Home రంగారెడ్డి శంషాబాద్‌లోనే కొత్త కలెక్టరేట్?

శంషాబాద్‌లోనే కొత్త కలెక్టరేట్?

త్వరలోనే అధికారికంగా ఖరారు

Shamshabad

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మిగిలిన రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టరేట్‌ను శంషాబాద్‌లోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్‌ను రాజేంద్రనగర్ శివార్లలోని వెటర్నరీ కళాశాలలో ఏర్పాటు చేయడానికి కసరత్తులు నిర్వహించినా సమయాభావంతో పాటు అక్కడ కావలసిన సౌకర్యాలు లేక లక్డీకాపూల్‌లోని పాత కలెక్టరేట్‌లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను కొనసాగించడానికి నిర్ణయించిన అధికారులు కొత్త భవనం నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త జిల్లాలో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌లను నిర్మించా లని భావిస్తుండటంతో రంగారెడ్డి కలెక్టరేట్‌ను సైతం హైద్రా బాద్‌లో కొనసాగించకుండా రంగారెడ్డి జిల్లాలోనే అందరికి అనుకూ లంగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించాలని డిసైడ్ అయిన యంత్రాంగం ఈ మేరకు ప్రభుత్వంకు ప్రతిపాధనలు పంపించినట్లు తెలిసింది. జిల్లాలోని మెజారీటి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు స్థలాల ఎంపిక చేయాలని నిర్ణయించడంతో ఈమేరకు అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. గతంలో తమ నియోజకవర్గాల్లోనే తాత్కలిక జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు పట్టుబట్టడంతోనే తాత్కలిక కలెక్టరేట్ ఎంపిక చేయకుండా నగరంలోనే కొనసాగించారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటు ముందు కు పోతున్నట్లు అవసరమైన పక్షంలో పార్టీ పెద్దలు రాజీ కుదిర్చి శంషాబాద్ ఫైనల్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.
శంషాబాద్‌వైపు మొగ్గు…
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మొదట శంషాబాద్ కేంద్రంగానే కొత్తగా శంషాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ముసాయిదా నోటిఫికేషన్‌లో ప్రకటించిన అనంతరం జరిగిన పరిణామాలతో కె.వి.రంగారెడ్డి స్వగ్రామం పెద్దమంగళారం వికారాబాద్ జిల్లా నుంచి శంషాబాద్‌లో కలవడంతో శంషాబాద్ జిల్లాను ఫైనల్ నోటిఫికేషన్‌లో రంగారెడ్డి జిల్లాగా మార్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు జాతీయ రహదారులకు అనుకోని ఉండటంతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు వంటి రవాణ సౌకర్యాలు కావలసిన భూములు సైతం పుష్కలంగా ఉండటంతో పాటు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో జిల్లా కేంద్రం ఇక్కడే నిర్మించాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న శేరిలింగంపల్లి, చెవెళ్ళ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, మహేశ్వరం, ఎల్.బి.నగర్, ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లో మెజారీటి నియోజకవర్గాలకు అనుకూలంగా ఉండటం సైతం శంషాబాద్‌కు కలసివస్తుంది. శంషాబాద్‌లోని సర్వే నెంబర్ 620,621లోని 46 ఎకరాల హెచ్‌ఎండిఏ భూములలో కలెక్టరేట్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి సియం కార్యాలయంకు పంపించినట్లు సమాచారం. సదరు భూములను ఇటివల జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ స్వయంగా పరిశీలించి తుది నివేదికలను తయారు చేయడంతో దీనికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. శంషాబాద్‌తో పాటు ప్రత్యామ్నాయంగా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను సైతం గుర్తించి ప్రతిపాదనలు పంపించినప్పటికి శంషాబాద్ వైపు మొగ్గు చూపే అవకాశం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.