త్రిపురలో ఫిబ్రవరి 18వ తేదీ, మేఘాలయ, నాగాలాండ్‌లలో 27న పోలింగ్
- మార్చి 3న ఫలితాలు : షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
- Advertisement -
న్యూఢిల్లీ : ఈశాన్య భారతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను గురువారంనాడిక్కడ ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 18న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్‌లలో అదే నెల 27 పోలింగ్ నిర్వహించాలని ఇసి నిర్ణయించింది. ఫలితాలు మార్చి 3న వెల్లడించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎకె జ్యోతి తెలిపారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీల గడువు వరుసగా మార్చి 6, మార్చి 13, మార్చి 14 తేదీలతో ముగియనుంది. ప్రతి అసెంబ్లీలో సీట్ల సంఖ్య 60. త్రిపుర ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 24న జారీ చేయనున్నారు. 31వ తేదీ నామినేషన్లకు గడువుగా విధించారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, 3వ తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలకు నోటిఫికేషన్ 31న జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 7 నామినేషన్లకు చివరి తేదీ కాగా, ఉపసంహరణకు 12వ తేదీని గడువుగా పేర్కొన్నారు. త్రిపురలో 25, 69,216మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనుండగా.. నాగాలాండ్‌లో 11,89,264 మంది, మేఘాలయలో 18,30, 104మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మూడు రాష్ట్రాల్లో పాగా వేయాలని బిజెపి ఉవ్విళ్లూరుతుండగా, కాంగ్రెస్, వామపక్షాలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్‌ను తిరుగుబాటు ఎంఎల్‌ఎల సమస్య వేధిస్తోంది. గత ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్ర అసోంను చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా ఉన్న మేఘాలయను తిరిగి దక్కించుకోవడం సవాల్‌గా మారనుంది. నాగాలాండ్‌లో సిఎం టిఆర్ జెలియాంగ్ నేతృత్వంలోని నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉంది. త్రిపురలో వరుసగా ఐదుసార్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నాయకత్వంలోని వామపక్షాలను ఈ సారి కూడా ఓడించడం ప్రతిపక్ష పార్టీలకు అగ్నిపరీక్షే.
-
Nagaland, Meghalaya, Tripura To Vote in The Month of February
మూడు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
- Advertisement -