Home ఖమ్మం బిజెపిది గల్లీలో ఒక మాట… ఢిల్లీలో ఇంకో మాట

బిజెపిది గల్లీలో ఒక మాట… ఢిల్లీలో ఇంకో మాట

Nama nageswara rao roaring speech in lok sabha

ధాన్యం కొనుగోలుపై బీజేపీది గల్లీలో ఒక మాట… ఢిల్లీలో ఇంకో మాట
అన్నదాతలతో ఆటలేంటి? కేంద్రం స్పష్టంగా ప్రకటన చేయాలి
లోక్ సభలో టిఆర్‌ఎస్ పక్ష నేత నామ

మన తెలంగాణ/ఖమ్మం : కేంద్రం తెలంగాణలోని ధాన్యం కొనుగోలుపై గల్లీలో ఒక మాట ఢిల్లీలో మరొక మాట చెబుతుందని టిఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిజెపి భిన్న వ్యాఖ్యలతో తమ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నదని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో ఇదేం ద్వంద నీతి అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిజెపిపై ధృజమెత్తారు. వారి కపట వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు రోజులుగా తమ వంట ధాన్యం తీసుకోవడం లేదని లోక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తాము అంతా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, సమస్య వివరించేందుకు కృషి చేశామన్నారు. అయినా తాము ఆశించిన సమాధానం, స్పందన రాలేదని నామ సభకు వివరించారు.

మంగళవారం లోక్ సభలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ధాన్యం కొనుగోలు అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సభాపతి పలుమార్లు సభను వాయిదా వేశారు. మూడు గంటలకు తిరిగి సమావేశమైన నేపథ్యంలో నామ నాగేశ్వరరావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వారందరితో తాము మాట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నామని నామ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని లోక్ సభ సాక్షిగా డిమాండ్ చేశారు. అనంతరం సభాపతి ఓం బిర్లా నాగేశ్వరరావును మాట్లానివ్వకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తన వాదనని కొనసాగిస్తూనే ఉన్నారు. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ఎంపిలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అన్నదాతపై అలసత్వం ఏంటి?
దేశంలో అత్యధికంగా పంట పండిస్తున్న రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ఖమ్మం ఎంపి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత ఆలసత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. నామ నేతృత్వంలో లోక్ సభలో రైతు సమస్యలపై చర్చకు టిఆర్‌ఎస్ ఎంపిలు పట్టుబట్టినా.. స్పీకర్ అనుమతించలేదు. దీంతో వారంతా స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని నిలదీశారు.

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని లేవనెత్తారు. దాంతోపాటు, సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్ లోకి దూసుకువెళ్లిన టీఆర్‌ఎస్ సభ్యులు లోక్ సభలో నిరసన తెలిపారు. అంతకుముందు నామ నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై మంగళవారం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చి వరి ధాన్యంపై చర్చ చేయాలని డిమాండ్ చేయగా… నామ విజ్ఞప్తిని స్పీకర్ తోసి పుచ్చారు.

Nama nageswara rao roaring speech in lok sabha