Home ఎడిటోరియల్ మహిళలపై నేరాలు

మహిళలపై నేరాలు

Sampadakiyam నేరం ఆయా వ్యక్తులు చేసినదిగానే పరిగణన పొందడం, చట్టం సైతం అలాగే భావించి శిక్షలు వేయడం సాధారణమైపోయింది. కాని చాలా నేరాల వెనుక లోతైన సామాజిక కారణాలు దాగి ఉంటాయి. చట్టానికి, న్యాయానికి గాఢమైన సామాజిక దృష్టి కోణం ఉండి ఉంటే దానిని తరచూ ఎత్తి చూపి అటువంటి నేరస్థ మనస్తత్వాన్ని సమాజం నుంచి సమూలంగా తొలగించి అవి మళ్లీ మళ్లీ జరగకుండా చేసే అవకాశాలు కలుగుతాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాల్లో వారి భర్తలు, అత్తింటివారు చేస్తున్నవే అధికమని 2017వ సంవత్సరపు జాతీయ నేర చిట్టా వెల్లడించిన కఠోర వాస్తవం సామాజిక నేరాలను వేరు చేసి చూడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నది.

ఆ సంవత్సరం దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాల కేసులు 3,59,849 నమోదయినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో 29 శాతం కేసులు భర్తలు, వారి తరపువారు చేసినవేనని 21.7 శాతం స్త్రీల మానాభిమానాలను హరించడానికి జరిగిన దాడులకు సంబంధించినవని, 20.5 శాతం కేసులు మహిళల అపహరణ, ఎత్తుకుపోడానికి చెందినవని, 7 శాతం రేప్ కేసులని వివరించింది. మొత్తం అన్ని కేసులు పురుష దురహంకార దౌర్జన్య ఘటనలకు సంబంధించినవే. పురుషుడు మహిళను సాటి మనిషిగా కాకుండా తన పాదాక్రాంతరాలుగా పరిగణిస్తున్న దారుణ అసమ సామాజిక జాడ్యాన్ని ప్రతిబింబించే నేరాలే ఇవన్నీ. ఇటువంటివి ఇంత భారీ సంఖ్యలో సాగుతున్నంత కాలం మనది స్త్రీద్వేషి సమాజమనీ, మహిళను కాలి కింది చెప్పులా చూసే పాశవిక అనైతిక వ్యవస్థ అనీ అంగీకరించక తప్పదు.

ఈ కేసులన్నింటిలోనూ చట్ట ప్రకారం ఆయా నేరస్థులకు శిక్షలు పడడమో, దర్యాప్తు లోపాల వల్ల వారు విడుదల కావడమో జరిగిపోతుంది. కాని మూలంలోని సామాజిక దుర్నీతి అలాగే మిగిలిపోతుంది. అది అక్షయ అంకురాల దుంపగా వర్ధిల్లుతూనే ఉంటుంది. అది అలా కొనసాగినంత కాలం స్త్రీలపై ఇటువంటి ఘాతుకాలు నిరాటంకంగా సాగిపోతూనే ఉంటాయి. కుటుంబాల్లో మహిళలపై జరిగే పురుషాహంకార దౌర్జన్యాలు సాధారణంగా బయటికి రావు. అవి మితిమించి ఆయా స్త్రీల, గృహిణుల ప్రాణాల మీదకు రావడమో వారు సాహసించి బయట పెట్టడమో జరిగితే తప్ప రికార్డు కావు. అందుచేత జాతీయ నేరాల చిట్టా కెక్కిన సంఖ్య కంటే అనేక రెట్లు ఎక్కువగా దేశంలో స్త్రీలపై పురుష దురన్యాయాలు సాగిపోతున్నాయని అనుకోక తప్పదు.

భర్తలు, అత్తలు, ఇతర అత్తింటివారు ఎన్ని ఆరళ్లు పెడుతున్నా జీవన భద్రతకు భయపడి లోలోపల కుమిలిపోయే మహిళలు దాదాపు ప్రతి ఇంటిలోనూ ఉండే సామాజిక నేపథ్యం మన దేశంలో చిరకాలంగా వేళ్లూనుకున్నదనే సంగతిని కాదనగలిగే ధైర్యం ఎవరికీ ఉండదు. భర్త, అత్తమామలు ఆమెను మానసిక క్షోభకు బలి చేసే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. దీనిని పూర్తిగా నిర్మూలించనంత వరకు దేశంలో రాజ్యాంగ బద్ధమైన సమ సమాజం ఏర్పడదు. 2017 నాటి జాతీయ నేర రికార్డుల విభాగం రిపోర్టు రెండేళ్లు ఆలస్యంగా ఇప్పుడు విడుదలయింది. కేంద్ర హోం శాఖ అదుపాజ్ఞల్లో పని చేసే ఈ విభాగం వార్షిక నేర చిట్టా ఇలా ఇంతకాలం వాయిదా పడడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ చిట్టాలో దేశంలో జరిగే పలు రకాల నేరాల సమగ్ర సమాచారం ఉంటుంది.

ఇది మీడియాకు, సామాజిక పరిశోధకులకు ఎంతగానో తోడ్పడుతుంది. 2017లో మహిళలపై నేరాల్లో 56,011 కేసులతో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో, 31,979 కేసులతో మహారాష్ట్ర రెండోదిగా, 30,002 ఉదంతాలతో పశ్చిమ బెంగాల్ మూడోదిగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. అలాగే దేశంలో షెడ్యూల్డు కులాల వారిపై దౌర్జన్యాలు ఆ ఏడాది పెరిగాయని అంతకు ముందు రికార్డయిన 5,082 నుంచి 5,775కి ఎగబాకాయని నివేదిక వెల్లడించింది. దళితులపై దౌర్జన్యమనేది కూడా మరో సామాజిక రుగ్మతే. సమాజంలోని ఉన్నత శ్రేణుల్లోనివారు కుల దురహంకారంతో దళితుల మీద ఒంటి కాలితో లేచే పరమ అమానుష ధోరణి దేశంలో చిరకాలంగా వేళ్లూనుకొని ఉన్నది.

ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇన్ని దశాబ్దాలకు కూడా అది అడుగంటలేదని మరో విధంగా చెప్పాలంటే తిరిగి విషం నింపుకుంటున్నదని ఆ కేసులు పెరుగుతున్న తీరు నిరూపిస్తున్నది. గత సమాజపు దుష్ట ధోరణుల కూకటి వేళ్లను పెకలించకుండా మన రాజ్యాంగ నిర్మాతలు కలగన్న భవ్య సమాజ స్థాపన జరగదు. ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ ఈ విషయాన్ని తెలుసుకొని సామాజిక నేరాల మూలాలను తొలగించడానికి సమగ్రమైన కృషి చేపట్టాలి. అందుకు అవసరమైన నవ్య చైతన్యాన్ని దేశ ప్రజల్లో కలిగించడానికి తగిన గాఢమైన సంకల్పం జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోవాలి.

NCRB data 2017