Home ఖమ్మం మధిర నియోజకర్గ ఓటర్లకు నా కృతజ్ఞతలు: నామ

మధిర నియోజకర్గ ఓటర్లకు నా కృతజ్ఞతలు: నామ

Nama Nageswara Rao

 

ఖమ్మం: ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేశారని, తనను గెలిపించేందుకు ఓట్లు వేసిన ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు అని టిఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మధిర పట్టణంలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేసి తెలంగాణను తీసుకు వచ్చిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా ప్రజల పడుతున్న ఇబ్బందులను చూసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా స్వీకరించి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేశారని అన్నారు.

అందుకే ప్రజలు రెండవసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌కే మద్దతు తెలిపారని, కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకువచ్చేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకుగాను టిఆర్‌ఎస్ 16స్థానాలను గెల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డిందన్నారు. దానికనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులకు భారీగా ఓట్లు వేసి టిఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు పని చేశారని, ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్ పార్టీ 16కి 16స్థానాలు గెల్చుకోనున్నదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గత శాసనసభ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను గెలుపొందేందుకుగాను సహకరించినటువంటి టిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, తాతా మధు, నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజు, జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, డాక్టర్ కోట రాంబాబు, నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగా యన్నం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Nama thanked to Madhira constituency Voters