Friday, April 19, 2024

హైవేలే ఇళ్లూ వాకిళ్లూ

- Advertisement -
- Advertisement -

National Highways have become houses for Farmers

 

ఢిల్లీ శివార్లలో ఘాటులంగర్ల పంజాబీ పల్లెలు

న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ఆ రైతులకు పంజాబ్‌లోని తమ ఇళ్లు లేదా పంట పొలాలే నివాసాలుగా ఉంటూ వచ్చాయి. అక్కడే వారి జీవనయానం సాగేది. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్ రైతాంగం రోడ్డెక్కింది. దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్న ఈ రైతులకు దాదాపుగా పదిరోజులుగా జాతీయ రహదారులే ఇళ్లూ వాకిళ్లూ అయ్యాయి. ఢిల్లీకి చేరుకునే రోడ్ల వెంబడి విచిత్ర అసాధారణ వాతావరణం నెలకొంది. పలు చోట్ల జాతరలు ఉత్సవాలు జరుగుతున్న సందడి నెలకొంది. ట్రాక్టర్లపైనే టెంట్లు వేసుకున్నారు. రోడ్ల పక్కనే కూరగాయలు తరుగుతూ వంటలకు సిద్ధం అయ్యారు. తమ సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌కు సోలార్ ప్యానెల్స్‌పై ఆధారపడుతున్నారు. ఇక్కడకు వచ్చిన రైతుల కోసం పలుచోట్ల ఉచిత మెడికల్ క్యాంప్‌లు వెలిశాయి. రైతులలో కొందరికి వీడలేని అలవాటుగా మారిన హుక్కాలు పీల్చుకుంటూ గడుపుతున్నారు.

ఢిల్లీ సరిహద్దులల్లోని టిక్రి ప్రాంతం ఇప్పుడు ఓ రాదారిగా కాకుండా ఏకంగా ఓ పల్లెటూరుగా మారింది. ఇప్పటివరకూ ఈ రోడ్ల మీదుగా కేవలం వాహన సంచారం ఉండేది. ఇప్పుడు ఇక్కడ జన సంచారం అంతకు మించి జనజాతరల దృశ్యాలు సంతరించుకున్నాయి. దేశ రాజధానిలో నెలవైన ఉన్న కేంద్ర సర్కారుకు తమ బాధలు విన్పించుకునేందుకు ఉన్న ఊళ్లూ, పంట పొలాలు వదులుకుని రైతులు తరలివచ్చారు. పంజాబ్‌లో రైతులకు ఎక్కువగా అవసరాలకు ఉపయోగపడే ట్రాక్టర్లుపై అత్యధిక సంఖ్యలో జనం రాజధానికి ప్రయాణమై వచ్చారు. ఇప్పుడు ఊరుగా అవతారం ఎత్తిన రాదారిలో ఎక్కువరోజులే బసచేసేందుకు వీలుగా రైతులు అన్ని సరంజామాలతో తరలివచ్చారు. పంజాబీలకు ప్రియమైన చపాతీలు, ఆలుకుర్మాలు ఎప్పుడు వేడివేడిగా ఇక్కడ సిద్ధం అవుతున్నాయి.

ఇది మా మరో ఉరయ్యేలా ఉంది

ఇప్పటికిప్పుడు ఈ పోరు సమసిపొయ్యేదిగా లేదని అన్పిస్తోందని, ఈ లెక్కన చూస్తే ఇక్కడనే తమ మరో ఊరు వెలిసేవిధంగా ఉందని 50 ఏళ్ల గురునామ్ సింగ్ అనే రైతు తెలిపారు. పంజాబ్‌లోని మన్సా జిల్లా నుంచి ఈ రైతు ఇక్కడికి వచ్చారు. కనీసం ఆరు నెలల పాటు ఉండేందుకు అవసరమైన ఆహార పదార్థాలతో వచ్చినట్లు కూడా ఈ రైతు చెప్పారు. తొమ్మిది రోజుల క్రితం రైతులు ఢిల్లీ శివార్లలోని ముఖద్వారాల వద్దకు చేరారు. ప్రతిరోజూ 5వేల మందికి భోజనాలు సరఫరా చేసేందుకు లంగర్ సిద్ధం అవుతోంది. నిరసన స్థలి ఇప్పుడు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలతో సందర్శనా స్థలిగా కూడా మారింది. ఇక్కడికి వచ్చే వారు ఎవరైనా మధ్యాహ్నం ఉచితంగా భోజనం చేసి వెళ్లుతున్నారు. కరోనా వైరస్ మరో వైపు శీతాకాలపు ఉక్కిరిబిక్కిరి చేసే చలిగాలులతో బాధపడే వారికి ఇప్పుడు ఇక్కడ వెలిసిన వైద్యశిబిరాలలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో ఆసుపత్రి వాతావరణం కూడా నెలకొంది. పలువురు డాక్టర్లు ఈ ప్రాంతంలో స్వచ్ఛంద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రైతులకు పరీక్షలు జరుపుతున్నారు.

కరోనా గిరోనాలు ఇతరత్రా జబ్బులు తమను ఏమీ చేయజాలవని, ముందు ఈ చట్టాలు పోతే తాము పూర్తిగా ఎప్పటిలాగానే ఆరోగ్యవంతులం అవుతామని రైతులు తేల్చిచెపుతున్నారు. తాను గత నెల 26వ తేదీన ఇల్లు వదిలి రోడ్డున పడ్డానని గుర్నాం సింగ్ తెలిపారు. టిక్రి ప్రాంతానికి రాగానే ఛాతీనొప్పి వచ్చింది. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన ఈ రైతు ఇంటి బాట పట్టడానికి బదులుగా నిరసన పంథానే ఎంచుకున్నారు. ‘ మేం పంజాబీలం, ఎక్కడికి పోయినా ప్రేమానురాగాలను పంచుతాం. పొందుతాం, మా వల్ల ఎవరికి ఏమీ కాదు , ఇతరుల వల్ల మాకేమీ నష్టం ఉండదు. ఇక ఈ చలికాలపు పులి లేదా కరోనా కాట్లు గీట్లు ఇవేవీ కూడా మా ఉద్యమ పంథాను దెబ్బతీయలేవు’ అని తిరిగి రోడ్డున పడ్డ ఈ రైతు తెలిపారు. ఈ చట్టాలు పూర్తిగా పోతే కానీ తిరిగి తాము ఇక్కడి నుంచి స్వస్థలాలకు పొయ్యేది లేదని అక్కడికి వచ్చిన రామూ సింగ్ అనే యువ రైతు స్పష్టం చేశారు. ట్రాక్టరే ఇల్లు, ఈ రోడ్డే తన వాకిలీ అని తేల్చివేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News