Friday, March 29, 2024

కేంద్రానిది ద్వంద వైఖరి !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :గంగానది ప్రక్షాళనపై ఉన్న శ్రద్ధ తెలుగు రాష్ట్రాల నదులపై కేంద్రం చూపించడం లేదు. తెలంగాణలో ప్రవహించే మూసీతో పాటు భద్రాచలం, మంచిర్యాల, రామగుండం, ఎపిలోని రాజమండ్రి మీదుగా ప్రవహించే గోదావరి నదుల ప్రక్షాళన కోసం ఇప్పటివరకు ప్రధాని మోడీ పైసా కేటాయించలేదు. ఈ నదుల శుద్ధిపై ప్రధాని కనికరించకపోవడం దారుణమని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంగానది ప్రక్షాళన కోసం ‘నమామి గంగే’ పేరుతో సుమారు రూ.13 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. రానున్న రోజుల్లో (మరో 36 ఉపనదుల అభివృద్ధి కోసం) మరో రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్టు కేంద్రమంత్రి ఈ మధ్యనే ప్రకటించగా, అందులో కూడా మూసీ పేరు లేకపోవడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూసీనది ప్రక్షాళనకు 2007 సంవత్సరంలోనే సుమారు రూ.800ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చు అవుతాయని అప్పటి ఉమ్మడి ఎపి ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా అప్పటి కేంద్ర ప్రభుత్వం (యూపిఏ) రూ.335.65 కోట్ల నిధులను కేటాయించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయికి కూడా కేంద్రం ఈ నదుల అభివృద్ధికి కేటాయించలేదు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని సిఎం కెసిఆర్ లేఖలు రాసినా, బిఆర్‌ఎస్ ఎంపిలు విజ్ఞప్తిచేసినా ఇప్పటివరకు దానిపై కేంద్రం స్పందన మాత్రం శూన్యమని బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం సహకరించకపోయినా మూసీనది సుందరీకరణ, శుద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14,744 కోట్లను కేటాయించి దాని అభివృద్ధికి నడుం బిగించింది.
స్నానపు ఘాట్ల అభివృద్ధికి మాత్రమే కేంద్రం సహకరిస్తుంది: కేంద్ర మంత్రి
నదుల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కలపకుండా ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతలపై తెలంగాణ ఎంపిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస రెడ్డి (బిఆర్‌ఎస్) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నదుల ప్రక్షాళన ఒక నిరంతర ప్రక్రియ అని, నీటి వనరులు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదుల్లోకి మురుగు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాల ప్రయత్నాలకు కేంద్రం ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటు అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లోని మూసీ, గోదావరి సహా గుర్తించిన కాలుష్యభరిత నదీతీరాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, తక్కువ ఖర్చుతో కూడుకున్న శానిటేషన్, నదీ తీరాల్లో స్నానపు ఘాట్ల అభివృద్ధికి మాత్రమే కేంద్రం సహకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్‌ఆర్‌సిపి) కింద హైదరాబాద్, భద్రాచలం, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో మొత్తం 621.46 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ. 345.72 కోట్ల వ్యయంతో కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులను మంజూరు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. గోదావరి తీరం వెంట రాజమండ్రి వద్ద రూ. 21.78 కోట్లతో 30 ఎంఎల్‌డి సామర్థ్యం కల్గిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపి) ఏర్పాటైందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ జవాబులో పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో మూసీ నది కాలుష్యాన్ని నివారించేందుకు 2007లోనే రూ. 335.65 కోట్లతో 593 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టును చేపట్టామని, రాజమండ్రిలో ఇప్పటికే ఉన్న ఎస్టీపి సామర్థ్యాన్ని 30 ఎంఎల్డీ నుంచి 50.6కు పెంచడానికి రూ. 88.46 కోట్లతో ప్రాజెక్ట్ మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.
నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఆధ్వర్యంలో.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సిపి (నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఎన్‌ఆర్‌సిపి వివిధ నదుల్లోని కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది. నదుల్లో కాలుష్య నివారణ పనులను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన ఆర్థిక సహాయాన్ని ఎన్‌ఆర్‌సిపి అందిస్తోంది. ఇప్పటివరకు ఎన్‌ఆర్‌సిపి కింద మురుగునీటిని అడ్డుకోవడం, ఆ నీటిని మళ్లీంచడం, మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కర్మాగారాల ఏర్పాటు, తక్కువ ఖర్చుతో కూడిన పారిశుద్ధ్యం, నది ముందు, స్నాన ఘాట్‌ల అభివృద్ధి, విద్యుత్/చెక్క ఆధారిత శ్మశానవాటిక మొదలైన నిర్మాణాలను చేపట్టింది.
16 రాష్ట్రాల్లోని 77 పట్టణాల్లోని 34 నదుల కలుషిత ప్రాంతాల్లో.
ఇప్పటివరకు ఎన్‌ఆర్‌సిపి దేశంలోని 16 రాష్ట్రాల్లోని 77 పట్టణాల్లోని 34 నదుల కలుషిత ప్రాంతాల్లో పనులు చేపట్టింది. దీనికోసం రూ.5870.54 కోట్లను ఖర్చు చేసింది. కేంద్ర వాటా రూ. వివిధ కాలుష్య నివారణ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు 2452.35 కోట్లను ఎన్‌ఆర్‌సిపి విడుదల చేసింది. ఎన్‌ఆర్‌సిపి కింద 2522.03 ఎంఎల్‌డి (రోజుకు మిలియన్ లీటర్లు) మురుగునీటి శుద్ధి సామర్థ్యం (ఎస్‌టిపి)లను నిర్మించింది.
మొత్తంగా రూ.345.72 కోట్లు…. 621.46 ఎంఎల్‌డి నీటి శుద్ధి….
తెలంగాణలోని హైదరాబాద్‌లోని మూసీనది శుద్ధికి ఫిబ్రవరి, 23వతేదీ, 2007 సంవత్సరంలో రూ.335.65 కోట్లను (593 ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ధి కోసం) ఎన్‌ఆర్‌సిపి కింద (కేంద్రం) ఈ నిధులను విడుదల చేసింది. దీంతోపాటు 2002 సంవత్సరంలో భద్రాచలంలోని గోదావరి నది శుధ్ధి కోసం రూ.2.01 కోట్లు (4 ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ధి కోసం), 1995 సంవత్సరంలో మంచిర్యాలలోని గోదావరి కోసం రూ.2.31 కోట్లు (6.46 ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ధి కోసం), 1995 సంవత్సరంలో రామగుండంలోని గోదావరి కోసం రూ.5.75 కోట్లు (18ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ధి కోసం) మొత్తంగా రూ.345.72 కోట్లను 621.46 ఎంఎల్‌డి నీటి శుద్ధి కోసం కేంద్రం ఈ నిధులను కేటాయించింది. దీంతోపాటు ఎపిలోని రాజమండ్రి గోదావరి నది శుద్ధి కోసం రూ.21.78 కోట్లను (30 ఎంఎల్‌డి మురుగునీటి శుద్ధి కోసం 1996 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిధులను కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News