Friday, March 29, 2024

గర్భిణికి కలెక్టర్ రక్తదానం

- Advertisement -
- Advertisement -

Nagarkurnool Collector donated blood to pregnant lady

‘ఒ’ నెగటివ్ బ్లడ్ అవసరం కావడంతో రక్తం ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్
విధుల్లో చేరిన మరుసటి రోజే జిల్లా ఆస్పత్రి సందర్శన

నాగర్‌కర్నూల్: జిల్లా ఆస్పత్రిలో ఓ గర్భిణికి ఓ నెగటివ్ బ్లడ్ అవసరం కావడంతో కలెక్టర్ ఎల్ శర్మన్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్ ఎల్ శర్మన్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఓ గర్భిణి ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండడం గమనించారు. ఆమెకు ‘ఒ’ నెగటివ్ బ్లడ్ అవసరం ఉండడం, ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్‌లో లేకపోవడంతో కలెక్టర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని రక్తదానం చేశారు. అంతకుముందు జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వివిధ చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలోని కోవిడ్, ఐసోలేషన్ వార్డుల్లోని మంచాలు, బెడ్ షీట్లు, ఐసియు వార్డు, స్నానపు గదులను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఐసోలేషన్ వార్డు, ఐసియూ వార్డులకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది కరోనా పేషెంట్లకు ధైర్యం చెప్పారు. కరోనా రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌లాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News