Home జాతీయ వార్తలు నీట్ పిజి కోర్సుల కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు బ్రేక్…

నీట్ పిజి కోర్సుల కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు బ్రేక్…

NEET-MDS counselling will not start without approval

 

ఒబిసి, ఇడబ్లూఎస్ రిజర్వేషన్లపై తీర్పు ఇచ్చేవరకూ నిలిపి వేయాలని కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీ: నీట్ పిజి కోర్సుల్లో ఒబిసి, ఇడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలుపై తీర్పు వెల్లడయ్యేవరకూ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సోమవారం జస్టిస్ డివై చంద్రచూడ్,జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు నిర్ణయం వెల్లడయ్యే వరకూ కౌన్సెలింగ్ నిర్వహించబోమని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది అరవింద్ దత్తార్ ధర్మాసనం దృష్టికి తేగా, కేంద్రం తరఫున వివరణ ఇచ్చారు. సోమవారం మరో నోటిఫికేషన్‌లో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు వివరణ ఇస్తామని నటరాజు తెలిపారు. వైద్యవిద్య పిజి కోర్సులైన ఎండి, ఎంఎస్, ఎండిఎస్‌ల్లో ఒబిసిలకు 27 శాతం, ఇడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి వీలుగా ఈ ఏడాది జులై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసిసి) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. ఇటీవల ఎంసిసి విడుదల చేసిన మరో నోటిఫికేషన్‌లో ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారని, దాంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ల తరఫున ధర్మాసనానికి తెలపడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. ఇదే విచారణలో అక్టోబర్ 21న మరో అంశంపైనా కేంద్రానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉన్నవారికి కూడా వర్తింపజేయడంపై కేంద్రం నుంచి వివరణ కోరింది. ఒబిసిల్లో రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారిని మీగడ తరగతి(క్రీమీ లేయర్)గా చెబుతూ రిజర్వేషన్లకు అనర్హులుగా చేశారు.

అదే ఆదాయం ఉన్న ఇడబ్లూఎస్ వర్గానికి రిజర్వేషన్లు ఎలా వర్తింపజేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ పరిమితి అన్నది మీ ఇష్టమైనా అందుకు రాజ్యాంగపరంగా సరైన హేతుకత ఉందా.? లేదా..? అన్నది తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వారం రోజుల్లో తమ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ప్రాతిపదికన ఒబిసి రిజర్వేషన్లకు 340 అధికరణం ప్రకారం రాజ్యాంగబద్ధత ఉన్నదని సుప్రీంకోర్టు 1992 మండల్ తీర్పులోనే స్పష్టం చేసింది. అగ్రకులాలలోని పేదలకు కల్పిస్తున్న ఇడబ్లూఎస్ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉన్నది. ఇడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలు సుప్రీంకోర్టు గతంలో విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమిస్తుంది.

NEET-MDS counselling will not start without approval