పోఖరా : అంతర్జాతీయ మహిళల ట్వంటీ20 క్రికెట్లో నేపాల్ క్రికెటర్ అంజలీ చాంద్ కొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణాసియా క్రికెట్ గేమ్స్‌లో భాగంగా మాల్దీవులతో జరిగిన మ్యాచ్‌లో అంజలీ కొత్త రికార్డును సృష్టించింది. మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంజలీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అసాధారణ రీతిలో చెలరేగిన అంజలీ సున్నా పరుగులకే ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.
ట్వంటీ20 క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ఇన్ని వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంజలీ ఈ అరుదైన ఘనతను సాధించి క్రికెట్లో సరికొత్త ఆధ్యాయానికి తెరలేపింది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ కూడా ఆరు వికెట్లు తీశాడు. అయితే చాహర్ ఏడు పరుగులిచ్చుకున్నాడు. కాగా, అంజలీ ధాటికి మాల్దీవ్స్ 16 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ ఐదు బంతుల్లోనే విజయాన్ని అందుకుంది.