Friday, April 19, 2024

భూగ్రహ రక్షణకు నాసా సరికొత్త ఆయుధం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : విశ్వంలో గ్రహాలతోపాటు అనేక గ్రహశకలాలు ఉన్నాయి. ఈ గ్రహశకలాల ధాటికి భూమిపై ఉన్న డైనోసార్లు సైతం 70 శాతం జీవరాశులు అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 2013 ఫిబ్రవరి 15న రష్యాలోని చల్యాబిన్క్ అనే ప్రాంతంలో బారీ ఉల్క రాలి పడడంతో దాని ధాటికి చుట్టుపక్కల ఆరు నగరాల్లోని 7200 భవనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 1500 మంది గాయపడ్డారు. భూమికి దగ్గరగా వెళ్లిన ఓ గ్రహశకలం నుంచే ఈ ఉల్క ఊడిపడిందని తర్వాత పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో భూమికి దగ్గరగా వస్తున్న గ్రహ శకలాలను గుర్తించి వాటి కక్షను బట్టి ముప్పు ఉందో లేదో ముందే చెబుతున్నారు. అయితే సమీప భవిష్యత్తుల్లో భూమిని ఢీ కొట్టగలిగే అవకాశం ఉన్న గ్రహశకలాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికైతే గుర్తించ లేక పోయారు. కానీ వాటి నుంచి ముప్పు మాత్రం కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాసా కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గ్రహశకల వేగాన్ని, దిశను మార్చగలమా అన్న కోణంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్‌కు డార్ట్‌డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అని పేరు పెట్టారు. ఈ వాహక నౌకను స్పేస్ ఎక్స్ నిర్మించిన పాల్కన్ 9 రాకెట్ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.51 గంటలకు అంతరిక్షం లోకి మోసుకెళ్లింది.

దాదాపు ఏడాది పాటు ఇది ప్రయాణం చేసి లక్షిత కక్షను చేరుకోనుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే, వాటిని అంతరిక్ష వాహక నౌకతో ఢీకొట్టి దాని వేగాన్ని దిశను మార్చే ప్రయత్నమే ఈ ప్రయోగం. అంటే భూగ్రహ రక్షణ నిమిత్తం నాసా ఓ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోందన్న మాట. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ తిరుగుతున్న డైమోర్ఫోస్ అనే మరో చిన్న గ్రహశకలాన్ని ఎంచుకున్నారు. ఫుట్‌బాల్ సైజులో ఉండే ఈ గ్రహశకలాన్ని 20 ఏళ్ల క్రితం కనుగొన్నారు. 2022 సెప్టెంబరులో ఇవి భూమికి అతి సమీపంలో (దాదాపు 1.4 కోట్ల కిలోమీటర్లు) కి రానున్నాయి. సరిగ్గా ఆ సమయంలో డార్ట్ వాహక నౌక డైమోర్ఫోస్ దగ్గరకు చేరుకుంటుంది. దాదాపు గంటకు 24,140 కిమీ వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. డార్ట్‌పై ఉన్న డ్రాకో అనే కెమెరా డ్రైమోర్ఫోస్‌ను గుర్తించడంలో సాయపడుతుంది. అలాగే దాన్ని ఢీకొట్టడానికి 20 సెకన్ల ముందు వరకు భూమికి చిత్రాలు పంపుతుంది. మరోవైపు డార్ట్ లోనే సూట్‌కేసు సైజులో ఓ చిన్న ఉపగ్రహం ఉంటుంది. దీన్ని ఇటలీకి చెందిన స్పేస్ ఏజెన్సీ అభివృద్ది చేసింది. ఇది గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి 10 రోజుల ముందు డార్ట్ నుంచి విడిపోతుంది. డైమోర్పోస్ దగ్గరకు డార్ట్ చేరుకునే సమయానికి ఇది 34 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రయోగానికి సంబంధించిన కీలక చిత్రాలు, వీడియోలను తీసి పంపుతుంది. ఢీకొట్టిన తరువాత డైమోర్పోస్‌తోపాటే ప్రయాణించి మరికొన్ని ఫోటోలు తీస్తుంది. వాస్తవానికి డైమోర్ఫోస్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదు. కేవలం ప్రయోగానికి మాత్రమే దీన్ని ఎంచుకున్నారు. రాబోయే 100 సంవత్సరాల వరకు భూమికి గ్రహశకలాల వల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా తెలిపింది. భూమికి కనీసం 2.8 కోట్ల మైళ్ల సమీపం లోకి వచ్చే వస్తువుల జాబితాను నాసా సిద్ధం చేస్తుంటుంది. ఇప్పటివరకు 27,000 ఆబ్జెక్టులను గుర్తించారు. వీటిలో చాలావరకు భూమిని ఢీకొట్టే అవకాశం లేదు. 21782290 సంవత్సరాల మధ్య బెన్ను అనే గ్రహశకలం భూమికి అత్యంత సమీపం లోకి రానున్నట్టు చెబుతున్నారు. దీనిపై అధ్యయనానికి ఒసైరిక్స్ అనే వాహక నౌకను నాసా పంపింది. ఇటీవలే ఇది బెన్ను నుంచి మట్టి నమూనాలను సేకరించింది. తిరిగి 2023 సెప్టెంబరులో ఇది భూమికి చేరుకోనున్నది.

Nasa launch DART Mission to Crash Asteroid

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News