Saturday, April 20, 2024

పొగమంచుకావల వెలుగు

- Advertisement -
- Advertisement -

దూరంగా బాల్కనీలోంచి ఒక అలసిన పావురం నన్నే చూస్తోంది. నేను వడ్లగింజలేరట్లేదు అక్షరాల్ని మొలిపిస్తున్నానని అన్నాను దానితో అయిన వింటానని వచ్చి ఒద్దికగా కూర్చొంది! ‘(నేను-పావురం-నీ కోసం)పై వాక్యాల్లో గీతా వెల్లంకి చెప్పిన సందర్భం వేరు కావచ్చు కానీ ఇక్కడ పాఠకులు డార్క్ ఫాంటసీని చదువుతూ పావురాలుగా మారిపోతారు. అలసిపోయిన మనసులు సేదతీరుతాయి. తాను మొలిపించిన అక్షరాలను మనసుతో తింటూ ఊహాజగత్తులోకి వెళ్ళిపోతారు.
ప్రేమంటే ఎవరికి చేదు. అసలు అన్ని సమస్యలకు మూలం ప్రేమ రాహిత్యం. అందరి మనసుల్లో అందరిపట్ల ప్రేమభావం ఉంటే ఎలాంటి కోపతాపాలు ఉండవు. సృష్టిలో అన్నిటికీ మూలం ప్రేమ. అలాంటి ప్రేమకు అక్షరాలతో మాల కట్టారు. ఆ మధురానుభూతిని పొందటం మన వంతు.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయే గాక నాకేటి వెఱపు – అంటూ తన స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటారు కృష్ణశాస్త్రి గారు. అలాగే కవయిత్రి గీతా వెల్లంకి కూడా భావకవిత్వాన్ని తనదైన శైలిలో మన ముందుంచారు.
వారి ముందుమాటలో చెబుతూ ఇందులో ‘తాను, నేను ఇద్దరం ఒక్కటే. నన్ను నేను ఇష్టపడుతూ రాసుకున్న కవిత్వం‘ అంటుంది. ఆత్మాశ్రయ కవిత్వం అయినప్పటికీ అది పాఠకుల మనసులలోకి వెళ్ళాక మారక తప్పదు. ఎవరికి వారు తమ ప్రేమలోని అనుభూతిని, మాధుర్యాన్ని పొందగలుగుతారు. ఎన్నో ఎదురుచూపులు, మరెన్నో విరహబాధలు ప్రేమికులై ఆస్వాదిస్తారు. ప్రేమలో మునిగి తేలేవారికి స్వప్నలోకాలను చూపిస్తుంది. ప్రేమను తేలికగా చూసేవారికి ప్రేమ రుచిని చూపిస్తుంది.

గిరగిరా తిరిగే మనసుకు నీ ఆకర్షణ తప్పా గురుత్వాకర్షణ లేదని నిరూపిస్తుంది. ఒకరికొకరు కలవడం కోసం ఎదురు చూడటం, విడిపోయాక బాధపడటం సహజం కానీ ‘ప్రతీసారీ నీ ఆగమనానికి ముందుగానే నేను వియోగానికి సిద్ధమౌతుంటాను‘(దగ్ధగీతం) అనడంలో ఎంతో పరిపక్వత సాధించింది. అంతటి భావన ఎవరికి సాధ్యం.
అలాగే చెప్పే ప్రతి భావాన్ని ఎంతో సున్నితంగా వర్ణించడం గమనించవచ్చు. ‘ఒక్క మంచుబిందువునై నువ్వు నడిచేటప్పుడు నీ పాదానికి అంటుకోవాలని,’ ‘వర్షపు సమయాల్లో నాపై కురిసే ప్రతి చినుకూ నీవే కావాలని‘ (డార్క్ ఫాంటసీ) కోరుకుంటుంది.

ప్రేమ మత్తు ఎంతటిదంటే ‘ఈ నిరుపమ రాత్రిలో బహుశా నీ ప్రేమతో ఏ మద్యమూ ఇవ్వలేని నిషాను పొందాను‘(నిషేధ రాత్రి) ఇంతకంటే తారాస్థాయిలో ఇంకెలా చెప్పగలం. పాఠకుల్ని కూడా ఆ మత్తులో ముంచేస్తుంది.
ఎక్కడెక్కడో ప్రపంచమంతా తనకోసం వెతికిన తాను చివరికి తెలుసుకున్నదేమిటంటే… ‘వెతకాల్సింది నీకోసం కాదని తప్పిపోయింది నేనని నేను దొరికేది నీ హృదయంలోనేనని ఇప్పుడే తెలిసింది‘(వెతుకులాట) ఎదురుచూపులో, అన్వేషణలో ఎన్నో భావాలు అలలై పొంగుతాయి కానీ వాటన్నిటినీ పక్కనపెట్టి చివరగా కొత్త భావాన్ని పలికిస్తుంది. ‘నిరీక్షణే మా ఉనికిప్పుడు‘ (నేనూ ఒక డాల్ఫిన్) అంటూ ముగిస్తుంది. నిరీక్షించడం కూడా ఉనికిగా భావించి ఉండిపోవడం అంటే ఎదురుచూపులో ఎంత గొప్ప ఆరాధానో, తాదాత్మ్యమో అవగతమౌతుంది.

