Home తాజా వార్తలు చైతన్య రథసారథి హరికృష్ణ దుర్మరణం

చైతన్య రథసారథి హరికృష్ణ దుర్మరణం

Nandamuri harikrishna dies in road mishap near Nalgonda

నల్లగొండ వద్ద  ఘోర ప్రమాదం

సీటుబెల్టు వేసుకోకుండా అతివేగంగా కారు నడుపుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి, నటుడు, టిడిపి అగ్రనేత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబునాయుడు తదితర ప్రముఖుల నివాళి
శోకతప్తులైన కుటుంబసభ్యులు, అభిమానులు
నేటి సాయంత్రం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

మన తెలంగాణ/నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నేపర్తి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ (61) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరులో జరగనున్న ఒక అభిమాని వివాహ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వయంగా హరికృష్ణే నడుపుతున్న ఈ కారు అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టి పడిపోయింది. ఈ క్రమంలోనే కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు సంఘటనా స్థలంలోనే స్పృహ తప్పిపోయిన హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఆయన శరీరం సహకరించకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

నెల్లూరు జిల్లాలో ఒక అభిమాని వివాహానికి హాజరయ్యే నిమిత్తం ఫార్చూనర్ కారులో తెల్లవారుజాము 4.30 గంటలకు మెహిదీపట్నంలోని నివాసం నుంచి బయలుదేరిన హరికృష్ణ వెంట వెంకట్రావు, శివాజీ అనే ఇద్దరు కూడా ఉన్నారు. అన్నేపర్తి గ్రామంలో 12వ పోలీసు బెటాలియన్ సమీపానికి చేరుకోగానే వెనకసీటులో ఉన్న మంచినీళ్ళ బాటిల్‌ను అందుకునే క్రమంలో మూలమలుపు దగ్గర వాహనం అదుపు తప్పిందని, ప్రమాద పరిస్థితిని గమనించి తేరుకునేలోపే అంతా జరిగిపోయిందని వెంకట్రావు వివరించారు. ఎడమవైపు వెళ్తున్న వాహనాన్ని హరికృష్ణ ఒక్కసారిగా కుడివైపుకు తిప్పడంతో సుమారు 160 కి.మీ. వేగంతో వెళ్తున్న జీపు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలివైపుకు పడిపోయి పల్టీలు కొట్టిందని వివరించారు. జీపు గాల్లోకి ఎగిరి పల్టీ కొడుతున్న సమయంలోనే హరికృష్ణ బయటకు పడిపోయారని పేర్కొన్నారు. అదే సమయానికి ఆ రోడ్డుమీద వస్తున్న వాహన డ్రైవర్ అప్రమత్తమై ముళ్ళపొదల్లోకి తిప్పడంతో ఆ వాహనం ప్రమాదం నుంచి బైటపడింది. తాను, శివాజీ మాత్రం వాహనంలోనే ఇరుక్కుపోయామని, స్థానికులు వచ్చి తమను రక్షించారని, ఆ తర్వాత 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నామని తెలిపారు.

సీటుబెల్టు పెట్టుకోకపోవడం మృతికి కారణం?
ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ తన జీపును 160 కి.మీ. వేగంతో నడుపుతున్నారని, సీటు బెల్టు పెట్టుకోలేదని, అందువల్లనే పల్టీ కొట్టిన సమయంలో బయటకు పడిపోయారని జిల్లా ఎస్‌పి రంగనాధ్ వ్యాఖ్యానించారు. సీటు బెల్టు పెట్టుకుని ఉన్నట్లయితే ప్రమాదం జరిగిన సమయంలో కుదుపుకు బెలూన్లు తెరుచుకుని ఉండేవని, హరికృష్ణకు ఎలాంటి ప్రాణహాని జరిగి ఉండేదికాదని వ్యాఖ్యానించారు. అయితే వాహనంలో బెలూన్లు తెరుచుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీపు దాదాపు160 కి.మీ. వేగంతో స్వయంగా హరికృష్ణ నడుపుతున్నారని, వెనకసీటులో ఉన్న నీళ్ళ బాటిల్‌ను అందుకునే క్రమంలోనే అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని లోపల కూర్చున్న వెంకట్రావ్, శివాజీలు తెలిపారని రంగనాధ్ పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి హరికృష్ణ బయటపడేవారని వ్యాఖ్యానించారు.

అన్నీ తానై సాయం చేసిన కంచర్ల భూపాల్‌రెడ్డి :
ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న టిఆర్‌ఎస్ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కామినేని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందేలా కృషి చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి ఇటీవలి కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు తగ్గుముఖం పడుతుండడంతో టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్నది హరికృష్ణ అని తెలిసిన వెంటనే సినీ నటుడు బాలకృష్ణకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే హరికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.