Home తాజా వార్తలు 16 వినతులు

16 వినతులు

KCR ,Narendra Modi meet

 

ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ సమర్పణ

కాళేశ్వరం జాతీయ హోదా

కోటా బిల్లుకు ఆమోదం

ఎస్‌సి వర్గీకరణ

బైసన్ పోలో గ్రౌండ్స్ అప్పగింత
9వ, 10వ షెడ్యూలు సంస్థల విభజన

కృష్ణా జల వివాదాలన్నీ ట్రిబ్యునల్‌కు బదిలీ

ట్రిపుల్ ఐటి, ఐఐఎం, ఐఐఎస్‌ఇఆర్‌ల మంజూరు

కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు వెయ్యి కోట్లు

వెనకబడిన నిధుల విడుదల

ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి

దాదాపు గంటపాటు సాగిన చర్చలు

ప్రధాని సూచన మేరకు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం

మన తెలంగాణ /న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వివాదాలన్నింటినీ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న గిరిజనులకు, ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలపాలని.. ఇలా మొత్తం పదిహారు అంశాలను ప్రధానికి వివరించారు. సుమారు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో నూతన సచివాలయం నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల (బైసన్ పోలో గ్రౌండ్స్)ను వీలైనంత త్వరగా అప్పగించాలని కోరారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయిన కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించి పదిహేడు అంశాలతో పాటు మరికొన్నింటిని కూడా ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రధానిని ఆయన నివాసంలో కలిసి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కూడా వివరించారు. తెలంగాణ ఏర్పడి నాలుగున్నేళ్ళు దాటినా ఇంకా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక అంశాలను కూడా ప్రస్తావించారు.

విభజన చట్టంలో లేకపోయినప్పటికీ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటిని నెలకొల్పాలని, రాష్ట్రానికి ఒక ఐఐఎంను మంజూరు చేయాలని, రాష్ట్రంలోని విద్యా అవసరాలకు అనుగుణంగా సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చి కేంద్రాన్ని నెలకొల్పాలని, రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడినందున ఈ జిల్లా కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను నెలకొల్పాలని.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని సూచన మేరకు నేరుగా అక్కడి నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నివాసానికి వెళ్ళారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు సంబంధించిన అంశాలను పరిష్కరించే బాధ్యత నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోం మంత్రిత్వశాఖది కాబట్టి ప్రధాని సూచన మేరకు ఈ అంశాలన్నింటినీ వివరించాల్సిందిగా కెసిఆర్‌కు ప్రధాని సూచించడంతో రాజ్‌నాధ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి చర్చించారు.

ప్రధానికి సమర్పించిన విజ్ఞాపన పత్రాల్లోని అంశాలు
నూతన సచివాలయం నిర్మాణంతో పాటు వివిధ జిల్లాలను కలపడానికి నిర్మిస్తున్న, విస్తరిస్తున్న రహదారులకు అవసరమైన రక్షణశాఖ ఆధీనంలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం;
కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటికి అనుమతి;
హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థలను నెలకొల్పడం;
హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ను నెలకొల్పడం;
రాష్ట్రంలో కొత్తగా ఉనికిలోకి వచ్చిన 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను నెలకొల్పడం;
ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంటు కార్పొరేషన్ ఫ్యాక్టరీని జాతీయ రహదారుల అథారిటీ, సిమెంటు కార్పొరేషన్‌ల సంయుక్త నిర్వహణలో పునరుద్ధరించడం;
జహీరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ‘నిమ్జ్’ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్)కు అవసరమైన నిధులను విడుదల చేయడం;
వరంగల్‌లో నెలకొల్పుతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం తరఫున వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయడం;
కృష్ణా నదీ జలాల వివాదాలన్నింటినీ జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేయడం;
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేయడంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తానికి జీవన రేఖగా ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధిని మంజూరు చేయడం;
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదవ, పదవ షెడ్యూలు సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం;
పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను, పనులను త్వరితగతిన పూర్తి చేయడం;
షెడ్యూల్డు కులాల వర్గీకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం;
వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రతీ ఏటా ఇచ్చే రూ. 450 కోట్లను సత్వరం విడుదల చేయడం;
గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మత్తు తదితరాలకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నుంచి నిధుల మంజూరు. ఈ అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే వినూత్నంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రత్యక్ష ఫలాలను దృష్టిలో పెట్టుకుని గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ. 24,205 కోట్లను విడుదల చేయాల్సిందిగా కోరారు. అప్పట్లోనే ఆర్థిక శాఖకు నీతి ఆయోగ్ ఈ సిఫారసును లిఖితపూర్వకంగా పంపినా ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని, ఇప్పటికైనా మంజూరయ్యేలా చూడాలని ప్రధానిని కెసిఆర్ కోరినట్లు తెలిసింది.

Narendra Modi meet on many issues related to KCR state

Telangana Latest News