Home అంతర్జాతీయ వార్తలు నయా గండం ‘నియో’ కోవ్

నయా గండం ‘నియో’ కోవ్

NeoCov virus found in bats may pose threat to humans

 

దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో వైరస్ గుర్తింపు
మనుషులకూ వ్యాపించే అవకాశముందన్న వుహాన్ శాస్త్రవేత్తలు
సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!
అది సార్స్‌కోవ్2 వైరస్ కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
మనుషులకు వ్యాపించడంపై మరింత అధ్యయనం అవసరమని స్పష్టీకరణ

బీజింగ్: ఓ వైపు సార్స్‌కోవ్ 2( కరోనా మహమ్మారి)లో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. అంతకన్నా ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘ నియోకోవ్’ (neo cov)అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా విస్తరించే లక్షణంతో పాటుగా మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయడం ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఉండే గబ్బిలాల్లో ఈ నియోకోవ్’ వైరస్ బయటపడింది. ఇది కూడా కరోనా వైరసేనని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు( కొవిడ్19 తొలిసారి వెలుగు చూసింది ఇక్కడే) పరిశోధనలు జరపగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం ఇది జంతువులనుంచి జంతువులకు మాత్రమే సోకుతున్న వైరస్‌గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువులనుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నియోకోవ్ వైరస్ గబ్బిలాల్లోని యాంజియో టెన్సిస్ కన్వర్టింగ్ ఎంజైమ్( ace-2)ను ప్రభావవంతంగా వాడుకుంటుంది. దీనితో పోలిస్తే మనుషులలోని ace 2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థం కాస్త తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వుహాన్ యూనివర్సిటీ, బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా తోటి వారి సమీక్ష( పీర్ రివ్యూ) జరపలేదు.

వ్యాప్తి, మరణాలు ఎక్కువే
కొవిడ్19తో పోలిస్తే నియోకోవ్ వైరస్ కాస్త భిన్నమైనదే కాక ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీ బాడీలు, కొవిడ్ వ్యాక్సిన్లు కూడా దీనికి పని చేయకపోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా 2012 2015 మధ్య మధ్యప్రాచ దేశాల్లో విజృంభించిన మెర్స్‌కోవ్ మాదిరిగా నియోకోవ్‌తో అధిక మరణాలు ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక సార్స్‌కోవ్2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమదం ఉందని అంటున్నారు. కాగా ఈ కథనంపై రష్యాకు చెందిన వెక్టార్ వైరస్ స్టేట్ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీఅండ్ బయో టెక్నాలజీ నిపుణులు స్పందించారు.‘ నియోకోవ్‌పై చైనా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల గురించి తమకు కూడా తెలుసునని అన్నారు. అయితే ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే ఉన్నందున దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అన్నారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సార్స్‌కోవ్ 2 కాదు: డబ్లుహెచ్‌ఓ
కాగా వుహాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా నియోకోవ్ సార్స్‌కోవ్2 వైరస్ కానీ, దాని వేరియంట్ కానీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్లుహెచ్‌ఓ) తెలిపింది. అది ‘మెర్స్’ కరోనావైరస్‌కు సంబంధించినదని కూడా తెలిపింది. ఇది మనుషులకు ప్రమాదకరమా కాదా అనే విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి రష్యా ‘టాస్’ వార్తాసంస్థకు తెలిపారు. వుహాన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం గురించి డబ్లుహెచ్‌కు తెలుసునని, దీనిపై ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఎఒ)తో టచ్‌లో ఉందని కూడా ఆ ప్రతినిధి తెలిపారు.

NeoCov virus found in bats may pose threat to humans