Home తాజా వార్తలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి: నామా

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి: నామా

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, ఇప్పటికైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని టిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కోరారు. మూడేళ్లలోనే అన్ని రకాల అటవీ, పర్యావరణ అనుమతులు తెచ్చుకుని దిగ్విజయంగా ప్రాజెక్టును పూర్తి చేసుకుందని, ఇలాంటి దానికి కేంద్రం సహకరించాలన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నామా సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో.. హైదరాబాద్‌కు కూడా తాగు నీరు సరఫరా అవుతుందన్నారు. అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న మహారాష్ట్ర, ఎపి, తెలంగాణ సిఎంలు ప్రారంభించారన్నారు. ప్రాజెక్టు గురించి సభలో చర్చ చేపట్టాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

21వ శతాబ్ధంలో ఇదే పెద్ద సమస్య అన్నారు. నీటిని సంరక్షించే సాంప్రదాయ పద్ధతులు కనుమరుగవుతున్నాయని, అందుకే కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఎంపి నామా తెలిపారు. రాష్ర్టంలో తలెత్తిన నీటి సమస్యలను తీర్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రైతుబంధు ఆధారంగానే కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి తమ ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. రైతు బీమా కింద ఉన్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టిల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించినట్లు వివరించారు. 16వ లోక్‌సభలోనూ డిమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చామని, తమ ప్రభుత్వం జిఎస్‌టికి కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

Nama Nageswara rao speaks about Kaleshwaram