Home తాజా వార్తలు సినిమా వాళ్లను చులకన చేసి మాట్లాడొద్దు: నాగబాబు

సినిమా వాళ్లను చులకన చేసి మాట్లాడొద్దు: నాగబాబు

naga-babu1

హైదరాబాద్: “మా” సభ్యులకు ఏదైనా అన్యాయం జరిగితే పరిష్కరిస్తానని సినీ నటుడు నాగబాబు స్పష్టం చేశారు. ఫిలింఛాంబర్‌లో బుధవారం ఉదయం మా మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో నాగబాబు కంటతడిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తన అభిప్రాయాలను వెల్లడించడానికే వచ్చానని వివరణ ఇచ్చారు. నెల రోజుల నుంచి శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నానని, ఆమె పోరాటం పక్కదారి పట్టిందని వాపోయారు. “మా” అసోసియేషన్ సభ్యుల కోసమే పనిచేస్తోందని, ప్రొడ్యూసర్స్ సరిగా పేమెంట్స్ చేయకుంటే దగ్గరుండి ఇప్పిస్తానని తెలిపారు. అవగాహన లేకుండా మా అసోసియేషన్‌ను కించపర్చొద్దని కోరారు. క్యాస్టింగ్ కౌచ్ ఉన్న పదం ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించారు. ఎవరైనా ఆడవాళ్లను సినీ పరిశ్రమలో కించ పరిస్తే చెప్పుతో కొట్టండన్నారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి, కోర్టుకు ఈడ్చండని సూచించారు. తన దృష్టికి తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆడవాళ్లను సినీ పరిశ్రమ ఆట వస్తువులుగా చూడదని, సినీ పరిశ్రమపై గౌరవం లేకపోతే తన కూతురిని ఎందుకు సినిమాల్లోకి తీసుకొస్తానని ఎదురు ప్రశ్నలు వేశారు.

ప్రొడ్యూసర్లుగా అన్ని విషయాలు తమకు తెలియకపోవచ్చని, ఎవరో కొందరు చేసిన దానికి అందరిని నిందించడం సరికాదని దుయ్యబట్టారు. ఆడవాళ్ల సమస్యలు పరిష్కరించేలా నిర్మాతల మండలితో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. ఆడవాళ్లలో ధైర్యం లేకుంటే ఎవరూ ఏం చేయలేరని, ప్రతివాళ్లు చిత్ర పరిశ్రమ గురించి చులకనగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సినిమాల్లో చూపించిన మంచిని ఎందుకు అనుసరించడంలేదని ప్రేక్షకులను అడిగారు. సావిత్ర, భానుమతి లాంటి వాళ్లు బాధ్యతాయుతంగానే ఎదిగారని, వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సినీ పరిశ్రమలో చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయని, కొన్ని లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, సినిమా వాళ్లను చులకన చేసి మాట్లాడొద్దని నాగబాబు సూచించారు.