Saturday, April 20, 2024

‘వీడే’.. మొనగాడే

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra won Gold medal in Javelin throw

తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే

రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్‌కు స్వర్ణ స్పర్శ కలేనా?
అని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు
కమ్ముకుంటున్న దశలో 130 కోట్ల మంది ఇండియన్లకు నీరజ్ చోప్రా స్వర్ణ కంకణం తొడిగాడు.

జావెలిన్ త్రోలో నీరజ్‌కు పసిడి 
ఒలింపిక్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం 
టోక్యో క్రీడల్లో చరిత్ర సృష్టించిన చోప్రా 
విశ్వక్రీడల్లో మువ్వన్నెల రెపరెపలు 

దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారుడిగా అరుదైన ఘనతను నీరజ్ సొంతం చేసుకున్నాడు. 23ఏళ్ల నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సువర్ణాధ్యాయాన్ని లిఖించి వందేళ్ల ఎదురుచూపులకు తెరదించాడు. చారిత్రక విజయం సాధించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు తదితరులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు. నీరజ్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. అంతకుముందు రెజ్లింగ్‌లో భారత స్టార్ భజరంగ్ పునియా కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, మరో 4 కాంస్య పతకాలను సాధించింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి. గతంలో లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలను సాధించింది. ఈసారి ఆ రికార్డును భారత్ తిరగరాసింది.

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి అథ్లెటిక్స్‌లో పతకం సాధించి వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రోలో భారత యువ సంచలనం నీరజ్ 87.58 మీటర్ల దూరాన్ని విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక టోక్యో క్రీడల్లో ఏడు పతకాలు సాధించి భారత్ కొత్త రికార్డును తన పేరిట లఖించుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించగా టోక్యో క్రీడల్లో ఆ రికార్డును తిరగరాసింది. అంతకుముందు పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. తాజాగా నీరజ్ సాధించిన స్వర్ణంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండో స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా చోప్రా అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. తాజాగా యువ అథ్లెట్ నీరజ్ అతని సరసన నిలిచాడు.

అంచనాలకు తగినట్టుగానే..

ఇక జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తాడనే నమ్మకంతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. శనివారం జరిగిన ఈ పోరును చూసేందుకు క్రీడాభి మానులు టివిల ముందు అతుక్కు పోయారు. యువ అథ్లెట్ చారిత్రక ప్రదర్శన చేస్తాడనే నమ్మకంతోనే కోట్లాది మంది భారతీయులు ఈ పోరును తిలకించారు. ఇక అందరి అంచనాలను నిలబెడుతూ నీరజ్ చోప్రా అసాధారణ ప్రదర్శనతో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి అథ్లెట్లను వెనక్కి నెడుతూ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. అంచనాలకు తగినట్టుగా రాణిస్తూ అగ్రస్థానంలో నిలిచి భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించాడు. ఫైనల్లో మహామహులు..అనుభవజ్ఞులు..పతకాల ఫేవరెట్లను వెనక్కి నెడుతూ స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో 87.58 మీటర్ల దూరాన్ని విసిరి భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయానికి తెరలేపాడు.

ఆరంభం నుంచే..

ఫైనల్ పోరులో నీరజ్ ఆరంభం నుంచే మెరుగైన ప్రదర్శన చేశాడు. మొదటి అవకాశంలోనే ఈటెను 87.03 మీటర్ల దూరాన్ని ప్రకంపనలు సృష్టించాడు. ఆ తర్వాత తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగాడు. రెండో రౌండ్‌లో 87.58 మీటర్ల దూరాన్ని విసిరి పతకంపై ఆశలు చిగురింప చేశాడు. అయితే మూడో ప్రయత్నంలో 76.79 మీటర్ల దూరాన్ని మాత్రమే విసిరి కాస్త ఆందోళన కలిగించాడు.ఆ తర్వాత రెండు ఫౌల్స్ పడ్డాయి. దీంతో అందరిలోనూ కాస్త టెన్షన్ మొదలైంది. కానీ ఆరో రౌండ్‌లో 84.24 మీటర్ల దూరాన్ని విసిరి మళ్లీ గాడిలో పడ్డాడు. ఇక ఆరు రౌండ్‌లు ముగిసే సరికి నీరజ్ 87.58 మీటర్ల దూరంతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్లో తలపడిన ఇతర అథ్లెట్లతో పోల్చితే నీరజ్‌దే పైచేయి కావడంతో రిఫరీలు అతన్ని విజేతగా ప్రకటించారు. ఇక చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్ 86.67 మీటర్ల దూరంతో రజతం, అదే దేశానికి చెందిన విటెడ్జ్‌స్లావ్ 85.44 మీటర్ల దూరంతో కాంస్యం గెలుచుకున్నాడు.

