Home దునియా సంతాన నర్సింహుడు

సంతాన నర్సింహుడు

 లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఎంతో విశిష్టత ఉన్న పుణ్యక్షేత్రం నాంపల్లిగుట్ట. ఇక్కడ గుట్ట మీద వెలసిన స్వామి వందల ఏళ్ల కిందటి నుంచీ భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలు అందుకొంటున్నాడు. గుట్ట దిగువున పడగ విప్పిన సర్పాకారంలో పెద్దగా నిర్మించిన నాగదేవత ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుకే ఈ ప్రదేశం ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది.

Narasimha-Swamy

  

ప్రకృతి అందాల మధ్య ఎత్తైన గుట్ట మీద లక్ష్మీసమేతంగా కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం చాలా పురాతనమైనది. చుట్టూ పచ్చని చెట్లూ, పంటపొలాలు ..ఓ వైపు మూల వాగు..మరో వైపు మానేరు వాగులతో ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇక్కడికి భక్తులు, పర్యాటకులు ఏడాది పొడవునా వస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగాదగా పిలిచేవారు. 600 సంవత్సరాల క్రితమే ఈ గుట్టపైన లక్ష్మీనరసింహస్వామి వెలిసినట్లు చెబుతుంటారు. చోళుల కాలంలో ఇక్కడ ఉన్న స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. క్రీ.శ. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజనరేంద్రుడు వేములవాడ ప్రాంతాన్ని దర్శించినాడట. అప్పుడు ఇక్కడ కోనేటికి మెట్లు కట్టించాడట. అతని భార్య రత్నాంగిదేవి ఈ గుట్టపైనే తపస్సు చేసి సారంగధరుడిని కుమారుడిగా పొందిందని చారిత్రక కథనం వినిపిస్తుంది. ఇందువల్లే కొత్తగా పెళ్లయిన దంపతులు సంతానం కలిగితే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకనే నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామిని సంతాన నర్సింహుడని అంటారు. సంతానం కల్గిన దంపతులు ఆలయం తూర్పున ఉన్న రావిచెట్టుకు ముడుపులు కట్టి వె ళ్తుండటం ఆచారంగా వస్తోంది.

ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏమంటే.. ఆలయం లోపల ఉన్న ఆంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమాన్‌కి 41 రోజులు మండల దీక్ష పడితే కష్టాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. గుట్టపైన రెండు చరియల మధ్య సహజంగా ఏర్పడిన రెండు కోనేరులున్నాయి. ఆలయానికి పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతోపాటు ఇతర దేవతామూర్తులున్నారు. క్రీ.శ. 9, 10 శతాబ్దాల్లో నవనాథ సిద్ధులు ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారట. వారు ప్రతిరోజూ ఈ గుహ నుంచి భూగర్భ సొరంగం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారట. ప్రతి ఏడాది నాంపల్లిగుట్టపై ఉన్న స్వామి ఆలయంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం పూజలు, రామనవమి, గోదారంగనాథుల కల్యాణంలాంటి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.

నాంపల్లి గుట్ట పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. కాళీయమర్దనం ఇక్కడున్న మరో ఆకర్షణ. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం గుట్టపై నుంచి చూస్తుంటే ..చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపిస్తూ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. దీని లోపలికి వెళ్లే మార్గంలో స్వామి లీలల్ని వివరించేలా అనేక శిల్పాలను ఏర్పాటుచేశారు. నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. పర్యాటకశాఖ గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానిటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్ అండ్ సౌండ్, తాగునీటి వసతిలాంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  ప్రధాన రోడ్డు నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి మెట్ల ద్వారా స్వామిని దర్శించుకోవచ్చు.