Thursday, April 18, 2024

రెవెన్యూకు మిట్టల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఎఎస్‌అధికారి నవీన్‌మిట్టల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖతో పాటుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మి నిస్ట్రేషన్ (సిసిఎల్‌ఎ)గా కూడా నవీన్ మిట్టల్ కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించిం ది. ప్రస్తుతం నవీన్ మిట్టల్ సాంకేతిక విద్యాశాఖ క మి షనర్‌గా, ఇంటర్మీడియేట్ బోర్డు కమిషనర్‌గా బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన ల్యాండ్ రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగాల బాధ్యతలను కూడా నవీన్ మిట్టల్‌కే అప్పగించడం విశేషం. కాగా రాష్ట్రంలోని 15 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 జిల్లాల కలెక్టర్లను బదిలీచేసిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న హైదరాబాద్ జిల్లాకు అమోయ్ కుమార్‌నే ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగిస్తోంది.

సాధారణంగా ఐఎఎస్ అధికారుల సమర్ధత, వ్యక్తిత్వం, ప్రజా ప్రతినిధులను సమన్వయం పరుచుకోవడంలో నేర్పరితనం ఉన్న యువ ఐఎఎస్‌లకే కీలకమైన, ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలకు కలెక్టర్‌లుగా నియమిస్తారని, ఆ కోణంలో హైదరాబాద్ జిల్లాకు అన్ని విధాలుగా సరితూగే యువ ఐఎఎస్ కోసం సమీక్ష జరుగుతోందని, త్వరలోనే హైదరాబాద్ జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను కూడా నియమించడం జరుగుతుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీలకు కసరత్తులు పూర్తిచేసిన ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయిందని, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాతనే సీనియర్ ఐ.ఎ.ఎస్. అదికారుల బదిలీలు ఉంటాయని, అప్పటి వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా ఉందని కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులు వివరించారు.

అనేక సంవత్సరాలుగా తమతమ విభాగాల్లో కార్యదర్శులు, కమీషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీలు చేస్తే అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అందుచేతనే సీనియర్ బ్యూరోక్రాట్ల బదిలీలను శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ వాయిదా వేసినట్లుందని వివరించారు. లేకుంటే కొత్తగా ఆయా శాఖలకు బాధ్యతలు చేపట్టే అధికారులకు సబ్జెక్టుపై అవగాహన వచ్చే వరకూ కొంత సమయం పడుతుందని, ఇప్పటికిప్పుడు బదిలీలు చేసి కొత్త అధికారులతో ఆయా శాఖలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలు, ఇతర చర్చలను ఎదుర్కోవడానికి ఇబ్బందిగా ఉంటుందని వివరించారు. కాకుంటే ఖాళీగా ఉన్న శాఖల బాధ్యతలను మాత్రమే కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు అదనపు బాధ్యతలుగా ఇస్తుండవచ్చునని తెలిపారు.

ఈ లెక్కన రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వంటి అనేక కీలకమైన పదవులు ఖాళీగా ఉన్న వాటిని కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు అదనపు బాధ్యతలుగా ఇవ్వవచ్చునని, లేకుంటే ఏ అధికారికైతే రెవెన్యూశాఖ బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందో ఆ అధికారికే ఆయా శాఖలను అదనపు బాధ్యతలుగా పోస్టింగ్‌లు ఇస్తుండవచ్చునని వివరించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న భారతి హొళికేరిని బదిలీ చేసి స్త్రీ, శిశు సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ విభాగం కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును బదిలీ చేసి నిజామాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్ కుమార్‌ను బదిలీ చేసి మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్.హరీష్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను హనుమకొండ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

కొమ్రుంభీమ్- ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్‌ను బదిలీ చేసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న నిఖిలను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న షేక్ యాస్మిన్ బాషాను బదిలీ చేసి కొమ్రుంభీం-ఆసిఫాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న జి.రవిని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అక్కడ ఉన్న ఎస్.వెంకటరావును సూర్యాపేట్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న బాధావత్ సంతోష్‌ను మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజర్షి షాకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి మెదక్ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న తేజస్ నంద్‌లాల్ పవార్‌కు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఉట్నూరు ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కర్నాటి వరుణ్ రెడ్డిని నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అక్కడున్న ముషర్రఫ్ ఆలీ ఫరూఖిని బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.వి. కమాన్‌కు జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ లభించని ఇద్దరు ఐఎఎస్ అధికారులు జిఎడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News