Home జాతీయ వార్తలు నీట్ పాక్షిక నిలిపివేత

నీట్ పాక్షిక నిలిపివేత

ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం
ప్రభుత్వ సీట్లకు నీట్ నుంచి మినహాయింపు
మేనేజ్‌మెంట్ కోటాకు ప్రైవేట్, డీమ్డ్ వర్శిటీలకు వర్తింపు

neetన్యూఢిల్లీ: నీట్‌పై నెలకొన్న గందరగోళం ముగిసింది. నీట్ పరీక్షలు నిర్వ హించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మినహాయిం పులు ఇస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత ఏర్ప డింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్ వైద్య కళాశాలలోని ప్రభుత్వ కోటాను ఈ ఏడాది నీట్ నుంచి ఆర్డినెన్స్ మినహాయించిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా వెల్లడించారు. ఈ సీట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉమ్మడి పరీక్షల ద్వారా గాని నీట్ ద్వారా కానీ భర్తీ చేసుకోవచ్చని అన్నారు. ఈ రెండిట్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ కట్టబెట్టిందని అన్నారు. జూన్ 24న జరగనున్న నీట్ రెండో దశ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని అన్నారు. ప్రయివేట్ వైద్య కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లతో పాటు ప్రయివేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లను దేశవ్యాప్తంగా నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2016 డిసెంబర్‌లో జరగనున్న మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లను నూటికి నూరుశాతం నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తమిళనాడు, పాండిచ్చేరి మాత్రం ఈ ఏడు ఇంటర్మీటియేట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎం.బి.బి.ఎస్, బి.డి.ఎస్ సీట్లను భర్తీ చేసుకుంటున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తమిళనాడు, పాండిచ్ఛేరి కూడా నీట్ పరిధిలోకి రానున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు పార్లమెంట్ సమావేశాలు మే 13న ముగియడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఆరు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఈ ఏడు నుంచే నీట్ పరీక్షను అంగీకరించాయని చెప్పారు. ప్రయివేట్ వైద్య కళాశాలలకు లబ్ది చేకూర్చేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. మేనేజ్ మెంట్ కోటాలోని సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.ఉన్నత వైద్య సీట్ల భర్తీలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం నీట్‌కు మద్ధతు పలికిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అయితే రాష్ట్రాల సాధకపాదకాలను పరిశీలించిన మీదట విద్యార్థుల ప్రయోజనార్థం ఈ ఏడాది నీట్‌కు మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు వెల్లడించారు. మెజార్టీ రాష్ట్రాలు, పలు పార్టీలు, పలువురు ఎంపీలు నీట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ఈపాటికే పలు రాష్ట్రాలు వైద్య సీట్ల భర్తీకోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడంతో పాటు కేవలం రెండు నెలల సమయంలో కొత్త సిలబస్ చదువుకొని మరీ  విద్యార్థులను ఇంగ్లీష్ లేదా హిందూ మాధ్యమంలో పరీక్షలు రాయాల్సిందే అని బలవంతం చేయడం భావ్యం కాదనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు సమర్థించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో లక్షలాది మంది విద్యార్థులకు ఊరట లభించిందని అన్నారు. కేంద్ర క్యాబినెట్ జారీ చేసిన ఆర్డినెన్స్ తన కార్యాలయానికి చేరుకున్న వెంటనే కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డాకు కబురు పెట్టిన రాష్ట్రపతి భవన్‌కు పిలిపించుకొని మరీ ప్రణబ్ ముఖర్జీ తన అభ్యంతరాలను అన్నింటినీ నివృత్తి చేసుకున్నారు. ఆతర్వాత న్యాయనిపుణులతో సంప్రదించి చివరకు సోమవారం ఆర్డినెన్స్‌పై రాజముద్ర వేసి నాలుగు రోజుల చైనా పర్యటకు బయలుదేరారు. మరోవైపు కేంద్రమంత్రి జె.పి.నడ్డా జనీవాలో జరుగున్న ఆరోగ్య సదస్సులో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ నీట్‌పై ఆర్డినెన్స్ కారణంగా తన పర్యటన వాయిదా వేసుకొని రాష్ట్రపతితో సమావేశమై ఆయన సందేహాలన్నింటిని నివృత్తి చేశారు.