* మహిళ దుర్మరణం
*మరి ఇద్దరికి గాయాలు
*హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రంక్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం
మన తెలంగాణ/ సిటీబ్యూరో : మద్యం మత్తులో నడిపిన వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయాలకు గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మాదాపూర్‌లో బ్రైట్ స్పార్క్ ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్న పాల విష్ణువర్దన్ (35) గత శనివారం రాత్రి తన మిత్రుడి వద్ద మద్యం సేవించి మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 మీదుగా (టిఎస్ 09 ఇవి 7707) కారులో వెళ్తున్నాడు. అతని మద్యం పాయింట్లు 206గా నమోదయ్యాయి. కాగా, తాడేపల్లి గూడెంకు చెందిన మస్తానీ (35) గత రెండేళ్ళ క్రితం నగరానికి వచ్చి శ్రీనగర్ కాలనీలో నివసిస్తూ బ్యూటిషియన్, జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితురాళ్ళు వైజాగ్‌కు చెందిన అనూషారెడ్డి అలియాస్ ప్రియారెడ్డి(29) నగరంలో ఉంటున్నారు. కూకట్‌పల్లిలో తన అత్త ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న అనూష(19)కు వీరు పరిచయస్తులు. శనివారం రాత్రి మాదాపూర్ నుండి మస్తానీ, ప్రియారెడ్డిలు కలిసి కూకట్‌పల్లిలోని అనూష ఇంటికి వెళ్ళారు. తిరిగి మాదాపూర్‌కు స్కూటర్‌పై వీరు ముగ్గురు వెళ్తున్నారు. ప్రియారెడ్డి నడుపుతుండగా మస్తానీ మధ్యలో, వెనుక అనూష కూర్చున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో వీరి స్కూటర్‌ను విష్ణువర్థన్ కారు ఢీ కొట్టింది. దీంతో మస్తానీ అక్కడికక్కడే మృతి చెందగా అనూష డివైడర్‌కు ఢీకొనగా తలకు బలమైన గాయమైంది. ప్రియారెడ్డీ గాయాలకు గురయ్యారు. వీరిని ఢీకొట్టిన విష్ణువర్థన్ మరికొంత దూరం వెళ్ళి కారును డివైడర్‌కు ఢీకొట్టాడు. అదే మార్గంలో ప్రయాణిస్తున్నవారు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విష్ణువర్థన్‌ను అరెస్టుచేశారు.
ప్రమాదాలిలా…నగరంలో మద్యంమత్తులో వాహనాలు నడపరాదని నిరంతరం తనిఖీలు జరుపుతున్నా వాహనదారులు ఆ మత్తును వీడటం లేదు. ప్రమాదాలను చేయకా మానడంలేదు. మందుబాబులు మత్తులో విచక్షణ కోల్పోయి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. గత రాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 14 మంది వాహనాలను సీజ్ చేశారు. 14 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో ముగ్గురు యువతులు ఉండటం గమనార్హం. 2017లో రోడ్డు ప్రమాదాలు 277 జరిగాయి. అందులో 285 మంది మరణించారు. గాయపడినవారు 2133లు. పాదచారులు మరణించింది 125 మంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నమోదైన కేసులు 17,265. విధించిన జరిమానా రూ. 2, 16, 28, 600లు. జైలు శిక్ష పడింది 3.803 మందికి. ఎంవి చట్టం ప్రకారంగా నమోదైన కేసులు 30, 57, 721లు. జరిమానా రూ. 24, 17, 88, 980లుగా ఉన్నవి.
నిత్యం కౌన్సిలింగ్… మత్తులో వాహనాలను నడిపేవారిని పట్టుకుని నిత్యం కౌన్సిలింగ్‌ను పోలీసులు జరుపుతున్నారు. యువకులకు వారి కుటుంబ సభ్యులను పిలిచి మరీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మద్యం సేవించి నడిపే పద్దతికి పుల్‌స్టాప్‌పెట్టడంలేదు. ఆ క్రమంలోనే నిత్యం టివిలో ఉండే ప్రదీప్ వంటి యాంకర్ కూడా పోలీసులకు చిక్కాడు. అతని మద్యం పాయింట్లు 178గా నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. ఆస్థాయి మత్తులో ఉన్న అతను కూడా వాహనాన్నితోలుతే రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు, పాదచారులకు ప్రమాదమనేది విష్ణువర్థన్ చేసిన ఘోర ప్రమాదం వెల్లడిస్తుంది. ఇది ఎక్కువగా సంపన్నవర్గాలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నందున అక్కడ నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.