Home జాతీయ వార్తలు ఎన్‌ఆర్‌సిపై మోడీకి బీ‘హార్’

ఎన్‌ఆర్‌సిపై మోడీకి బీ‘హార్’

Bihar CM

 

దేశవ్యాప్తం కుదరదన్న నితీష్
రాష్ట్రానికి రానివ్వమని వెల్లడి
రాష్ట్ర అసెంబ్లీలోనే వ్యతిరేక ప్రకటన
ప్రత్యేక సెషన్‌లో ఎన్‌పిఆర్‌పై సమీక్ష

పాట్నా : జాతీయ పౌర చిట్టా (ఎన్‌ఆర్‌సి)పై బిజెపికి మిత్రపక్షం నుంచి కీలకమైన షాక్ తగిలింది. ఎన్‌ఆర్‌సిని దేశవ్యాప్తం చేయడాన్ని బీహార్ సిఎం, జెడియూ నేత నితీష్ కుమార్ తప్పుపట్టారు. ఇది పూర్తిగా అనవసర ప్రక్రియ, పైగా సమర్థనీయం కాదని బీహార్ అసెంబ్లీలో ఆయన సోమవారం స్పందించారు. తాము ఎన్‌ఆర్‌సిని పూర్తి స్థాయిలో తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ, హోం మంత్రి షాలకు దీనిపై తమ అసమ్మతిని రాష్ట్ర అసెంబ్లీ సభా ముఖంగా తెలియచేశారు. ఎన్‌ఆర్‌సిని బీహార్‌లో చేపట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సి దేశవ్యాప్తం పట్ల బలీయమైన వ్యతిరేకత ఉన్నందున దీనిపై, ఎన్‌పిఆర్‌పై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కావాలని తాను కోరుతున్నట్లు చెప్పారు.

ఎన్‌ఆర్‌సి కేవలం అసోంకు ఉద్ధేశించిన ప్రక్రియ అని, దేశమంతటికీ విస్తరింపచేయాలనుకోవడం తగదని అన్నారు. నిరసనలు ఉన్నందున పౌరుల చిట్టాపై రాష్ట్రంలో జెడియూ, బిజెపిల పొత్తుతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. కేంద్రం తలపెట్టిన ఎన్‌ఆర్‌సిని ముఖ్యమంత్రి విమర్శిస్తున్న దశలో ఆయన పక్కన ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ కూర్చుని ఉన్నారు. కేంద్రం తలపెట్టిన జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్)కు తమ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతుందని

ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల కోసారి ఇటువంటి జనగణన ప్రక్రియ జరగడం సాధారణమే అన్నారు. ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కలు, సంబంధిత ఎన్‌పిఆర్ రూపకల్పన అంతా కూడా కులాల ప్రాతిపదికన జరగాల్సిందేనని నితీష్ సూచించారు. ఎన్‌పిఆర్‌పై కేంద్రం ఎటువంటి సమాచారం కోరినా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అయితే ఎన్‌ఆర్‌సి అన్ని చోట్లా చేపట్టాల్సిన పనిలేదన్నారు. ఎస్‌సి /ఎస్‌టిలకు చట్టసభలలో రిజర్వేషన్ల కోటాను మరో పది సంవత్సరాలు పొడిగిస్తూ లోక్‌సభలో రాజ్యాంగ సవరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదానికి ధన్యవాదాలు చేస్తూ సభ తీర్మానం వెలువరించింది. దీనిపై బీహార్ అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశపర్చారు. తాము ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ సంబంధిత పథకాలపై దృష్టి సారించామని, ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్ వంటి కీలక అంశాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సభా స్పందనను కేంద్రానికి ఆ తరువాత తెలియచేస్తామని వివరించారు. అంతకు ముందు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్ మాట్లాడారు. కేంద్రం తలపెట్టిన ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపైనా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఈ దశలో వీటిపై సిఎం వైఖరి స్పష్టం కావల్సి ఉందన్నారు.

మిత్రపక్షం రాష్ట్రం నుంచీ చెక్
ఎన్‌ఆర్‌సి, దీనికి అనుబంధంగా ఉండే ఎన్‌పిఆర్‌ను తమ రాష్ట్రాలలో అనుమతించేది లేదని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రకటించాయి. ఇప్పుడు మిత్రపక్ష ప్రభుత్వం ఉన్న బీహార్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇక నూతన పౌరచట్టం (సిఎఎ) పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం లేదా పౌరసత్వాన్ని తొలిగించడం వంటి అంశాలు రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రతిపక్షాలు భగ్గుముంటున్నాయి. అయితే దీనిని అధికారికంగా అమలులోకి తెచ్చే విధంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను వెలువరించింది. అయితే సిఎఎపై తమ వైఖరి ఏమిటనేది బీహార్ సిఎం స్పష్టం చేయలేదు. కానీ ఎన్‌పిఆర్‌ను స్వాగతిస్తామని చెపుతూనే, నమోదు ప్రక్రియ దశకు పాటించే నిబంధనలను పూర్తిగా పరిశీలిస్తామని, అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా దీనిపై సిఎం తన అస్పష్ట వైఖరిని వ్యక్తం చేశారు.

Nationwide NRC needless, has no justification