Home ఆదిలాబాద్ ప్రాణాంతక నిర్లక్ష్యం

ప్రాణాంతక నిర్లక్ష్యం

  • జిల్లాలో అమలుకాని బయో మెడికల్
  • వెస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు
  • అధికారుల అలసత్వం
  • ఇబ్బందుల్లో కార్మికులు

Bio-Medicalమన తెలంగాణ / ఆదిలాబాద్: దశాబ్దాలుగా అధికారులు అలసత్వం వీడక పోవడం పరోక్షంగా పారిశుద్ద కార్మికుల పాలిట ప్రాణాంతంగా మారుతోంది. మామూలు చెత్తను ఏరేయడానికి సైతం చేతులకు తొడుగులు అందించాలని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటుండగా, అదే వైద్య వ్యర్ధాల విషాయానికి వస్తే ఆ నిబంధనలు మరింత కట్టుదిట్టుంగా అమలుచేయాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడ కూడా ఈ నింబంధనలు మచ్చుకైన అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్థాయిల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 500లకు పైగా ఉండగా సదరు ఆసుపత్రుల నుంచి ప్రతి నిత్యం వెలువడే వైద్య వ్యర్థాలు క్వింటాళ్ల కొద్ది ఉంటున్నాయి. అసలే ఆదివాసీల సంఖ్య ఎక్కువగా, అక్షరాస్యత అవగాహన కలిగిన జనాలు తక్కువగా ఉన్న జిల్లాలో బయో మెడికల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ అమలు కాక పోవడం తీవ్రపరిణామాలకు దారి తీస్తోంది. నిబంధనల ప్రకారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దీని కోసం ప్రత్యేకంగా సోసైటీలను ఎంపిక చేసి ఈ వెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీనిలో స్థానిక మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బాధ్యతకూడా అదే స్థాయిలో ఉంటుంది.
అధికారుల అలసత్వం : వైద్య వ్యర్థాల నిర్వహాణ విషయంలో నిబంధనలు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. స్థానికంగా ఎక్కడికక్కడ మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముందుగా సమాలోచనలు జరిపిన అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సోసైటీలను ఎంపిక చేసి బయోమెడికల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ పనులను వారికి అప్పగించాల్సి ఉటుంది. నిరంతర పర్యవేక్షణతో ఈ పనులను సక్రమంగా కొనసాగేలా చూడాల్సి ఉంటుంది. అలాగే జనావాసాలకు కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో సదరు సోసైటీలు వైద్య వ్యర్థాల డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా ఉండే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు చెందిన పారిశుద్ద విభాగంలో పని చేసే కార్మికులకు ఈ వైద్య వ్యర్థాల తరలింపుకోసం ప్రత్యేకంగా చేతులకు, కాళ్ళకు తొడుగులు ప్రత్కేక డ్రెస్సులు అందించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యర్థాల తరలింపు క్రమంలో చోటు చేసుకొనే పొరపాట్లు అవకతవకలపై సంబంధింత సోసైటీతో పాటు సదరు ఆసుపత్రులపైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నింబంధనలు ఏవి కూడా జిల్లాలో మచ్చుకైన అమలవుతున్న దాఖలాలు లేక పోవడం అధికారుల అలసత్వం, విధి నిర్వహణ పట్ల వారి నిర్లక్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.
అవస్తలెన్నో…: జీవవైద్య వ్యర్థాల నిర్వహణ విషయంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్షం వైఖరి కారణంగా జిల్లా కేంద్రంతో పాటు మిగితా అన్ని ప్రాంతాల్లోని ప్రజలు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. సాధారణ చెత్తనుండి సైతం బ్యాక్టీరియా వెలువడుతుందన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఆసుపత్రులలో నుండి వెలువడే వైద్య వ్యర్థాల నుండి మరింత భయంకరమైన బ్యాక్టిరియా క్రిములు వెలువడుతుంటాయి. కొన్ని రకాల రోగులకు చికిత్స సమయంలో ఇచ్చే సూదులు, అందించే సెలెన్‌ల సిరంజ్‌లలో సదరు జబ్బులకు సంబంధించిన వ్యాధి కారక క్రిములు కొన్ని రోజుల పాటు జీవించి ఉంటాయి. ఇలాంటి వైద్య వ్యర్థాల పట్ల సంబంధిత శాఖల అధికారుల నిర్లక్షం ఆయా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆనారోగ్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగులకు కొత్త జబ్బులకు కారణమౌతోంది. అలాగే వీటి తరలింపు విషయంలో ప్రత్యేక చర్యలు ఏవి చేపట్టకుండా సాధారణ చెత్త తరలింపు మాదిరిగానే నిర్వహిస్తుండటం, సదరు పారిశుద్ద కార్మికులకు కనీసం కాళ్లుచేతులకు తొడుగులు అందించక పోవడంతో వైద్య వ్యర్థాల తరలింపు సమయాల్లో వాటిలోని సూదులు, సిరంజిలు గుచ్చుకొని కొత్త రోగాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
నోటీసుల జారీతోనే సరి : జీవ వైద్య వ్యర్థాల నిర్వహణకు సంబంధించి జిల్లాలో సంబంధిత యంత్రాంగం కేవలం నోటీసుల జారీతోనే పని ముగించి చేతులుదులుపుకుంటున్నారు. పక్క జిల్లాలైన కరీంనగర్‌లో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ 2006 నుండి అమలులో ఉండగా, నిజామాబాద్‌లో 2010 నుండి ఇది అమలులో ఉంది. అయితే ఇక్కడ మాత్రం 2011 జూలై మాసంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి సహా 93 ప్రభుత్వ ప్రైవేటు నర్సింగ్ హోమ్, ఆసుపత్రులకు మున్సిపల్ సానిటరీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే సమయంలో జిల్లాలోని మిగితా ప్రాంతాల్లోనూ ఆసుపత్రులన్నింటికీ ఇదే తరహా నోటీసులు జారీ చేసినప్పటికీ అటు తరువాత మాత్రం ఈ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పోక పోవడం గమనార్హం. అప్పట్లో సోసైటీల ఎంపిక కోసం కొంత హడావుడి చేసిన సంబంధిత అధికారులు ఆ తరువాత ఆ విషయాన్ని మరుగున పడేయడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ది ఏపాటిదో స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు తగు దృష్టి సారించి జీవ వైద్య వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టి తమ ఆరోగ్యాలను కాపాడాలని సాధారణ ప్రజానికంతో పాటు పారిశుద్ద కార్మికులు కోరుకుంటున్నారు.
కొంత మేర కొనసాగుతుంది : జిల్లా కేంద్రంలో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కొంత మేర కొనసాగుతుందని ఆదిలాబాద్ మున్సిపల్ సానిటరీ అండ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఆయాజ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ సోసైటీకి ఈ పనులను అప్పగించామని, అయితే వారు తమతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకు సంబంధించిన వైద్య వ్యర్థాలను మాత్రమే సేకరించి తీసుకవెళ్తున్నారని, వారంలో రెండు మార్లు ఈ వ్యర్థాలను తరలించుకుపోతున్నట్లు ఆయాజ్ పేర్కొన్నారు.