Home తాజా వార్తలు నేడే ‘నీట్’

నేడే ‘నీట్’

NEET Exam across the country today

దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు
తెలంగాణలో 7 పట్టణాల్లో ప్రవేశ పరీక్ష డ్రెస్‌కోడ్ నిబంధనలు
పాటించాలని ఎన్‌టిఎ సూచన బూట్లు వద్దు చెప్పులతోనే
రావాలని అభ్యర్థులకు ఆదేశం హాజరుకానున్న 16 లక్షల మంది

మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో తెలంగాణ నుంచి దాదాపు 55 వేలు, ఎపి నుంచి సుమారు 50 వేల మంది ఉన్నారు. రాష్ట్రలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్‌నగర్ పట్టణాల్లో 112 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి పట్టణాల్లో 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ఇంగ్లిష్,హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెస్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఒక గంట ముండే పరీక్షా కేంద్రానికి రావాలి. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు. ఈ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా పరీక్ష రానే విద్యార్ధులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రకటించింది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆభరణాలు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, పర్సు, చేతి గడియారాలకు అనుమతి ఉండదని ఎన్‌టిఎ తెలిపింది.

ఈ ఏడాది 200 ప్రశ్నలు

నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే 180 ప్రశ్నలకే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్‌టిఎ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 83 వేల 75 ఎంబిబిఎస్, 26,949 బిడిఎస్, 52,720 ఆయుష్, 525 బివిఎస్, ఎహెచ్, 1,899 ఎయిమ్స్, 249 జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

పెన్ను పరీక్షా కేంద్రంలోనే ఇస్తారు

నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్‌టిఎ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు కచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు. చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. మంచి నీళ్ల బాటిల్, ఆహార పదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటి సీసాను అనుమతిస్తారు. ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, హెల్త్ బ్యాండ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్‌టిఎ స్పష్టం చేసింది.

డ్రెస్ కోడ్ నిబంధనలివే

నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించారు. అబ్బాయిలైనా , అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్లు వేసుకోవద్దు. అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పరు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి. వ్యాలెట్ ,పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దని ఎన్‌టిఎ తెలిపింది.