Saturday, April 20, 2024

నాకౌట్‌కు నమీబియా

- Advertisement -
- Advertisement -

Namibia advanced to Super 12 in T20 World Cup

వీస్ ఆల్‌రౌండ్ షో,రాణించిన గెర్హార్డ్, ఐర్లాండ్ ఇంటికి

షార్జా: ట్వంటీ20 ప్రపంచకప్‌లో నమీబియా సూపర్12కు దూసుకెళ్లింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ఎ నుంచి నాకౌట్‌కు చేరిన రెండో జట్టుగా నమీబియా నిలిచింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవమైన ప్రదర్శన చేసి క్వాలిఫయింగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు నమీబియా వరుసగా రెండో విజయంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన నమీబియా 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న గెర్హార్డ్..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నమీబియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ క్రెగ్ విలియమ్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలువడంలో విఫలమయ్యాడు. మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి కర్టిస్ కాంపేర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో నమీబియా 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్‌మస్ కుదురుగా ఆడి జట్టును లక్షం దిశగా నడిపించాడు. అతనికి మరో ఓపెనర్ జానె గ్రీన్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. ఇక లక్షం కూడా చిన్నగా ఉండడంతో ఐర్లాండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన గ్రీన్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా కర్టిస్‌కే దక్కింది.

డేవిడ్ జోరు..

తర్వాత వచ్చిన డేవిడ్ వీస్ ఆరంభం నుంచే చెలరేగి ఆడాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా వీస్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ధాటిగా ఆడిన వీస్ 14 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గెర్హార్డ్ 49 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో అజేయంగా 53 పరుగులు సాధించాడు. దీంతో నమీబియా మరో 9 బంతులు మిగిలివుండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో నమీబియా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఐర్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

శుభారంభం లభించినా..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రియాన్‌లు శుభారంభాన్ని అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. స్టిర్లింగ్ దూకుడును కనబరచగా ఓబ్రియాన్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు ఈ జోడీని విడగొట్టేందుకు నమీబియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇక ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 24 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కోల్ట్‌కు ఈ వికెట్ దక్కింది. ఆ వెంటనే మరో ఓపెనర్ ఓబ్రియాన్ కూడా వెనుదిరిగాడు. రెండు ఫోర్లతో 25 పరుగులు చేసిన ఓబ్రియానను జాన్ ఫ్రిలింక్ వెనక్కి పంపాడు. ఇక కెప్టెన్ బాల్‌బ్రయిన్ రెండు ఫోర్లతో 21 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌లలో ఒక్కరూ కూడా కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోయారు. దీంతో ఐర్లాండ్ స్కోరు 125 పరుగులకే పరిమితమైంది. ఇక నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు, జాన్ ఫ్రిలింక్ మూడు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్‌షోతో జట్టును గెలిపించిన డేవిడ్ వీస్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News