Home తాజా వార్తలు నూతన చట్టం.. ప్రగతికి పట్టం!

నూతన చట్టం.. ప్రగతికి పట్టం!

Gram panchayatపంచాయతీరాజ్ చట్టం పట్టాలెక్కేందుకు రంగం సిద్ధం, ప్రతి గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శి నియామకం
కార్యదర్శుల నియామకంతో ప్రజల ముంగిట్లోకి పాలన, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,720 గ్రామ పంచాయతీలు, మూడు జిల్లాల్లో 1,310 మంది కార్యదర్శుల భర్తీకి మోక్షం, పరిశీలన పూర్తయి నియామక పత్రం అందడమే తరువాయి.

నల్లగొండ: దేశానికి పల్లెలు పట్టుగొమ్మలన్న నానుడిని నిజం చేయాలన్న జాతీయ నేతల సంకల్పం సాకారమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న నమ్మకం కల్గుతోంది. ఎన్నికలకు ముందు పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్‌చట్టంలో పొందుపర్చిన అంశాలు ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గిరిజన తండాలు, శివారుగ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు పాత, కొత్త అంటూ తేడా లేకుండా అన్ని గ్రామపంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ తంతు కూడా విజయవంతంగా పూర్తైతే పల్లె పాలన మరింత వేగంగా పరగులు పెట్టనుంది.

ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రజల అశలు, అవసరాలకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి జరుగాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేయగా ఆ మేరకు కార్యదర్శుల నియామకం కోసం కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సదరు ప్రక్రియలో భాగంగా కార్యదర్శి ఉద్యోగాల కోసం రాతపరీక్ష ఫలితాలు వెల్లడించి అర్హుల జాబితా కూడా సిద్ధం చేయడం, ఆదే క్రమంలో ఎంపికైన వారి దృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం కూడా ముగియడం చకాచకా జరిగిపోయాయి. అయితే నియామక పత్రాలు అందించే సమయంలో కోర్టు జోక్యంతో ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలో ఆ కోర్టు నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రక్రియ పూర్తికానుంది.

పాలకవర్గాలు కొలువుదీరిన వెంటనే….పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో గడిచిన ఆగస్టు మాసంలోనే ప్రత్యేకాధికారుల పాలన మరోమారు తెరమీదకు వచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక అధికారి ఉండాలనే లక్షంతో మండల, జిల్లా అధికారులతోపాటు ఆయా కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని సైతం ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వీరు ద్విపాత్రాభినయం చేయాల్సి రావడం, ముందస్తు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావడం వంటి పరిణామాలు గ్రామాల్లో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకపోయాయి. ఈ నేపధ్యంలోనే జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడం, జనవరి మొదటివారంలో నోటిఫికేషన్ వెలువరించి ఎన్నికలు నిర్వహించడం ద్వారా జనవరి నెలాఖరు కల్లా పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరేందుకు నిర్విరామంగా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.

ప్రజల ముంగిట్లోనే పరిపాలన

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాత, కొత్త పంచాయతీలన్ని కలిపి 1720 ఉన్నాయి. వీటిలో జనాభా ప్రాతిపదికన ప్రతి పంచాయతీకి కేంద్రం మంజూరు చేసే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు ఉపాధిహామీ పథకం కింద ప్రగతి పనులు నిర్వహించేకునే వెసులుబాటు కలుగనుంది.

ప్రత్యేకంగా కార్యదర్శి నియామకంతో ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు నేరుగా విన్నవించుకొని పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కొత్త పంచాయతీల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు అప్పుడే గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తవ్వగానే ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనుల నిర్వహణకుగాను క్షేత్రస్థాయిలో యువకులను నియమించేందుకు గ్రామీణాభివృద్ధి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అవసరాలను గుర్తించి ఉపాధి పనుల కోసం ప్రతిపాదనలు రూపొందించి నిర్వహించే అవకాశం ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది.

Nalgonda Inauguration of new Gram panchayat