Home హైదరాబాద్ రాచకొండలో రోజూ … నాకా బందీ

రాచకొండలో రోజూ … నాకా బందీ

ఫలితంగా పట్టుబడ్డ నేరగాళ్లు… రూ.2 కోట్లు లభ్యం
తెల్లవారుము 2 నుంచి 6 గంటల వరకు

NAKA-BANDI

మన తెలంగాణ/సిటీబ్యూరో : దొంగతనాలు, దోపిడీలకు చెక్ పెట్టేందుకు రాచకొండ పోలీసులు నేరగాళ్లపై నాకాబందీ వల విసిరారు. ఫలితంగా పక్షం రోజుల్లో పది మంది కరుడు గట్టిన నేరగాళ్లు చిక్కారు. వారి నుంచి రూ.3 కోట్ల విలువైన చోరీ సొత్తు లభ్యమైంది. ఈ నాకాబందీని ప్రతి రోజు నిర్వహించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారు జాము 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసులందరు నాకాబందీ నిర్వహిస్తున్నారు. నాకాబందీపై మంచి ఫలితాలు వస్తుండడంతో ఇంకా పకడ్బందీగా దీన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు కృతనిశ్ఛయంతో ఉన్నారు. తద్వారా నేరాలకు చెక్ పెట్టడంతో పాటు అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలను తరిమి కొట్టవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో  రాత్రిపూట గస్తీపై దృష్టి సారించారు.
ఆ 4 గంటలే నేర గడియలు….
సాధారణంగా దొంగతనాలు, దోపిడీలు ఎక్కువగా అర్ధరాత్రి తరువాత నుంచి మొదలవుతాయి. అంటే తెల్లవారు జాము 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నేరగాళ్లు తమ పని ముగించుకుని వెళ్లిపోతారు. ఈ సమయంలో పోలీసుల సంచారం, ప్రజల సంచారం ఉండటకపోవడమే వారికి వరంగా మారింది. ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించడం అర్ధరాత్రి దాటిన తరువాత పంజా విసరడం నేరగాళ్లకు పరిపాటైంది. నైట్ డ్యూటీ అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పోలీసులు విధుల్లో ఉండాలి. అయితే రాల్రి 10 గంటలకు డ్యూటీ ఎక్కిన పోలీసులు కాలనీలు, బస్తీలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ముమ్మరంగా గస్తీ తిరిగి షాపులు, హోటళ్లు, బార్లు, వైన్‌షాప్‌లను మూసివేస్తారు.ఇక తమపని ముగిసిందని పోలీసులు ఎక్కడో అక్కడ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇదే అదనుగా భావించే దొంగలు ఈ గడియల్లోనే నేరాలకు పాల్పడుతుంటారు. దీని అధిగమించేం దుకు రాచకొండ పోలీసులు పక్కా ప్రణాళికను సిద్దం చేశారు. దొంగతనాలు ఎక్కువగా ఏ సమయంలో జరుగుతున్నాయో అదే సమయంలో పోలీసులు కరెక్ట్‌గా పనిచేస్తే ఫలితాలు వస్తాయన్న ఉద్దేశ్యంలో నాఖాబంధీ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.
పకడ్బందిగా నాఖాబంధీ….
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి రంగారెడ్డి,యాదాద్రి, మేడ్చల్ జిల్లా పరిధులు వస్తున్నాయి. మొత్తం శాంతి భద్రతల పోలీసు స్టేషన్‌లు 41 ఉన్నాయి. ఇటు పట్టణ, అటు గ్రామీణ వాతారణంతో కూడిన వింత పరిస్థితిలు ఈ కమిషనరేట్‌లో ఉన్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని నేరాలను తగ్గుముఖ్ఖం పట్టించేందుకు క్రైమ్ అదనపు డిసిపి డి.జానకీ కృషి చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జానకీ ఎల్‌బినగర్, మల్కాజ్‌గిరి, భువనగిరి జోన్‌ల పరిధిలో సిసిఎస్ సిబ్బందిని గాడిలో పెట్టారు. పాత నేరాలు, కొత్తగా వస్తున్న నేరాలపై అధ్యాయనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రవేశిస్తున్న అంతరాష్ట్ర ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టారు.