ఓడించింది. 17వ సీడ్ కెర్బర్ కూడా ఓటమి చవిచూసింది. రష్యా క్రీడాకారిణి అనస్తాసియాతో జరిగిన పోరులో కెర్బర్ పరాజయం పాలైంది. మరోవైపు ఇస్టోనియా క్రీడాకారిణి అన్నా కొంటావెట్ కూడా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. పోలండ్ క్రీడాకారిణి స్విటెక్‌తో జరిగిన పోరులో కొంటావెట్ విజయం సాధించింది.

Nadal and Halep in quarter finals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News