Tuesday, April 16, 2024

15 మందికి నారీశక్తి పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

Nari Shakti awards

 

న్యూఢిల్లీ : వివిధ రంగాలలో ప్రత్యేకతలను కనబర్చిన 15 మంది మహిళలకు ఈ ఏటి నారీ శక్తి పురస్కారాలు దక్కాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం వీటిని అందించారు. సమాజంలో కీలక పరివర్తనకు వీరి ప్రతిభ, సేవలు దోహదం చేశాయని పేర్కొంటూ వీరిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఓ మహిళా తాపీ మేస్త్రీ, శతాధిక ప్రాయపు క్రీడాకారిణి, జార్ఖండ్‌కు చెందిన లేడీ టార్జన్, పుట్టగొడుగుల మహిళ ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కేంద్రం విశిష్ట మహిళలకు ఈ నారీ శక్తి పురస్కారాలను అందించడం ఆనవాయితీగా ఉంది. వ్యవసాయం, క్రీడలు, హస్తకళలు, అటవీకరణ, వన్యప్రాణి రక్షణ, సాయుధ బలగాలు, విద్యా వంటి పలు రంగాలకు చెందిన వారికి నారీశక్తి పురస్కారాలు వరించాయి. 43 ఏండ్ల బీనాదేవీ పుట్టగొడుగుల పెంపకంతో ఆదర్శంగా నిలిచారు. ఎందరో రైతులకు ఈ సాగులో శిక్షణను అందించి వారి జీవనక్రమాన్ని తీర్చిదిద్దారు.

అంతా ఆమెను పుట్టగొడుగుల మహిళ అని పిలుస్తారు. 103 ఏళ్ల మాన్‌కౌర్ క్రీడారంగంలో నారీశక్తి పురస్కారం పొందారు. చంఢీగఢ్ అద్భుతం అయిన ఈ మహిళ తమ 93వ ఏట అథ్లెటిక్‌గా మారారు. క్రీడలకు వయస్సుతో నిమిత్తం లేదని చాటారు. పలు పతకాలను పొందారు. 2016లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో ప్రపంచంలోనే అతి వేగంగా పరుగు తీసే పెద్ద వయస్సు క్రీడాకారిణిగా నిలిచారు. ఆమె ఫిట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 58 సంవత్సరాల కలావతి దేవి కాన్పూర్ జిల్లాలో బహిరంగ మలమూత్ర విసర్జన అలవాటును తగ్గించడానికి కృషి చేశారు. 4వేల మరుగుదొడ్ల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల పడాల భూదేవి గిరిజన మహిళలు, వితంతువులు ఇతర మహిళల అభ్యున్నతికి పాటుపడినందుకు నారీశక్తి అవార్డు అందుకున్నారు. తండ్రి స్థాపించిన చిన్నాల్ ఆదివాసీ వికాస్ సొసైటీ (సిఎవిఎస్) ద్వారా పలు సామాజిక సేవలు చేస్తూ, పోడు భూముల అభివృద్థి దిశలో పాటుపడుతున్నారు. ఇక అటవీ పరిరక్షణకు పాటుపడుతూ ఆడ అడవిమనిషిగా పేరొందిన 47 ఏండ్ల చార్మీ ముర్మూ పర్యావరణ పరిరక్షకురాలిగా తన సత్తా చాటారు. జార్ఖండ్‌కు చెందిన ఈ మహిళ వేలాది మంది మహిళలను చైతన్యపర్చి రాష్ట్రంలో పాతిక లక్షల చెట్లు నాటడంలో విజయం సాధించారు. పురస్కారాలు అందుకున్న వారిలో నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దవార్డేషీ ఇతర విశిష్ట మహిళలు ఉన్నారు.

Nari Shakti awards for 15 people
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News