Thursday, April 25, 2024

భారత – ఆస్ట్రేలియా బంధం

- Advertisement -
- Advertisement -

Negotiations between Modi and Scott Morrison

 

మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం, సరిహద్దుల్లో చైనాకు, భారత్‌కు మధ్య ఉద్రిక్తతలు ఈ మూడు కారణాల వల్ల శుక్రవారం నాడు మన ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య కుదిరిన ఒప్పందాలకు విశిష్టత కలుగుతున్నది. వీరిద్దరి మధ్య జరిగిన దృశ్యమాధ్యమ చర్చల్లో 7 ఒప్పందాలు కుదిరాయి. అందులో ముఖ్యమైనది సైనిక సదుపాయాల పరస్పర వినియోగానికి సంబంధించినది. తమతమ రక్షణ స్థావరాలను అంటే యుద్ధ నౌకలు, విమానాలు సహా మిలిటరీ సదుపాయాలను రెండు దేశాలు ఉపయోగించుకోడానికి చెందిన ఒప్పందం ఇది. ఇటువంటి ఒప్పందాలను ఇంతకు ముందు అమెరికా, ఫ్రాన్సు, సింగపూర్‌లతో భారత్ కుదుర్చుకున్నది. ప్రస్తుతం కుదిరిన ఒప్పందంతో భారత, ఆస్ట్రేలియాలు తమ నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోడానికి, కలిసి సైనిక విన్యాసాలు వంటివి నిర్వహించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది.

హిందూ మహా సాగరం, పసిఫిక్ సముద్ర తీరాలతో కూడిన భారత పసిఫిక్ ప్రాంతాన్ని దక్షిణ చైనా సముద్రం గుండా అదుపులో పెట్టుకోవాలని చైనా పడుతున్న ఆరాటం నేపథ్యంలో ఈ ఒప్పందానికి అసాధారణ ప్రాధాన్యం కలుగుతున్నది. చైనా దిగుమతి చేసుకునే చమురులో 80 శాతం ఈ ప్రాంతం గుండానే వస్తున్నది. ఆ నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించడానికి ముందు హిందూ మహా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా ప్రయాణిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2017 నవంబర్‌లో జరిపిన తన మొట్టమొదటి ఆసియా పర్యటనలో భారత పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాల మధ్య క్వాడ్ చతుర్ముఖ బంధాన్ని పటిష్ఠ పర్చవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పాడు. ఈ ప్రాంతంలోనే చైనా తన ప్రతిష్ఠాత్మక, అత్యంత ఖర్చుతో కూడిన అంతర్జాతీయ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేస్తున్నది. ఆఫ్రికాలోని జిబౌటి, పాకిస్థాన్‌లోని గ్వాదర్, శ్రీలంకలో గల హంబన్‌టోట రేవులలో, ఇంకా మాల్దీవులు, టాంజానియాల్లో తన నౌకాదళ ఉనికిని పెంచుకుంటున్నది.

ఈ దేశాలకు పలు రకాల సహాయాలు చేస్తూ అక్కడ తన ప్రాబల్యాన్ని ఇనుమడింప చేసుకుంటున్నది. చైనా తన సముద్ర సరిహద్దుల బయట నౌకాదళ బలాన్ని మెరుగుపర్చుకోడం, తద్వారా తనకు బయటి నుంచి వచ్చే కీలక సరఫరాల మార్గాలను కాపాడుకోడం ప్రథమ లక్షంగా పావులు కదుపుతున్నది. దీనికి ప్రతిగా కీలక పాత్ర పోషించడానికే అమెరికా క్వాడ్ వ్యూహాన్ని రూపొందించి అమలు పరుస్తున్నది. ఇందుకు సహకరించే విషయంలో ఆస్ట్రేలియాకున్న స్వేచ్ఛ, నిష్పూచీ పరిస్థితి భారత దేశానికి లేవు. చైనాతో సరిహద్దులను భారత్ పంచుకుంటున్నందున, వాస్తవాధీన రేఖ పొడవునా దానితో వివాదాలున్నందున మనం క్వాడ్ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. చైనాతో మన వ్యవహార శైలి ఇప్పటి వరకు అందుకు తగిన జాగ్రత్తలతోనే సాగుతూ వస్తున్నది. సరిహద్దుల పరంగానే కాక వాణిజ్యం విషయంలోనూ చైనాపై ఆధారపడవలసిన రంగాలు మనకున్నాయి.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందం భారత్‌ను మరింతగా అమెరికా ఒడిలోకి చేరుస్తుందని అనిపించడం తప్పు కాదు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో కుదిరిన ఒప్పందం హిందూ మహా సముద్రం పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ ఒడంబడికలు సూచిస్తున్న శాంతియుత వాతావరణం కొనసాగాలని ఎవరి ప్రాబల్యం లేకుండా అందరి నౌకలు స్వేచ్ఛగా ఈ జలాల్లో ప్రయాణం చేసేందుకు దోహదపడేలా ఇక్కడ పరిస్థితులుండాలని ఆశిస్తున్నది. దీనికి ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. కాని తన రవాణా నౌకలకు సురక్షిత కవచాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో చైనా ఈ ప్రాంతాన్ని తన అదుపాజ్ఞలలో పెట్టుకోదలచినప్పుడే సమస్య తలెత్తుతుంది.

అప్పుడు క్వాడ్ సభ్య దేశంగా ఇండియా, అమెరికాతో కలిసి అడుగులు వేయవలసి వస్తుంది. అది చైనాకు కంటకింపు అవుతుంది. ఒక వైపు చైనాతో సహకారాన్ని సత్సంబంధాలను కోరుకుంటూనే మరో వైపు అమెరికాతో గతం కంటే ఎక్కువ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోడం ఇండియాకు గడ మీద నడక వంటి సున్నితమైన వ్యవహారమే. అయితే ఎల్లకాలం చైనా పట్ల గాజు పాత్ర పట్టుకున్నంత అతి జాగ్రత్తతో కూడిన వైఖరిని పాటిస్తూ పోవడం కంటే మన స్వతంత్రతను పెంచుకోడమే అభిలషణీయం. ఈ దృష్టితో చూసినప్పుడు ఆస్ట్రేలియాతో కుదిరిన సైనిక ఒప్పందం ఆ వైపుగా వేసిన మరో ముందడుగుగానే భావించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News