Home ఎడిటోరియల్ సలాం పోలీస్ మీ త్యాగం మరువం…

సలాం పోలీస్ మీ త్యాగం మరువం…

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటం. భారత్- చైనా సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతం లో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ స్థలం నుంచే ఆరంభమైంది. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని ఫణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత.

మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. అలాంటి ప్రాణాన్ని త్యాగం చేయడం అన్నది అత్యున్నత స్థాయి త్యాగం. పోలీసులు దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం వారి విలువైన ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ త్యాగా లు తగినంతగా గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఈ త్యాగాలను గుర్తించి, ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దులలో సైనికులు, అంతర్గత శత్రువులతో పోలీసు అసువులు బాస్తున్నారు. ప్రజలు పోలీసువారి చిన్నచిన్న తప్పులను పరిగణనలోకి తీసుకోకుండా, వారి త్యాగాల గురించి ఈ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా ఒక్క నిమిషం ఆలోచించి గుర్తించినా పోలీసులు సంతోషిస్తారు.

అక్టోబర్ 21 1959 సంవత్సరంలో కేంద్ర రిజర్వు బలగానికి చెందిన సిబ్బంది, దేశ సరిహద్దులలోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా పెద్ద సంఖ్యలో చైనా దేశానికి చెందిన సైనికులు దాడి చేశారు. ఈ ఘటనలో మన బలగాలు ఎంతో సాహసంతో ధైర్యంతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారు. దేశ సరిహద్దులలో విధులు నిర్వహించేది, దేశ అంతర్గత భద్రత కల్పించేది పోలీసు మాత్రమే. నిరంతరం ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉండేది పోలీసులే. పోలీసు విధులు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా అమరులైన పోలీసు అధికారులు ఎందరో, వారి ఆశయ సాధన కోసం పని చేస్తామని ప్రతిన బూనడానికి పోలీసుల అమరవీరుల దినోత్సవం వేదికగా నిలుస్తోంది.

రక్షక భటులు తమ ప్రాణాలకు తెగించి సమాజ రక్షణకు పాటుపడుతూ ఉంటారు. ఖాకీ యూనిఫాంలో ప్రజలకు సహజ మిత్రులుగా కనిపించే పోలీసులను చూస్తే కొండంత ధైర్యం ఆపదలో వున్నవారికి కలుగుతుంది. పోలీసులు కూడా కట్టుకున్న వారిని, కన్న పిల్లలను విడిచి విధి నిర్వహణ పరమావధిగా భావిస్తూ ప్రాణాలను తృణప్రాయంగా త్యగించిన సంఘటనలు వుంటాయి. అమర జవానుల బలిదానాల్ని స్మరించుకోవలసిన క్షణాలు ఇవి. చైనా యుద్ధం నుంచి నేటి అంతర్గత భద్రత కోసం సాయుధ సంఘర్షణలో ప్రతి నిత్యం చావుబ్రతుకుల మధ్య పోరాటం సాగిస్తూనే వున్నారు. ధర్మ సంరక్షణార్థం సమాజ వనానికి కంచెలుగా నిలిచి నిలువెత్తు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారి సేవలకు నివాళులర్పించాల్సిన రోజే అమరవీరుల సంస్మరణ దినోత్సవం. వేసుకున్న ఖాకి దుస్తుల చాటున కారుణ్యం, కన్నీరు దాగి ఉన్న వత్తి ధర్మానికి తలొగ్గి ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజారక్షణలో అమరులైన పోలీసులకు జోహార్లు.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో, ప్రజల రక్షణలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల పాత్ర, చేసిన సేవలు కరోనా సంకట పరిస్థితుల్లో వారి సేవలు ప్రశంసనీయమని, కరోనా కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్‌డౌన్‌లో సమర్ధవంతంగా విధి నిర్వహణలో కుటుంబాలకు దూరంగా వుండి వారి వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. అందరినీ సమన్వయపరచుకోవాలి, సంజాయించాలి. అదే సమయంలో శాంతి భద్రతలనూ కాపాడాలి. అందర్నీ సామాజిక దూరం పాటించాలని చెప్పాలి.

తమకు మాత్రం ఆ సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా నియంత్రించాలి. తామేమో 24 గంటలు ఇండ్ల బయటే ఉండాలి. గంటల కొద్దీ నడిరోడ్డు పైనే నిల్చోవాలి. ఎప్పుడు తింటారో తెలియదు. విశ్రాంతికి సమయం చిక్కదు. కంటి మీద కునుకుండదు. అయినా అలుపనేది ఎరుగకుండా కనిపించని భయానక శత్రువు నుంచి యావత్ తెలంగాణ జాతిని రక్షించడానికి లాఠీ పట్టుకొని విధులు నిర్వహించే సైనికులు వారు, ఖాకీలు కర్కశకులు అన్న అపవాదును అవాస్తవం అని నిరూపించారు. రాష్ట్ర పోలీసులు ఎంతో మంది అన్నార్తుల ఆకలిని తీర్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో యాచకులు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ రోజు కూలీ చేసుకునేవారి పరిస్థితి దుర్భరంగా మారింది. పోలీసులు వారి ఆకలిని తీరుస్తూ ఆపన్నులుగా నిలిచారు.

జాజుల దినేష్- 9666238266