వీటన్నింటికి తోడుగా నాఖాబంధీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలు, సిసిఎస్, స్పెషల్ ఆపరేషన్ టీం, ట్రాఫిక్ పోలీసులు పాల్గొంటున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారు జాము 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంటే సుమారు నాలుగు గంటల పాటు పోలీసులంతా రోడ్లపై ఉంటున్నారు. నగరంలోకి ప్రవేశించే మార్గాలతో పాటు ముఖ్యమైన రహదారులపై బారికేడ్లు పెట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో కనీసం మూడు చోట్ల నాఖాబంధీ నిర్వహిస్తున్నారు. నేరాలు ఎక్కువగా ఏఏ కాలనీలు, బస్తీలలో జరుగుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని నాఖాబంధీకి ప్లాన్ వేసుకుంటున్నారు. నాఖాబంధీలో సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నారు. అనుమానితులను ప్రశ్నించి పూర్తిగా విచారించిన తరువాతనే వదిలిపెడుతున్నారు. రాత్రి పూట సంచరించే వారిని ప్రశ్నిస్తున్నారు. వారు సరైన వివరణ ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వదిలిపెడుతున్నారు. కేవలం నేరస్తులనే టార్గెట్ చేస్తూ ఈ నాఖాబంధీ నిర్వహిస్తున్నారు.
పక్షం రోజుల్లో రూ.3 కోట్లు లభ్యం….
నాఖాబంధీ చేపట్టడం ద్వారా రాచకొండలో మంచి ఫలితాలు వస్తున్నాయి. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బినగర్, మేడిపల్లి తదితర పోలీసు స్టేషన్‌ల పరిధిలో నాఖాబంధీ సమయంలో పక్షం రోజుల్లో పది మంది కరుడు గట్టిన నేరగాళ్లు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి సుమారు రూ.3 కోట్ల విలువైన చోరీ సొత్తు (బంగారు ఆభరణాలు, నగదు) పట్టుబడింది. ఒకపక్క నేరస్తులు పట్టుబడడం, మరోపక్క నేరాలు తగ్గడం జరిగింది. తద్వారా నాఖాబంధీపై కమిషనర్ మహేష్ భగవత్ సంతృప్తిగా ఉన్నారు. మీర్‌పేట్ పోలీసులకు కరుడుగట్టిన దొంగ టోలిచౌకీకి చెందిన మీర్‌ఖాజీం అలీ ఖాన్ అలియాస్ సూర్య అన్న (35) పట్టుబడ్డాడు. ఇతను నుంచి సుమారు రూ.22 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్ పోలీసులకు 30 నేరాలకు పాల్పడిన రమేష్ అనే దొంగ పట్టుబడ్డాడు. ఎల్‌బినగర్ పోలీసులకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడిన కోటేశ్వర్‌రావు చిక్కాడు. ఇక 50కిపైగా నేరాలకు పాల్పడిన సంతోష్‌నగర్‌కు చెందిన అవేజ్ అహ్మద్ (26) మేడిపల్లి పోలీసుల వలలో పడ్డాడు. ఇలా మొత్తం 10 మంది కరుడుగట్టిన నేరగాళ్లు నాఖాబంధీ వలలో పడ్డారు.
పోలీసు గస్తీలో మార్పులు గస్తీని పెంచాము…మహేష్ భగవత్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యంగా రాత్రి పూట పోలీసు గస్తీని పెంచాము. గస్తీలో సిబ్బంది ఏ పాటు నిర్లక్షంగా ఉండవద్దని సూచించారు. విధినిర్వహణలో ఉన్న సమయంలో నిద్రకు ఉపక్రమించకుండా నేరస్తులపై కన్నేసి పెట్టాలన్నాము. పక్షం రోజుల్లో మంచి మార్పు కనిపించింది.ఇక నుంచి రాత్రి పూట దొంగతనం చేసి చోరీ సొత్తుతో పారిపోవాలంటే సాధ్యమయ్యే పనికాదు. వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. నాఖాబంధీ చేస్తున్న చోట ఎస్‌ఐ స్థాయి అధికారి తప్పనిసరిగా ఉంటున్నారు.