Home వార్తలు కొత్త కోచ్ మన క్రీడా సంస్కృతిని అర్థం చేసుకోవాలి

కొత్త కోచ్ మన క్రీడా సంస్కృతిని అర్థం చేసుకోవాలి

dhoniముంబయి: కొత్త కోచ్‌గా వచ్చే వ్యక్తి దేశీయ క్రీడా సంస్కృతిని అర్థం చేసుకోవాలని ధోనీ మంగళవారం అన్నాడు. ఇదిలా ఉండగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ) గత వారం ప్రధాన కోచ్ నియుక్తి కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులు స్వీకరించడానికి జూన్ 10ని గడువుగా పెట్టింది. ఇప్పుడు టీమిండియాకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ఊపందుకుంది. తన దశాబ్దకాల క్రికెట్ కెరీర్‌లో ధోనీ అనేక మంది కోచ్‌లను చూశాడు.ధోనీకి లాల్‌చంద్ రాజ్‌పుత్, ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టెన్, జింబాబ్వేకు చెందిన డంకన్ ఫ్లెచర్ వంటి కోచ్‌లతో కలసి ఆడిన అనుభవం ఉంది. టీమిండియా కొత్త చీఫ్ కోచ్‌కు హిందీ భాష తప్పనిసరి రావాలని బిసిసిఐ షరతు విధించడాన్ని ధోనీ సమర్థించాడు. కోచ్‌కు దేశానికి సంబంధించిన సంస్కృతి తెలిసుండాలని అన్నాడు. భాష సంస్కృతి కాదు కానీ కోచ్‌కు దేశ సంస్కృతి తెలిసుండాలన్నాడు. జింబాబ్వేతో పరిమిత ఓవర్లు ఆడే పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధోనీ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ప్రధాన కోచ్ పదవికి ఇప్పటికే సందీప్ పాటిల్, రవిశాస్త్రి తమ దరఖాస్తులు దాఖలు చేశారు. తదుపరి భారతీయ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడమనేది బిసిసిఐ నియమించబోయే ఎంపిక సంఘానికి సవాలు కాగలదు.
జింబాబ్వేతో ఆడబోయే కొత్త జట్టుకు కెప్టెన్సీ ఓ సవాలు…
భారత క్రికెట్ జట్టు జూన్ 11 నుంచి జింబాబ్వేలో ఆడబోతున్నది. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త జట్టుతో జింబాబ్వేతో ఆడబోవడాన్ని సవాలుగా తీసుకుంటున్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేరు. సీనియర్లు లేని జట్టుతో ఆడబోవడం తనకిదే కొత్త అనుభవం కానుందని ధోనీ అన్నాడు. ఒకే రకమైన ఆటగాళ్లున్నప్పుడు నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలు స్పష్టంగా తెలిసుంటాయని, కానీ కొత్త జట్టుతో ఆడడమనేది తనకు కొత్త జట్టుతో ఆడడం మరో అనుభవాన్ని ఇవ్వనుందని ధోనీ అన్నాడు. జింబాబ్వేకు భారత జట్టు బయలుదేరే ముందు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పాడు. జట్టులోని కొత్తవాళ్ల బలాబలాలేమిటో అంచనా వేయాల్సి ఉంటుందని, అదే సమయంలో జట్టు సమతుల్యతను, మేళవింపును పర్యవేక్షించాల్సి ఉంటుందని, ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూడాల్సి ఉంటుందని అన్నాడు. తమ జట్టు మెరుగైనదేనని కూడా అన్నాడు.
జూన్ 11 నుంచి 22 వరకు హరారేలో జింబాబ్వేతో ఆడబోయే క్రికెట్ మ్యాచ్‌లలో మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, అనేక టి20 మ్యాచ్‌లు ఉండనున్నాయి. జింబాబ్వేతో ఆడబోయే మ్యాచ్‌ల లో టాస్ అనేది కీలకమని ధోనీ అన్నాడు. ఒకవేళ డే గేమ్ టాస్ ఆడితే అది కీలకమ వుతుందని, అందుకు పరిస్థితు లను, అనుకూలతలను అనుసరించా ల్సి ఉంటుందని వివరించాడు. బ్యాటింగ్‌తో పోల్చినప్పుడు బౌలింగే అంతర్జాతీయ స్థాయిలో ఉందని ధోనీ అభిప్రాపడ్డాడు. కాగితంపై బౌలింగ్ బాగానే కన్పిస్తుందని, వారు బౌలింగ్ చేసేప్పుడు తాను చూశానని, వారి బౌలింగ్ చాలా వరకు మెరుగుపడిందన్నారు. జస్ప్రీత్ బుమ్రా, బరిందర్ శరణ, అక్షర్ పటేల్, యుజ్వేందర్ చాహల్ వంటి బౌలర్లు పరిమిత ఓవర్లు వేయడంలో రాటుదేలారని, ఇంకా జయంత్ యాదవ్ కూడా ఉన్నాడని ధోనీ తెలిపాడు. బ్యాటింగ్ సాట్లు కోరుకున్న విధంగా దొరకవని, ఏ స్లాట్లో పంపించినా బ్యాట్స్‌మెన్ అందుకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని అన్నాడు. గేమ్ ఎంతగా అర్థం చేసుకున్నామనేది, మార్పుకు ఎంతగా అలవాటు పడ్డమన్నది ప్రధానమవుతుందన్నాడు. మొత్తంగా చూస్తే భారత జట్టు మెరుగ్గానే ఉందని చెప్పాడు. ప్రతిభను గుర్తించడానికి ఐపిఎల్ వేదికే కీలకమని తాను ఎప్పుడూ చెబుతుంటానని తెలిపాడు. అందులో అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం ఉంటుందని, అది దేశీయ క్రికెట్ కంటే వేరైనదని వివరించాడు. ఐపిఎల్ ఆడేప్పుడు వేరే రకమైన ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటించ బోయే భారత జట్టు బాగానే ఉందని, జట్టులోని వారంతా మంచి ప్రతిభావంతులని, చక్కని ఫీల్డర్లని తెలిపాడు.