Friday, March 29, 2024

అఫ్తాబ్‌కు నార్కో అనాలిసిస్ టెస్టు.. అనుమతించిన న్యాయస్థానం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో అత్యంత క్రూరంగా సహజీవిని అంతమొందించిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28 ఏండ్లు)కు నార్కో అనాలిసిస్ టెస్ట్ జరుగుతుంది. మహారాష్ట్ర యువతి శ్రద్ధా వాకర్‌ను చంపి, ముక్కలు చేసిపారేసినట్లు అభియోగాలు ఉన్న అఫ్తాబ్‌కు సత్యశోధన కోసం శాస్త్రీయపరమైన నార్కో అనాలిసిస్ టెస్టు నిర్వహించేందుకు స్థానిక సాకేత్ జిల్లా న్యాయస్థానం గురువారం అనుమతిని ఇచ్చింది. మరో వైపు ఈ యువకుడి పోలీసు కస్టడీని మరో ఐదు రోజుల పెంచుతూ ఆదేశాలు వెలువరించింది. ఈ నరరూప రాక్షసుడిని పబ్లిగ్గా ఉరితీయాలని కోరుతూ లాయర్లు కోర్టులో నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ వ్యక్తిపై కోర్టు హాల్‌లో దాడి జరుగుతుందనే విషయాన్ని పసికట్టి వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరుపర్చారు. శ్రద్ధాను చంపిన యువకుడిని గత శుక్రవారం అరెస్టు చేసినప్పటి నుంచి స్థానికపోలీసులు ఇంటరాగేటు చేస్తూ వస్తున్నారు.

మరికొద్ది రోజులు ఆయన తమ కస్టడీలో ఉండేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. దీనికి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా అంగీకారం తెలిపారు. దారుణ హత్యకు సంబంధించి శ్రద్ధా వాకర్ సెల్‌ఫోన్, హంతకుడు వాడిన కత్తి కీలక సాక్షాధారాలుఅని ఇప్పటివరకూ వీటిని తాము స్వాధీనపర్చుకోలేదని, ఈ దిశలో ఈ వ్యక్తి పోలీసు కస్టడీని పెంచాలని పోలీసులు తమ అప్పీలులో తెలిపారు. పోలీసు కస్టడీలో అఫ్తాబ్ తాను నేరం చేసినట్లు అంగీకరించారు. అయితే పోలీసు కస్టడీలో ఇచ్చే వాంగ్మూలం చెల్లనేరదని, న్యాయమూర్తి ఎదుట ఇచ్చే వాంగ్మూలమే చెల్లనేరుతుందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అయితే దీనికి కూడా సరైన ఆధారాలు ఉంటేనే నిందితుడు దోషిగా తేలుతాడు.

కోర్టు ముందు గుమికూడిన లాయర్ల ఆగ్రహం
నిందితుడిని ఉరితీయాలని నినాదాలు

నిందితుడిని నాలుగు గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపరుస్తారనే సమాచారంతో ఢిల్లీకోర్టు వద్దకు భారీ సంఖ్యలో లాయర్లు తరలివచ్చారు. ఉరితీయండి ఉరితీయండి అంటూ నినాదాలకు దిగారు. దీనితో కోర్టు ప్రాంగణం అంతా దద్దరిల్లింది. జిహాదీని ఉరితీయండి అంటూ ఓ లాయర్ కేకలు పెట్టాడు. ఇది మతమార్పిడి వ్యవహారం అని , హిందూ యువతిని ఆకట్టుకుని ప్రేమించినట్లు నటించి తరువాత మతం మార్పిడికి యత్నించే లవ్‌జిహాదీ వ్యవహారం అని ఇప్పటికే మితవాద సంస్థలు, ఏకంగా ఈ యువతి తండ్రి కూడా ఆరోపించడంతో , దీనిని ప్రస్తావిస్తూ ఇప్పుడు లాయర్లు తమ నిరసనలను ఉధృతం చేశారు.

దాదాపు వంద మంది వరకూ లాయర్లు మధ్యాహ్నం 3 గంటల నుంచే కోర్టు ఆవరణకు చేరుకున్నారు. నిందితుడుపై వీరు దాడికి దిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దారుణాతిదారుణమైన నేరం జరిగినందున దీనిపై నిరసనకు తాము తరలివచ్చామని సురేంద్రకుమార్ అనే లాయరు తెలిపారు. సముచిత రీతిలో సత్వరంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News