Home ఖమ్మం టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం : నామా

టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం : నామా

Nama Nageswara Raoములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తాను టిఆర్‌ఎస్ లో చేరడం జరిగిందని ఖమ్మం పార్లమెంటు టిఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు జారే ఆదినారాయణతో కలిసి  మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. నామా ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల నాయకులు శెనగపాటి సీతారాములు, తాండ్ర బుచ్చిబాబు, శెనగపాటి రవి, నున్న జగదీష్, నందమూరి సురేష్, నందమూరి మురళీ, డాక్టర్ బండి కొమరయ్య తదితరులు నామాకు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామా నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బాధలు చూసిన కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ముఖంలో చిరునవ్వులు విరుజిల్లుతున్నాయన్నారు. సిఎం కెసిఆర్ సాగునీరు, తాగునీరును ప్రతి గ్రామానికి అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని,  రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారని నామా తెలిపారు. తెలంగాణ రైతులు దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆనందంతో ఉన్నారని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టి కేసిఆర్ రైతు బాంధువుడిగా దేశ చరిత్రలో ఖ్యాతి ఆర్జించారని పేర్కొన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామగ్రామానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి కోట్లాది రూపాయలతో పథకాన్ని ప్రవేశపెట్టి అనేక జిల్లాలలో పథకాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలో ఉభయ జిల్లాలలో గోదావరి జలాలు ప్రజలకు అందనున్నాయన్నారు. ఉభయ జిల్లాలలో రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి 18 వేల కోట్ల రూపాయలతో దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సీతారామ ప్రాజెక్టు పథకాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.  ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు జిల్లాల్లో  పంట పొలాలకు పుష్కలంగా నీరు రానుందని నామా వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై సిఎం కెసిఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే లక్షల కోట్ల రూపాయల నిధులను ఈ జిల్లాలకు  మంజూరు చేశారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను పూర్తి చేసి ప్రజలకు చేరువ చేస్తున్నరన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి సాధించలేదని, అది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ వల్లనే సాధ్యపడిందని నామా పేర్కొన్నారు. అందుకే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి మంత్రముగ్ధుడనై తెలుగుదేశం పార్టీని విడనాడి టిఆర్‌ఎస్‌లో చేరి కేసిఆర్ అడుగుజాడలలో నడవాలని నిర్ణయించుకున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువ మంది నివసిస్తున్నారని, వారంతా పోడుభూములకు హక్కుపత్రాలు రావాలని కోరుతున్నారన్నారు. గిరిజనులకు హక్కుపత్రాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టాల పరిధిలో ఇవ్వడం సాధ్య పడటంలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అటవీహక్కు చట్టాన్ని మార్పు చేస్తేనే గిరిజన రైతుల స్వాధీనంలో ఉన్న పోడుభూములకు పట్టాలు ఇవ్వడం సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలంటే మన రాష్ట్రం నుంచి లోక్ సభకు  టిఆర్‌ఎస్ తరపున 16 మందిని గెలిపించాలని ఆయన కోరారు. అప్పుడే ఈ చట్టాన్ని మార్చడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్ తరపున పోటీలో ఉన్న 16 మంది పార్లమెంటు అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తప్పక చట్టాన్ని మార్పు చేస్తామన్నారు. ఎన్నికలయ్యేవరకు గిరిజన సోదరులు ఓపిక పట్టాలని, ఎన్నికల అనంతరం పోడుభూములకు పట్టాలు ఇచ్చే విధంగా సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంటులో ఒత్తిడి తెచ్చి సాధించి తీరుతామన్నారు. ములకలపల్లి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని, ఇక్కడే నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభిస్తున్నానని, మండు వేసవిలో కూడా వేలాదిగా తరలిరావడం టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానమని, ప్రజల అభిమానమే ఈ ఎన్నికలలో తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ప్రతి ఒక్కరు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మచ్చ శ్రీనివాసరావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, అశ్వారావుపేట టిఆర్‌ఎస్ మండల, అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, బండారి శ్రీనివాసరావు, ములకలపల్లి మండల నాయకులు తానం లక్ష్మి, నాగళ్ళ వెంకటేశ్వరరావు, బాల అప్పారావు, తుర్రం శ్రీనివాసరావు, పుష్పాల చందర్‌రావు, సిక్కుల అంజి, సర్పంచ్‌లు గొల్ల పెంటయ్య, వాడే నాగరాజు, కారం సుధీర్, బైటి రాజేష్, సవలం సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Nama Comments on Loksabha Elections