Home తాజా వార్తలు దొంగతనం చేసిన నేపాలీ దంపతుల అరెస్టు

దొంగతనం చేసిన నేపాలీ దంపతుల అరెస్టు

Nepali couple arrested in gachibowli theft case

 

రూ.8లక్షల నగదు, కిలో పది గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
మొత్తం రూ.68.23 లక్షల సొత్తు పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ/హైదరాబాద్: పనిచేస్తున్న ఇంటికే కన్నమేసిన నేపాల్ దేశానికి చెందిన దంపతులను రాయదుర్గం, మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8లక్షల నగదు, 1.1కిలోల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.68.23 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి స్టిఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. నేపాల్ దేశం, కోలీకోట్ జిల్లా, అన్‌చల్ పోలీస్ స్టేషన్, గోల్‌పూర్, పాల్‌చోర్ గ్రామానికి చెందిన లంక బహదూర్ సాహి అలియాస్ లక్ష్మణ్, ఖడ్‌కే పవిత్ర అలియాస్ పానా భార్యభర్తలు ఐదు నెలల క్రితం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్‌లో ఉంటున్న వ్యాపారి బీరం గోవింద్ రావు ఇంటిలో పనికి చేరారు. లంక బహదూర్ సాహి వాచ్‌మెన్‌గా, పవిత్ర ఇంట్లో పనిచేసేది. ఐదు నెలల నుంచి ఇద్దరు యజమానికి నమ్మకంగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన గోవింద్ రావు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న గంగాధర్ రెడ్డి కూతురు పుట్టువెంట్రుకలు తీసేందుకు శ్రీశైలం వెళ్తాన్నాడు.

గోవింద రావు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడంతో అందరు కలిసి శ్రీశైలం వెళ్లారు. వెళ్తూ వాచ్‌మెన్ లంక బహదూర్‌కు చెప్పి వెళ్లాడు. అప్పటికే సమయం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఇంట్లో డబ్బులు, బంగారు ఆభరణాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకున్నారు. యజమాని వెళ్లిన రాత్రి ఇంట్లోని సిసి కెమెరాల వైర్లను కట్ చేసి కిటికీ గ్రిల్ తొలగించి ఇంటి లోపలికి వెళ్లాడు. ఐరన్ రాడ్‌తో బెడ్‌రూమ్ డోర్ తెరిచి కప్‌బోర్డులో ఉన్న లాక్ తాళం చెవిని తీసుకుని అందులోని రూ.8లక్షల నగదు, 1.1 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు రాజగోపాల్ రెడ్డి, లాల్‌మదర్, బాలరాజు, ఎస్‌ఓటి ఎస్సై విజయ్‌వర్దన్, హెచ్‌సిలు బద్రినాథ్, ఆనంద్‌గౌడ్, పిసిలు మురళీ, అశోక్‌కుమార్, ఆనంద్ రెడ్డి, అశోక్ తదితరులు పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు సైబరాబాద్ సిపి రివార్డులను అందజేశారు.

ఫేస్‌బుక్‌లో ప్రేమ…
లంకా బహదూర్ సాహి అలియాస్ లక్ష్మణ్ ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత మానివేసి గ్రామంలో వ్యవసాయం చేసేవాడు. బతుకు దెరువు కోసం 2003లో ముంబాయికి వచ్చి హోటల్‌లో పనిచేశాడు, తర్వాత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేశాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన కడ్కే పవిత్రను 2012లో వివాహం చేసుకున్నాడు. పవిత్రకు అప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కలిసి నేపాల్‌కు చెందిన యామ్‌లాల్ సాయంతో నగరంలోని గోవింద రావు ఇంట్లో పనికి చేరారు.

Nepali couple arrested in gachibowli theft case