Home ఎడిటోరియల్ ఎన్‌డిఎలో మహిళలు!

ఎన్‌డిఎలో మహిళలు!

NDA entrance test in the army మహిళలు పిల్లలను కనడం, పోషించడంతో పాటు వండి వార్చడం వంటి ఇంటి పనులకే పరిమితం కావాలన్న సంప్రదాయ భావనను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్యం ఇంత కాలం పోషిస్తూ వచ్చాయి. అందుకే సైన్యంలో కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డిఎ) ప్రవేశ పరీక్ష నుంచి వారిని దూరంగా ఉంచాయి. దేశంలోని సైనిక స్కూళ్ల్లు, కళాశాలల్లో ప్రవేశం స్త్రీలకు ఇంత కాలం అలభ్యంగా, గగన కుసుమంగా ఉంటూ వచ్చింది. ఈ పురుష సమాజ అసమ న్యాయాన్ని సుప్రీంకోర్టు ప్రశంసా పాత్రంగా బద్దలు కొట్టింది. మహిళలకు ఎన్‌డిఎలో కూడా ప్రవేశం కల్పిస్తూ అందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష రాసే అవకాశాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం అంగీకరించినట్టే అంగీకరించి ఈ ఒక్క సంవత్సరానికి ఈ నిర్ణయం అమలును వాయిదా వేయాలని కోరింది. న్యాయమూర్తులు సంజయ్ కృష్ణన్ కౌల్, హృషీకేష్ రాయ్‌ల ధర్మాసనం దీనిని కూడా తిరస్కరించింది. మీ సంప్రదాయ మానసిక స్థితిని మార్చుకోండని కేంద్రాన్ని, సైన్యాన్ని బుధవారం నాడు మందలించింది. మొదటిసారి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షలో పాల్గోకపోవచ్చు, అందుచేత మహిళలను ఈ నవంబర్‌లో జరిపే ఎన్‌డిఎ ఎంట్రెన్స్ పరీక్షకు అనుమతించండి అని సూచించింది.

సైన్యంలో చేరడానికి సిద్ధపడే మహిళలకు ఈ స్వల్ప వ్యవధిలో పరీక్షకు తయారు కావడం ఏమంత కష్టం కాబోదని కూడా అన్నది. దేశంలోని మహిళలకు లభించిన ఘన విజయంగా దీనిని పరిగణించాలి. వారు చేరుకున్న విశిష్ట లక్షంగా భావించాలి. ఎన్‌డిఎ ప్రవేశ పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకు తిరస్కరించడం రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమానత్వ సూత్రాలకు పూర్తి విరుద్ధమని పిటిషన్ వేసిన కుష్ కల్రా వాదించారు. తగిన అర్హత కలిగి ఇష్టపడుతున్న మహిళలను ఎన్‌డిఎ పరీక్షలకు అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం 14, 15, 16, 19 అధికరణలు అన్ని విషయాల్లోనూ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని నిర్దేశిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం 14వ అధికరణ సమానత్వ విలువలను, 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో సమానావకాశాలను, 19 వ అధికరణ ఏ వృత్తినైనా ఎంచుకొని సాధన చేసే వీలును, 15వ అర్టికల్ ఎందులోనూ వివక్ష చూపకుండా ఉండడాన్ని హామీ ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం ధ్రువపరిచింది. సైన్యంలో ఎవరైనా చేరడానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. అవి 1. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డిఎ) 2. ఇండియన్ మిలిటరీ అకాడెమీ (ఐఎంఎ) 3. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఒటిఎ).

వీటిలో ఒక్క ఎన్‌డిఎ తప్పించి మిగతా రెండింటిలోనూ మహిళలకు ప్రవేశం ఉంది. డెహ్రాడూన్ లోని వందేళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రీయ మిలిటరీ కాలేజీలో కూడా మహిళలకు చోటు కల్పించాలని కోరుతూ కైలాశ్ ఉద్ధవ్ రావ్ అనే మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నేరుగా నడుపుతున్న ఈ కళాశాలలో కేవలం పురుషులకే ప్రవేశార్హత ఉంది. రెండు విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ మూడో దానిని మూసి ఉంచడం కేవలం లింగ వివక్షే కాదు ఇతరత్రా కూడా అది వివక్షాపూరితమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. విచిత్రమేమిటంటే మనం అనునిత్యం మన రుద్రమ దేవి, ఝాన్సీరాణి వంటి వీర వనితల గురించి ఘనంగా కీర్తిస్తాము. కాని మన ఆడపిల్లలను వారి దారిలో సైన్యంలో చేరడానికి అంగీకరించం.ఆడపిల్ల తల్లి గర్భంలోంచి నేల మీద పడిన క్షణం నుంచి ఆమెకు స్త్రీ లక్షణాలనే అలవరుస్తాము గాని, పురుషులు పాల్గొనే రంగాలన్నింటా విజయవంతమైన పాత్ర వహించే విధంగా వారిని తీర్చిదిద్దము. చివరికి ఆమెను వంట గదికి పరిమితం చేసి, ఒక మగవాడి చేతి కింద బతికేలా చూస్తాము. మగ దిక్కు మరణిస్తే ఆమె బతకలేక ఆత్మహత్య చేసుకోడం తప్ప వేరే మార్గంలేని దుస్థితిని కన్న కూతుళ్లకు కూడా కట్టబెడతాము.

భారత రాజ్యాంగం దీనితో పాటు సమాజంలోని అన్ని వివక్షలను అంతమొందించాలని గట్టిగా నిర్దేశిస్తున్నది. మంచి రాజ్యాంగాన్ని మన జాతి నేతలు మనకి రూపొందించి ఇచ్చినప్పటికీ దానిని పాటించడం ఇష్టం లేక అటువంటిదొకటి మనకున్నదనే విషయాన్ని కూడా మరచిపోతున్నాము. ఇప్పటికీ ఇంటా బయటా మతపరమైన మనుగడనే సాగిస్తున్నాము. దీని వల్లనే ప్రతి చోటా మహిళను ద్వితీయ శ్రేణి భారతీయురాలుగా చూసే జాడ్యం ప్రబలిపోతున్నది. మహిళల మీద, బాలికల మీద విరామం లేకుండా అత్యాచారాలు, హత్యాచారాలు సాగిపోతున్నాయి. వాటిని నిరోధించడానికి పాలకులు తీసుకు వస్తున్న చట్టాలు నిరర్ధకంగా నిరూపించుకుంటున్నాయి. అందుచేత సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా అన్ని రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మన సమాజ దృక్పథంలో కూడా మంచి మార్పును తీసుకు రావలసి ఉన్నది.

NDA entrance test in the army