Home తాజా వార్తలు యూఎస్ ఓపెన్ చాంపియన్ ఒసాకా

యూఎస్ ఓపెన్ చాంపియన్ ఒసాకా

యూఎస్ ఓపెన్ చాంపియన్ ఒసాకా
ఫైనల్లో అజరెంకా ఓటమి, నవోమి ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్

Naomi Osaka win US Open Title 2020

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో జపాన్ స్టార్, నాలుగో సీడ్ నవోమి ఒసాకా విజేతగా నిలిచింది. ఫైనల్లో బెలారస్‌కు చెందిన మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకాను ఓడించి ఒసాకా టైటిల్ సొంతం చేసుకుంది. ఒసాకాకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్ టైటిల్. అంతేగాక కెరీర్‌లో రెండో సారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు ఈసారి యూఎస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన అజరెంకాకు నిరాశే మిగిలింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అజరెంకా ఏకంగా ఫైనల్ వరకు చేరి పెను ప్రకంపనలే సృష్టించింది. ఇదిలావుండగా అజరెంకాతో జరిగిన ఫైనల్ పోరులో ఒసాకా 16, 63, 63 విజయం సాధించింది. తొలి సెట్‌లో అజరెంకా పైచేయి సాధించింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. చూడచక్కని షాట్లతో ముందుకు సాగింది. అజరెంకా జోరుకు ఒసాకా ఎదురు నిలువలేక పోయింది. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన అజరెంకా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను గెలుచుకుంది. కానీ రెండో సెట్‌లో మాత్రం ఒసాకా అనూహ్యంగా పుంజుకుంది. అజరెంకా జోరుకు బ్రేక్ వేస్తూ ఆటపై పట్టు సాధించింది. మరోవైపు ఒసాకా చెలరేగి ఆడడంతో విక్టోరియా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది.

దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఒసాకా సఫలమైంది. దూకుడుగా ఆడుతూ సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా ఒసాకా నిలకడైన ఆటతో అలరించింది. అజరెంకాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కళ్లు చెదిరే షాట్లతో ముందుకు సాగింది. ఒసాకా జోరుకు అజరెంకా వద్ద సమాధానమే లేకుండా పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన అజరెంకా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. మరోవైపు నవోమి మాత్రం తన జోరును కొనసాగిస్తూ లక్షం వైపు సాగింది. ఇదే క్రమంలో వరుసగా రెండో సెట్‌ను కూడా గెలిచి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. కరోనా బయట పడిన తర్వాత జరిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఆసియాకు చెందిన నవోమి ఒసాకా ఛాంపియన్‌గా నిలువడం విశేషం. స్టార్ క్రీడాకారిణిలు ఆశ్లే బార్టీ, కికి బెర్టెన్స్, హలెప్ తదితరులు ఈసారి బరిలోకి దిగలేదు. ఇక అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు టైటిల్ ఫేవరెట్లుగా కనిపించిన చెక్ రిపబ్లిక్ ఆశాకిరణాలు ప్లిస్కోవా, క్విటోవా తదితరులు ఆరంభంలోనే ఇంటిదారి పట్టారు. దీంతో ఒసాకాకు టైటిల్ సాధించడం తేలికగా మారింది. మరోవైపు ఏ మాత్రం అంచనాలు లేకుండా యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన బెలారస్ స్టార్ విక్టోరియా మాత్రం అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్‌కు చేరి పెను సంచలనమే సృష్టించింది. ఫైనల్‌కు చేరే క్రమంలో సెరెనా వంటి దిగ్గజాన్ని కూడా మట్టి కరిపించింది. అంతేగాక తుది సమరంలో ఓ సెట్‌ను కూడా గెలిచి సత్తా చాటింది. అయితే ఒసాకా అసాధారణ రీతిలో చెలరేగి పోవడంతో విక్టోరియా అజరెంకా రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

ఆనందంగా ఉంది
క్లిష్ట సమయంలో జరిగిన యూఎస్ ఓపెన్‌లో టైటిల్ సాధించడం చాలా ఆనందంగా ఉందని జపాన్ స్టార్ ఒసాకా పేర్కొంది. టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగానని, అందుకు తగినట్టుగానే ఆడుతూ లక్షం దిశగా సాగానని వివరించింది. ఇక టైటిల్ సాధించే క్రమంలో ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొక తప్పలేదని తెలిపింది. అయినా చివరి వరకు నిలకడగా ఆడుతూ టైటిల్ సాధించానని పేర్కొంది. ఈ టైటిల్ తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైందని అభిప్రాయపడింది. కరోనా వంటి మహమ్మరి క్రీడలను పూర్తిగా నిర్విర్యం చేసిన సమయంలో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ సాధించడాన్ని అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు ఒసాకా వ్యాఖ్యానించింది. కాగా, ఫైనల్లో ఓడిన అజరెంకా కన్నీళ్ల పర్యతరం అయ్యింది. టైటిల్ కోసం చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. అయితే తనకంటే మెరుగైన ఆటను కనబరిచిన ఒసాకా విజేతగా నిలిచేందుకు అన్ని విధాలుగా అర్హురాలని అజరెంకా పేర్కొంది.

Naomi Osaka win US Open Title 2020