Home జయశంకర్ భూపాలపల్లి మావోల హల్‌చల్…. అప్రమత్తమైన నిఘా వర్గాలు

మావోల హల్‌చల్…. అప్రమత్తమైన నిఘా వర్గాలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈనెల 21 నుంచి వచ్చే నెల 8 తేదీ వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలలో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కరపత్రాలు సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర డిజిపి గోదావరి తీర ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలలో నిఘా పెంచారు. తాజాగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టులు పోస్టర్లపై పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని కమిషనరేట్‌ల పరిధిలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సూచించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని రాజకీయ నాయకుల విషయంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.

ముఖ్యంగా గతంలో మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న నేతలకు బందోబస్తు మరింత పెంచనున్నారు. అలాగే మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ మావోయిస్టులు, మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలు, అనుమానిత పౌర హక్కుల నేతలపై నిఘా మరింత పెంచాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో మావోయిస్టు వారోత్సవాల సందర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, మావోయిస్టుల దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉంటున్న మాజీ మావోయిస్టులపై నిఘాసారించాలని, కోవర్టు ఆపరేషన్స్ ద్వారా మావోయిస్టులు నేతలను తుదముట్టించే అవకాశాలు సైతం లేకపోలేదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే మాజీ మావోయిస్టులు, సానుభూతి పరులపై ప్రత్యేక నిఘా సారించే అవకాశాలున్నాయి. ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరికలతో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసు బలగాలు అవిశ్రాంతంగా పహారా కాస్తున్నాయి.

Naxals released Leaflets in Mulugu