Home సినిమా ఎనర్జిటిక్ ‘నాటుకోడి’

ఎనర్జిటిక్ ‘నాటుకోడి’

Natukodi-శ్రీకాంత్, మనో చిత్ర జంటగా నానికృష్ణ దర్శకత్వంలో బందరు బాబీ, నానికృష్ణ నిర్మాతలుగా నానిగాడి సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘నాటుకోడి’. యాజమాన్య సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వెంకటేష్, తరుణ్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్ యాదవ్, శివాజీరాజా, సాంబశివరాజు, అమ్మిరాజు, రఘు కుంచె, ప్రభు, మాగంటి గోపీనాథ్, దర్శకుడు నాని కృష్ణ, నిర్మాత బాబీ, యాజమాన్యతో పాటు చిత్ర బృందం పాల్గొంది. బిగ్ సీడీని వెంకటేష్ విడుదల చేశారు. ఆడియో సీడీలను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, గంటా శ్రీనివాసరావులు విడుదల చేయగా వెంకటేష్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ “తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్న శ్రీకాంత్ చేసిన ‘నాటుకోడి’ టైటిల్‌కే వంద మార్కులు పడ్డాయి. సంక్రాంతికి సినిమా విడుదలకానుంది. యాజమాన్య మంచి సంగీతమందించారు”అని అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ “నాటుకోడి టైటిల్ ఎనర్జిటిక్‌గా, మాసీగా ఉంది. ఐదు పాటలు చాలా క్యాచీగా, మ్యూజికల్ హిట్‌గా ఉన్నాయి. శ్రీకాంత్‌ను… నానికృష్ణ చాలా ఎనర్జిటిక్‌గా చూపించారు”అని తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ “నేను అన్ని రకాల మూవీస్ చేశాను. అవినీతివంతుడైన  పోలీస్ ఆఫీసర్‌గా తొలిసారి నటించాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగే సినిమా ఇది. నానికృష్ణ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించాడు. యాజమాన్య మంచి సంగీతాన్ని అందించారు”అని చెప్పారు. దర్శకుడు నానికృష్ణ మాట్లాడుతూ “సమర్థవంతుడైన పోలీస్‌కు, అవినీతివంతులైన ప్రజలకు మధ్య జరిగే సినిమా సినిమా ఇది. సంక్రాంతి సినిమాల్లో మా ‘నాటుకోడి’ ఓ భాగమవుతుందని భావిస్తున్నాను”అని అన్నారు. నిర్మాత బందరు బాబీ మాట్లాడుతూ “మా బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మరిన్ని మంచి సినిమాలు మా బ్యానర్‌లో చేయాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు.