Home జాతీయ వార్తలు నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారిని చంపుతామని బెదిరించారు

నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారిని చంపుతామని బెదిరించారు

Nandigram RO did not order recounting as he feared

 

అందుకే రీ కౌంటింగ్‌కు ఆదేశించలేదు : మమతా బెనర్జీ
5న దీదీ, 7న స్టాలిన్ ప్రమాణస్వీకారం

కోల్‌కతా: నందిగ్రామ్‌లో తన ఓటమిపై టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ మరోసారి ఘాటుగా స్పందించారు. నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారిని చంపేస్తామని బెదిరించినందునే రీకౌంటింగ్‌కు ఆదేశాలివ్వలేకపోయారని ఆమె ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తామని సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. మొదట తాను గెలిచినట్టు చెప్పారని, గవర్నర్ కూడా తనకు అభినందనలు తెలిపారని, ఆ తర్వాత పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయిందని ఆమె అన్నారు. మొదట తాను గెలుపొందినట్టు చెప్పి, ఆ తర్వాత ఫలితాన్ని ఎలా మారుస్తారని ఆమె ప్రశ్నించారు. నాలుగు గంటలపాటు సర్వర్ డౌన్ అయిందన్నారు. ఒక స్థానంలో ఫలితం తారుమారైనా తమకు ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నామని మమత అన్నారు.

తనకు ఓ ఎస్‌ఎంఎస్ వచ్చిందని, అందులో రీకౌంటింగ్ జరిపితే రిటర్నింగ్ ఆఫీసర్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆత్మహత్యలాంటి చావు జరుగుతుందని బెదిరించారని ఆమె తెలిపారు. నందిగ్రామ్‌లో మమతాబెనర్జీపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫలితాల తర్వాత కూడా కొన్ని చోట్ల హింస జరిగిందన్న వార్తల నేపథ్యంలో తన మద్దతుదారులను శాంతియుతంగా ఉండాల్సిందిగా మమత విజ్ఞప్తి చేశారు. బిజెపివాళ్లు రెచ్చగొట్టినా మీరు మాత్రం ఆవేశానికి గురి కావొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ ఆమె తన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికల అధికారులు పక్షపాతంగా వ్యవహరించి ఉండకపోతే బిజెపి 50 సీట్ల మార్క్ కూడా దాటకపోయేదని ఆమె అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆమె మరోసారి డిమాండ్ చేశారు. కొవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాతే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆలోచించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె అన్నారు. వామపక్షాలు ఈ ఎన్నికల్లో తమ ఓట్లను బిజెపికి వదిలివేయడం వల్లే వారు పతనావస్థకు చేరుకున్నారని ఆమె విమర్శించారు. వారితో రాజకీయంగా విభేదించినా, జీరోస్థాయికి వెళ్లాలని తాను కోరుకోవడం లేదని ఆమె అన్నారు. బిజెపికి వెళ్లిన ఓట్లను తిరిగి తెచ్చుకోవాలని ఆమె హితవు పలికారు.