భారత యువతకు స్ఫూర్తి : రాష్ట్రపతి

నీరజ్ తన అత్యద్భుత విన్యాసంతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. నీరజ్..నీ అసాధారణ, అసమాన్య బంగారు విజయం ఈ దిశలో మనకున్న అడ్డంకులన్నింటిని ఛేదించి నూతన చరిత్రను లఖించింది. నీకిది తొలి ఒలింపిక్స్. ఇందులో నీ సాధనతో దేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ వ్యక్తిగత పోటీలో తొలి స్వర్ణపతకం సాధించి తెస్తున్నావు. ఇది దేశ యువతను కట్టిపడేస్తూ స్ఫూర్తిదాయకం అవుతోంది. భారత్ ఉప్పొంగిపోయింది. నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు …

జావెలిన్‌తో స్వర్ణ చరిత్ర : ఉపరాష్ట్రపతి

జావెలిన్ త్రోతో స్వర్ణం సాధించి జాతికి గర్వకారణం అయ్యి చరిత్ర సృష్టించాడు. ఇది అపూర్వ ఘన విజయం. ఇప్పటివరకూ కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న స్వర్ణపతక ఎదురుచూపుల పర్వానికి తెరపడింది.

ఈ స్వర్ణం చిరకాలపు మననీయం : ప్రధాని

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చరిత్ర దేశానికి గర్వకారణం. ఇది ఇప్పుడు ఎప్పుడూ నిలిచి ఉండే చిరకాలపు తారాస్థాయి జ్ఞాపకంగా మెరుస్తుంది. ఈ పందెంలో నీరజ్ చక్కగా రాణించాడు. తనకంటూప్రత్యేకమైన శైలితో తొణికిసలాడిన యువ ఫ్యాషన్‌తో ఆడిన నీరజ్‌కు అభినందనలు

క్రీడాకారులందరికీ స్ఫూర్తి : సిఎం కెసిఆర్

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సిఎం అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సిఎం పేర్కొన్నారు.

బేటా నీకు నా నమస్తే : బింద్రా

దేశానికి స్వర్ణం రావాలనే ప్రజల కోరికను నీరజ్ నువ్వు సాధించావు. నీ ఘన విజయానికి నేను వంగి నమస్కరిస్తున్నా. పసిడి పతాకాన్ని దేశానికి తీసుకువస్తున్నావు. అందుకో అభినందనం. నీకు ఇదే నా గోల్డెన్ వెల్‌కమ్. ఇటువంటి మరెన్నో పతకాలు తీసుకురావాలి. చాలా సంతోషంగా సగర్వంగా ఉంది.

కనక వర్షం కురిసింది..

టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నయువ సంచలనం నీరజ్ చోప్రాపై కనక వర్షం కురుస్తోంది. నీరజ్ సొంత రాష్ట్రం హర్యానా ప్రభుత్వం స్వర్ణ వీరుడికి కళ్లు చెదిరే భారీ నజరానాను ప్రకటించింది. నీరజ్ ప్రతిభకు గుర్తింపుగా ఆరు కోట్ల రూపాయల నగదు బహుమతిని అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక యాభై శాతం రాయితీతో ఇంటి స్థలాన్ని మంజూరు చేసేందుకు అంగీకరించింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా నీరజ్‌కు రెండు కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. భారత క్రికెట్ బోర్డు కూడా నీరజ్‌కు కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహింద్రా గిఫ్ట్

జావలెన్ త్రో వీరుడు నీరజ్ చోప్రాకు ప్రశంసలతో పాటుగా నజరానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. నీరజ్ చోప్రాకు త్వరలో తమ సంస్థ విడుదల చేయనున్న ఎస్‌యువి వాహనం ఎక్స్‌యువి 700ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు మహీంద్రాగ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

పేరు : నీరజ్ చోప్రా
పుట్టినతేదీ : 24- డిసెంబర్, 1997.
స్వస్థలం : హర్యానాలోని పానిపట్
వృత్తి : సైన్యంలో సుబేదార్
క్రీడ : జావెలిన్ త్రో
పతకాలు : టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం
2018 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం
2017 ఏషియన్ అథ్లెటిక్
చాంపియన్ షిప్‌లో బంగారు పతకం
2016 ప్రపంచ అండర్
20 చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం
2016 దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం
2016లో ఏషియన్ జూనియర్
చాంపియన్ షిప్‌లో రజత పతకం
జాతీయ స్థాయిలో జావెలిన్ త్రోలో
వ్యక్తిగత రికార్డు(88.07మీటర్లు).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News