Friday, March 29, 2024

చారిత్రక విజయానికి అడుగు దూరంలో

- Advertisement -
- Advertisement -

అందరి కళ్లు నాదల్‌పైనే

Nadal enter into final
పారిస్: ప్రపంచ టెన్నిస్‌లో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చారిత్రక విజయానికి ఒక టైటిల్ దూరంలో ఉన్నాడు. పురుషుల టెన్నిస్‌లో నాదల్ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా 20 టైటిల్స్‌తో నాదల్‌తో సమంగా నిలిచాడు. అయితే కొన్నేళ్లుగా గాయాలు ఫెదరర్‌కు ప్రతికూలంగా మారాయి. దీనికి తోడు వయసు పెరగడంతో ఫెదరర్ ఆటలో మునుపటి జోరు కనిపించడం లేదు. ఇక నాదల్ మాత్రం నిలకడైన ఆటతో పురుషుల సింగిల్స్‌లో తన హవాను కొనసాగిస్తున్నాడు. ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ సాధించడమే లక్షంగా నాదల్ పోరుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 13 ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలను సొంతం చేసుకున్న నాదల్ ఈసారి కూడా గెలిస్తే పురుషుల టెన్నిస్‌లోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.

ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలను ముద్దాడిన నాదల్ మరో టైటిల్‌పై కన్నేశాడు. ఈసారి కూడా ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో నాదల్ ఎన్నో చారిత్రక విజయాలు సాధించాడు. కెరీర్‌లో ఏకంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ సాధిస్తే పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు.

ఇక రొనాల్డ్ గారోస్‌లో నాదల్ రికార్డును పరిగణలోకి తీసుకుంటే ఈసారి అతనే విజేతగా నిలువడం ఖాయంగా కనిపిస్తోంది. మట్టి కోర్టు రారాజుగా పేరు తెచ్చుకున్న నాదల్‌ను వెనక్కినెట్టి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం ఇతర ఆటగాళ్లకు అంత తేలికేం కాదనే చెప్పాలి. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ బరిలో ఉన్నా అతనికి ఫ్రెంచ్ ఓపెన్‌లో పెద్దగా రికార్డేమీ లేదు. నాదల్‌ను ఓడించి టైటిల్ సాధించడం జకోవిచ్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. అయితే ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థిమ్‌తోనే నాదల్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వరుసగా రెండు సార్లు నాదల్ చేతిలో ఫైనల్లో ఓటమి పాలైన థిమ్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ నాదల్‌ను ఓడించి టైటిల్‌ను సాధించడం థిమ్ అంత సులువేమీ కాదని చెప్పక తప్పదు.

మట్టి కోర్టులో నాదల్ ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే చిరకాలం చెక్కుచెదరకుండా ఉండే అత్యంత అరుదైన రికార్డును నాదల్ సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఈసారి కూడా ట్రోఫీని సాధించి తన రికార్డును మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో నాదల్ ఉన్నాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కూడా ఈసారి నాదల్ ట్రోఫీని సాధించాలని కోరుకుంటున్నారు. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News