Home తాజా వార్తలు హరికృష్ణ చివరి లేఖలో ఏముందంటే…?

హరికృష్ణ చివరి లేఖలో ఏముందంటే…?

Nandamuri Harikrishna Last Letter wrote to Fans

నల్గొండ: సినీ హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి ఎపి28 బిడ్ల్యూ-2323 అనే నెంబర్ గల కారులో వెళ్తుండగా అన్నెపర్తి దగ్గర డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలో హరికృష్ణ మరణించారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకీ రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్ టిఆర్, ఒక కూతురు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద  కుమారుడు జానకీరామ్ చనిపోయిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

శోకసంద్రంలో నందమూరి అభిమానులు…

హరికృష్ణ రోడ్డుప్రమాదంలో చనిపోయారనే విషయం తెలియగానే నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలాఉండగా హరికృష్ణ తన 62వ పుట్టిన రోజు(సెప్టెంబర్ 2న)ను పురస్కరించుకుని అభిమానుల కోసం ఓ లేఖ రాసి పెట్టుకున్నారు. ఆ లేఖ బయటకు రావడంతో ఆయన రాసిన ఈ లేఖే చివరి కావడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంతో మానవత్వం కలిగిన వ్యక్తి తనువుచాలించడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరో నాలుగు రోజుల్లో బర్త్ డే జరుపుకోవల్సిన తమ అభిమాన నటుడు ఇలా నిర్జీవంగా కనిపించడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

హరికృష్ణ అభిమానులకు రాసిన లేఖలో…

‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’ అని లేఖలో పేర్కొన్నారు.

తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి

హరికృష్ణ అకాల మరణంతో తెలుగు చిత్రసీమలో విషాదం అలుముకుంది. పలువురు నటీనటులు ఆయన మరణవార్త విని షాక్ అయ్యామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మోహ‌న్ బాబు, మంచు లక్ష్మీ, మ‌నోజ్, కోన వెంక‌ట్‌, అల్లు శిరీష్‌, త‌మ్మారెడ్డి, దేవి శ్రీ ప్రసాద్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, హ‌రీష్ శంక‌ర్, అల్లు అర్జున్, రాంచరణ్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, నాని త‌దిత‌రులు హ‌రికృష్ణ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.