Home అంతర్జాతీయ వార్తలు ఓలికి నేపాల్ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

ఓలికి నేపాల్ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

Nepal's top court orders reinstatement of parliament

 

రద్దు చేసిన ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తూ చరిత్రాత్మక తీర్సు
13 రోజుల్లోగా సభను సమావేశపర్చాలని ఆదేశించిన రాజ్యాంగ ధర్మాసనం

ఖాట్మండు: నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలికి మంగళవారం ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అధికార కమ్యూనిస్టు పార్టీ అధికారం కోసం ప్రత్యర్థులతో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రతినిధుల సభను రద్దుకు సిఫార్సు చేసి మధ్యతర ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రద్దయిన ప్రతినిధుల సభను తిరిగి ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి చోలేంద్ర షంషేర్ నేతృత్యంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. అంతేకాదు రాబోయే 13 రోజుల్లోగా సభను సమావేశ పర్చాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రధాని ఓలి సిఫార్సు మేరకు నేపాల్ అధ్యక్షుడు బిద్యాదేవ్ భండారీ గత డిసెంబర్ 20న ప్రతినిధుల సభను రద్దు చేసి ఏప్రిల్ 30, మే 10 తేదీల్లో తాజాగా ఎన్నికలను ప్రకటించడంతో నేపాల్ రాజకీయ సంక్షోభంలో పడిపోయింది.

సభలో తనకు 64 శాతం మెజారిటీ ఉందని, అయినప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని, అందువల్ల దేశంలో సుస్థిరతను సాధించడం కోసం తాజాగా ప్రజల తీర్పును కోరాల్సిన అవసరం ఉందని సభను రద్దు చేయాలని సిఫార్సు చేసూ ్త భండారీకి రాసిన లేఖలో ఓలి పేర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభను రద్దు చేయాలన్న ఓలి నిర్ణయంపై అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సహ అధ్యక్షుడు అయిన పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’ నేతృత్వంలోని వర్గంతీవ్రంగా మండిపడింది. పార్లమెంటు దిగువ సభ అయిన ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 13 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ చీఫ్ విప్ దేవ్ ప్రసాద్ గురుంగ్ దాఖలు చేసిన రిట్ కూడా వీటిలో ఉంది. ప్రధాన న్యాయమూర్తితో పాటుగా న్యాయమూర్తులు బిశ్వంభర్ ప్రసాద్ శ్రేష్ఠ, అనిల్ కుమార్ సిన్హా, సపన మల్ల, తేఝ్ బహదేర్ కెసిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై గత జనవరి 17నుంచి ఈ నెల 19దాకా విచారణ నిర్వహించింది. అయితే ఓలి తీసుకున్న నిర్ణయం అధికార కమ్యూనిస్టు పార్టీ నిలువునా చీలిపోవడానికి కారణమైంది.

గత నెలలో ప్రచండ నేతృత్వంలోని వర్గం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఓలిప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే కాదు రెండు వర్గాలు కూడా తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని, తమకే పార్టీ గుర్తు కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా న్యాయస్థానంలో ఓలిపై విజయం సాధించినందుకు ప్రచండ నేతృత్వంలోని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం ప్రచండ సొంత పట్టణమైన చిత్వాన్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించడం కోసం ప్రచండతో పాటు మరో సహ ఆధ్యక్షుడు నేపాల్‌లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.