Thursday, March 28, 2024

కృష్ణా – మాగనూర్ లైన్ పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మహబూబ్‌నగర్ మునీరాబాద్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా నారాయణపేట జిల్లా మాగనూర్ నుండి కృష్ణా వరకు నూతన బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో తొలి విడతగా సరుకు రవాణా రైళ్లను నడిపించుకుంటున్న దమ రైల్వే అధికారులు త్వరలోనే ప్రయాణికుల రైళ్ల రాకపోకలనూ అధికారికంగా ప్రారంభించనున్నారు. కృష్ణా మాగనూర్ స్టేషన్‌ల మధ్య 12.7 కి.మీ దూరం మేర కొత్త బ్రాడ్ గేజ్ విద్యుత్ రహిత ప్రధాన లైన్ పనులు ఇటీవలే పూర్తి అయ్యాయి. ఈ నూతన రైల్వే లైన్ తెలంగాణ కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు కావడం విశేషం. మహబూబ్ నగర్ దేవరకద్ర విభాగం ఇప్పటికే సికింద్రాబాద్ కర్నూల్ మధ్య గల సెక్షన్‌లో ఉండగా ఇప్పుడు ఈ కొత్త రైల్వే లైన్ దేవరకద్ర నుండి జక్లేర్, మాగనూర్ మీదుగా కృష్ణా వరకు 66 కిలో మీటర్ల మేర దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొత్తం పనులు పూర్తి అయినట్లయింది. మహబూబ్‌నగర్ మునీరాబాద్ నూతన లైన్ ప్రాజెక్టు చేపట్టేందుకు గాను రూ. 3543 కోట్ల అంచనా వ్యయం వేశారు.

దేవరకద్ర కృష్ణా మధ్య 66 కిమీల మేర విస్తరించి ఉన్న లైన్ పనుల పూర్తికి గాను రూ. 943 కోట్లు వ్యయం అయినట్లు దమ రైల్వే లెక్కలు చెబుతున్నాయి. కాగా దేవరకద్ర జక్లేర్ మధ్య 28.3 కిమీల సెక్షన్ మార్చి 2017లో పూర్తికాగా, జక్లేర్ నుండి మక్తల్ మధ్య 11.5 కిమీల సెక్షన్ 2020 ఆగస్టులో, మక్తల్ మాగనూర్ మధ్య 13.3 కిలో మీటర్లు విస్తరించి ఉన్న సెక్షన్ పనులు మార్చి 2022లో పూర్తయ్యాయి. ఇప్పుడు మాగనూర్ కృష్ణా మధ్యగల చివరి భాగమైన 12.7 కిమీల నిడివి గల నూతన రైల్వే లైన్ పనుల పూర్తితో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గల మొత్తం సెక్షన్ పనులు పూర్తి అయినట్లైంది. దేవరకద్ర కృష్ణా మధ్య విభాగంలో పనులు పూర్తి కావడంతో ఇప్పుడు ఈ లైన్ గుండా హైదరాబాద్ నుండి దక్షిణాది రాష్ట్రాల్లోని రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా వంటి అనేక ముఖ్యమైన నగరాలకు అత్యంత అందుబాటులో ఉండే మార్గంగా మారనుంది.

ఇప్పుడు ఇతర మార్గాల ద్వారా రవాణా చేస్తున్న ఇనుప ఖనిజం , సిమెంట్,ఉక్కు మొదలైన ఇతర భారీ వస్తువులను నూతనంగా నిర్మించిన ఈ ప్రత్యామ్నాయ మార్గంలో రవాణా చేయవచ్చు. ఈ నూతన ప్రాజెక్టు హైదరాబాద్, కర్నాటక రాష్ట్రాల మైనింగ్ బెల్ట్ మధ్య రైళ్ల అనుసంధానతను విస్తరించడంతో పాటు ప్రయాణికుల వస్తువుల రవాణా రెండింటికీ ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ప్రధాన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించిన నిర్మాణశాఖకు చెందిన అధికారులను అలాగే హైదరాబాద్ డివిజన్‌కు చెందిన అధికారులను సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా కొత్త ప్రాంతాలకు రైళ్ల అనుసంధాన ప్రక్రియ సుగమంమైందని, అలాగే సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాకు మరిన్ని రైళ్లను ప్రవేశ పెట్టడంలో సహాయపడుతుందని జిఎం అరుణ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News