Home జాతీయ వార్తలు తమ అధికారి వాంఖడేపై విజిలెన్స్ దర్యాప్తునకు ఎన్‌సిబి ఆదేశం

తమ అధికారి వాంఖడేపై విజిలెన్స్ దర్యాప్తునకు ఎన్‌సిబి ఆదేశం

NCB official sought Rs 25 cr to let aryan khan off

 

ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించడం కోసం రూ.25 కోట్ల డిమాండ్‌పై..

న్యూఢిల్లీ: క్రూయిజ్ డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్‌ఖాన్‌ను తప్పించడం కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తునకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఏజెన్సీ(ఎన్‌సిబి) ఆదేశించింది. ఆర్యన్ తండ్రి, బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేసిన అంశంలో ఎన్‌సిబి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో, ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గ్యానేశ్వర్‌సింగ్ నేతృత్వంలో విజిలెన్స్ దర్యాప్తు జరగనున్నట్టు ఎన్‌సిబి ఓ ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుందని గ్యానేశ్వర్ ఈ సందర్భంగా అన్నారు.

డ్రగ్స్ కేసు దర్యాప్తులో వాంఖడేను కొనసాగిస్తారా..? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమని గ్యానేశ్వర్ అన్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో స్వతంత్ర సాక్షిగా ఉన్న ప్రభాకర్‌సాయిల్ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వాంఖడేపై ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించడం కోసం ఎన్‌సిబికి చెందిన కొందరు మరో సాక్షి అయిన కెపి గోసావితో సంప్రదింపులు జరిపారని, షారూక్‌ఖాన్‌ను రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ప్రభాకర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కెపి గోసావికి తాను అంగరక్షకుడిగా పని చేశానని ప్రభాకర్ తెలిపారు.

NCB official sought Rs 25 cr to let aryan khan off