అలాగే ఆ నిరీక్షణలోనే మరో భావాన్ని ఇలా పలికిస్తారు. ‘చీకటి గుహల్లోని ప్రాచీన ప్రేమ లిపిని సాంకేతిస్తూ.. నేనొక ఆశ్చర్యకరమైన అగాథంలా వేచి ఉంటాను‘ (హృదయాగాథం) ఎంత చీకటిలో ఉన్నా, ఎంత అగాథంలో ఉన్నా నిరీక్షణ ఎప్పటికీ అందంగానే ఉంటుందనేది ఆమె భావన. ‘కనుచూపు మేరలో నువ్వుండాలంటే రెప్పలు మూసుకొని ఉండటమే‘ (నిరీక్షణా క్షణాలు) ‘గుండె కవాటం మీద కూర్చుని కాళ్ళూపుతూ కనిపించావు నీ స్థానం అదే కదా మరి‘ (ప్రేమ కురిసిన రాత్రి) అంటూ గమ్మత్తుగా చెబుతుంది.

నీవు లేవు అందుకే ‘వాస్తవంగా నేనిప్పుడే నీవులేని శూన్య హృదయ పూర్ణను‘ (శూన్య పూర్ణ) ఎంతో తాత్వికత నిండిన జీవితాన్ని చూపే మాటలివి. శూన్య హృదయంతో ఉన్నా కూడా నేనిప్పుడు సంపూర్ణను అని చెప్పడం ఎంతటి ధైర్య వచనం.
కవితలన్నింటిలో ఎదురుచూపులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. జ్ఞాపకాలు ఉన్నాయి, విరహం ఉంది, వియోగం ఉంది. కానీ బాధతో దుఃఖాన్ని కురిపించడం కాదు, దాన్ని దాటుకునే తత్వాన్ని కలిగిస్తుంది. తాత్వికతను అందిస్తుంది.
నాన్నంటే, నా మౌలాలీ, అమ్మ – కాలువ, డిప్రెషన్ చెట్టు లాంటి కొన్ని కవితలు తప్పా మిగతావన్నీ ప్రేమ భావనతో నిండిన కవితలే. అందుకే ఇదొక ప్రేమ సముద్రం, ఇదొక ప్రేమ స్వప్నలోకం. ఈ ‘డార్క్ ఫాంటసీ‘ ప్రేమను పంచే, ప్రేమను చూపించే దీర్ఘ కవితగా చెప్పుకోవొచ్చు. అందంగా, హాయిగా లలితమైన పదాలతో నదిలా నడుస్తుంది. అలాగే ఆధునిక భావజాలం కూడా కనిపిస్తుంది. నేటి తరానికి దగ్గరగా వాడుక పదాలతో, సాంకేతిక పదాలతో కవిత్వం పండించారు. సరళమైన పదాలతో సాగినా అక్కడక్కడ చషకాలు, స్మృతుల సురాబిందువులు, విహ్వలిత, కెంజాయ, స్వస్నావిష్ట, సంగమాపేక్ష, నిర్నిమేషం లాంటి ఎన్నో సందర్భోచితమైన చిక్కని పదాలను కూడా వాడారు.

ముందుమాటలో డా. నాగసూరి వేణుగోపాల్ గారు చెప్పినట్లు ‘ఒక్క మోహసుగంధం గురించే కాదు అన్ని జీవన బంధాల గురించి అలవోకగా, బలంగా, ప్రభావవంతంగా చెప్పగలరు. అయితే ఒక్క విషయాన్నే ఎంత భిన్నంగా చెప్పగలరో ఇందులో నిరూపించారు.‘అలాగే ముందుమాటలో డా. శిలాలోలిత గారు అన్నట్లు ‘వారి కవితల్లో తాత్వికత ఎక్కువే. ఇంతటి నిర్మలమైన ప్రేమను పొందిన వారి ఘనత విలక్షణమైనది. ఈ స్వచ్ఛరూప ప్రేమ దొరకడమే ఒక అపురూపం. ఈ జాజ్వల్యమాన కిరణ సందోహమే ఆమె హృది. నేలా నింగి తరతరాలుగా ప్రేమకాంక్షతో ఎగసిన భావోద్వేగ సందోహమే ఈ కవిత్వం. ‘అక్కడ ఆ పొగమంచుకావల నువ్వే ఉన్నావు, నాకు తెలుసు అందుకే ఆ వెలుగు!’ ఆ వెలుగు ఎవరికి కనిపిస్తుందో భావాత్మక హృదయులకు బాగా తెలుసు. ఒంటరిగా ఉన్నా, వేదనతో ఉన్నా నువ్వున్నావనే భావన ఎంతకాలమైనా బతికిస్తుంది. అదే భావన ఈ అక్షరాల నిండా కనిపిస్తుంది. ‘కవిత్వం ఒక రససిద్ధి కవిత్వం ఒక అమరత్వం‘ (కవి – కవిత్వం) గీతా వెల్లంకి తన కవిత్వంలో రససిద్ధిని సాధించారు, తన కవిత్వంతో ప్రేమను అమరత్వం చేశారు. ప్రేమతో నిండిన ప్రతి హృదయంలోకి ఒంపుకునే కవిత్వం, ప్రేమతో పంచుకునే కవిత్వం.

పుట్టి గిరిధర్
9494962080

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News